డైలమాలో భాష పండిత అభ్యర్థులు
హైదరాబాద్: గురుకుల టీచర్, లెక్చరర్ పోస్టుల భర్తీకి నిర్వహించాల్సిన మెయిన్ పరీక్షలకు రివైజ్డ్ షెడ్యూల్ను త్వరలో ప్రకటిస్తామని టీఎస్పీఎస్సీ కార్యదర్శి వాణి ప్రసాద్ తెలిపిన నేపథ్యంలో భాషా పండితులు పరీక్షలు రాయనున్న అభ్యర్థులు ఆలోచనల్లో పడ్డారు. తమ పరీక్షలో కూడా టీఎస్పీఎస్సీ మార్పు చేయనుందా అని మల్లగుల్లాలు పడుతున్నారు. రాష్ట్రంలోని బాలికల గురుకుల విద్యాసంస్థల్లో ఖాళీగా ఉన్న బోధన, బోధనేతర సిబ్బంది పోస్టులన్నీ మహిళా అభ్యర్థులతోనే భర్తీ చేసేందుకు ఉమ్మడి హైకోర్టు అనుమతిచ్చింది. అయితే, నియామకాలు తాము వెలువరించే తుది తీర్పునకు లోబడి ప్రకటించాలని చెప్పింది.
దీంతో పరీక్షల రీషెడ్యూల్ రానుంది. అయితే, తొలుత కోర్టు విధించినప్పుడు ఆగస్టు 3వరకు నిర్వహించనున్న పరీక్షలు మాత్రమే వాయిదా అని టీఎస్పీఎస్సీ ప్రకటించింది. పీజీటీ భాషా పండితుల పరీక్షలు మాత్రం ఆగస్టు 27న, టీజీటీ భాషా పండితుల పరీక్షలు సెప్టెంబర్ 3న జరగాల్సి ఉన్నాయి. కోర్టు స్టే ప్రకారం ప్రకటించిన వాయిదా ప్రకటనలో భాషా పండితుల పరీక్షల షెడ్యూల్ లేదు. అయినప్పటికీ, తమ పరీక్షలు కూడా ఇక వాయిదా అయినట్లేనని నిరాశలోకి కూరుకుపోయిన అభ్యర్థులు కోర్టు తీర్పు వచ్చే వరకు వేచి చూద్దామనే ధోరణిలో ఉండిపోయారు.
తాజాగా స్టే ఎత్తివేయడం పరీక్షలకు రీషెడ్యూల్ త్వరలో వస్తుందని చెప్పడంతో తమ పరీక్షకు కూడా రీ షెడ్యూల్ వస్తే బాగుండని అభ్యర్థులు అనుకుంటున్నారు. గతంలో ప్రకటించిన ప్రకారమే ఆగస్టు 27, సెప్టెంబర్ 3నే భాషా పండితుల పరీక్ష నిర్వహిస్తే ఇప్పటి వరకు కోర్టు కేసుల కారణంగా నిరాశలోకి వెళ్లిన అభ్యర్థులు ఇప్పుడు మరింత ఒత్తిడితో తమ ప్రిపరేషన్ కొనసాగించాల్సిందే.