మావోయిస్టుల కోసం గాలింపు
ముమ్మరంగా పోలీసుల తనిఖీలు
అనుమానిత ప్రాంతాల్లో భారీగా మోహరించిన బలగాలు
గొలుగొండ, న్యూస్‌లైన్ : పోలీసులు విస్తృత తనిఖీలు ముమ్మరం చేశారు. రాత్రి, పగలు తేడా లేకుండా తనిఖీలు చేపడుతున్నారు. అనుమానిత వ్యక్తులను విచారిస్తున్నారు. మారుమూల గిరిజన ప్రాంతాల్లో కూంబింగ్‌లు చేపడుతున్నారు. రెండురోజుల నుంచి గొలుగొండ, కేడీపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో భారీ ఎత్తున పోలీసు బలగాలు మైదాన గిరిజన ప్రాంతాల్లో పెద్ద ఎత్తున నిఘా ఏర్పాటు చేశారు. 2006 నుంచి ఇప్పటివరకు ఇంత పెద్ద ఎత్తున మండలంలో పోలీసు బలగాలు ఇది రెండోసారి.
కొయ్యూరు, గొలుగొండ మండలాల సరిహద్దు ప్రాంతాల్లో అనేక గిరిజన గ్రామాల్లో పోలీసులు గట్టి నిఘా ఏర్పాటు చేశారు. ఏజెన్సీ ముఖ ద్వారమైన కేడీపేట, గొలుగొండ ప్రాంతాల్లో ప్రభుత్వ వాహనాలు సైతం వదలకుండా తనిఖీలు చేపడుతున్నారు. మావోయిస్టులు ఈ రెండుస్టేషన్లపై నిఘా ఏర్పాటు చేశారన్న ఇంటిలిజెన్స్ రిపోర్టుతో పోలీసులు అప్రమత్తం అయ్యారు.
సుమారు 250 మంది పోలీసులు గాలింపు చర్యల్లో పాల్గొంటున్నారు. బుడ్డడపాడు, చంద్రయ్యపాలెం, అనంతసాగరం, నిమ్మగెడ్డ, శరభన్నపాలెం, నడింపాలెం, రామరాజుపాలెం, కేడీపేట, కొంగసింగి తదితర ప్రాంతాల్లో పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. శుక్ర,శని, ఆదివారాలు మూడురోజులు కొయ్యూరు, చింతపల్లి, జీకేవీధి వెళ్లే ప్రతి వాహనాన్ని తనిఖీలు చేస్తున్నారు.
2006, 09 సంవత్సరాల్లో మావోయిస్టులు గొలుగొండ స్టేషన్‌పై నిఘా ఉంచారని భావించి, అప్పట్లో పోలీసులు పెద్ద ఎత్తున కూంబింగ్ కార్యక్రమాలు చేపట్టారు. మరలా ఇప్పుడు అదే పరిస్థితి నెలకొంది. రెండుస్టేషన్ల పరిధిలో మావోయిస్టుల కోసం పోలీసులు పెద్ద ఎత్తున వేట సాగిస్తున్నారు. దీంట్లో భాగంగానే కేడీపేట ఎస్సై గోపాలరావు, గొలుగొండ ఎస్సై జోగారావు వాహనాల తనిఖీలు ముమ్మరం చేస్తూ అనుమానిత ప్రాంతాల్లో నిఘా పెంచినట్టు తెలుస్తోంది.