సురక్షిత తాగునీటికి ప్రాధాన్యం
పాలకొల్లు అర్బన్: రానున్న మూడేళ్లలో ప్రతి ఇంటికీ నేరుగా పైపులైన్ వేసి తాగునీరు అందించడానికి రూ.450 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించినట్టు కలెక్టర్ కాటంనేని భాస్కర్ తెలిపారు. లంకలకోడేరులో రిటైర్డ్ చీఫ్ ఇంజినీర్ జీవీఎస్ఎస్ఎన్ రాజు, రాజు వేగేశ్న ఫౌండేషన్ (విశాఖ) సంయుక్త ఆధ్వర్యంలో రూ.4.50 లక్షలతో నిర్మించిన ఎన్టీఆర్ సుజల పథకాన్ని బుధవారం ఆయన ప్రారంభించారు. ప్రతి ఇంటా ఇంటర్నెట్ అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని కలెక్టర్ చెప్పారు. పైపులైన్ ద్వారా నేరుగా గృహ యజమాని ఇంట్లోకి తాగునీరు అందించడం ద్వారా నీటి వృథాను అరికట్టవచ్చని అభిప్రాయపడ్డారు. 70 నుంచి 80 శాతం రోగాలు తాగునీరు ద్వారా వచ్చే అవకాశం ఉందని, దీనిని దృష్టిలో ఉంచుకుని సురక్షిత తాగునీరు అందించేందుకు కృషిచేస్తున్నామని చెప్పారు. ప్లాస్టిక్ వినియోగం, వ్యవసాయంలో ఎరువులు, పురుగు మందుల వాడకం పెరగడం వల్ల నీరు కలుషితమవుతోందన్నారు. జిల్లాలో 250 ఎన్టీఆర్ సుజల పథకాలు ఏర్పాటు చేశామని, మరో 230 ప్లాంట్లు ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. ఏఎంసీ చైర్మన్ గొట్టుముక్కల గాంధీభగవాన్రాజు, సర్పంచ్ తాళ్లూరి ధనలక్ష్మి, సొసైటీ ఉపాధ్యక్షుడు తాళ్లూరి ప్రకాశరావు, ఎంపీపీ పెన్మెత్స శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. అనంతరం పూలపల్లిలో సీసీ రోడ్డుకు కలెక్టర్ భాస్కర్ భూమిపూజ చేశారు.