నేటి నుంచి తెలంగాణ కవితా సప్తాహం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మహాకవులు డాక్టర్ దాశరథి కృష్ణమాచార్య, డాక్టర్ సి.నారాయణరెడ్డిల జయంతిని పురస్కరించుకొని ఆదివారం నుంచి కవితా సప్తాహం కార్యక్రమాలు పెద్దఎత్తున నిర్వహిస్తున్నట్లు తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షుడు డాక్టర్ నందిని సిధారెడ్డి తెలిపారు. ఈ నెల 22న దాశరథి కృష్ణమాచార్య, 29న సి.నా.రె. జయంతి ఉందని, వీరి పేరుతో ఓ మంచి సాహిత్య కార్యక్రమం చేపట్టామని చెప్పారు. శనివారం రవీంద్రభారతిలో మీడియాతో ఆయన మాట్లాడుతూ కవితా సప్తాహంలో భాగంగా ప్రముఖుల ప్రసంగాలు, కవి సమ్మేళనాలు ఉంటాయని తెలిపారు. దాశరథి, సినారెల మధ్య సోదర సంబంధాలు ఉండేవని, వారిది అన్నాతమ్ముళ్ల అనుబంధమని పేర్కొన్నారు. 7 రోజులు జరిగే ఈ కార్యక్రమంలో భాగంగా రోజూ 40 నిమిషాలు ప్రధాన ప్రసంగం, 11 మంది కవుల కవితాపఠనం ఉంటాయన్నారు.
22న మహాకవి దాశరథి కవితాప్రస్థానంపై డాక్టర్ గురిజాల రామశేషయ్య ప్రసంగముంటుందని తెలిపారు. 23న ‘తెలంగాణ వచన కవితావికాసం’పై డాక్టర్ సుంకిరెడ్డి నారాయణరెడ్డి, 24న ‘తెలంగాణ పద్య కవితా ప్రాభవం’పై డాక్టర్ అనుమాండ్ల భూమయ్య, 25న ‘తెలంగాణ కవిత్వం – పాట ప్రస్థానం’పై డాక్టర్ పసునూరి రవీందర్, 26న ‘తెలంగాణ కవిత్వం–జీవితం’పై డాక్టర్ ఎస్ రఘు, 27న ‘తెలంగాణ కవిత్వం–అలంకారికత’పై డాక్టర్ లక్ష్మణచక్రవర్తి, 28న ‘తెలంగాణ కవిత్వ విమర్శ’పై డాక్టర్ జి.బాలశ్రీనివాసమూర్తి ప్రసంగాలు ఉంటాయని చెప్పారు. ఈ ఏడురోజుల కార్యక్రమాలకు ముఖ్యఅతిథులుగా డాక్టర్ కేవీ రమణాచారి, బుర్రా వెంకటేశం, దేశపతి శ్రీనివాస్, డాక్టర్ వెలిచాల కొండలరావు, దేవులపల్లి ప్రభాకర్రావు, డాక్టర్ ఆయాచితం శ్రీధర్, డాక్టర్ ఎన్ గోపిలు పాల్గొంటారని చెప్పారు. కార్యక్రమాలు రోజూ సాయంత్రం 6 గంటలకు రవీంద్రభారతి కాన్ఫరెన్స్ హాల్లో జరుగుతాయన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ కవితా సప్తాహం పోస్టర్ను విడుదల చేశారు. కార్యక్రమంలో అకాడమీ కార్యదర్శి డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి పాల్గొన్నారు.
రవీంద్రభారతిలో నేడు దాశరథి జయంతి
దాశరథి 94వ జయంతి కార్యక్రమం ఆదివారం రవీంద్రభారతిలో జరగనుంది. ఈ సందర్భంగా దాశరథి సాహితీ పురస్కారాన్ని ప్రముఖకవి వఝల శివకుమార్కు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అందజేయనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి అజ్మీరా చందులాల్ పాల్గొంటారని ప్రభుత్వ పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి బి.వెంకటేశం, భాషాసాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ ఓ ప్రకటనలో తెలిపారు.