‘లస్కర్ల’కు లంగరు
దశాబ్దాలుగా భర్తీకి నోచుకోని లస్కర్ పోస్టులు
గాడి తప్పుతున్న సాగునీటి సరఫరా
శివారు ఆయకట్టుకు తప్పని ఇబ్బందులు
ఇప్పటికైనా నియామకాలు చేపట్టాలని రైతుల వేడుకోలు.
.
ఓ రైల్వే లైను పటిష్టంగా ... ప్రమాదరహితంగా ఉండాలంటే గ్యాంగ్మెన్ల నిరంతర పర్యవేక్షణ అవసరం. రైల్వే పట్టాను ప్రతి అంగుళం నిశితంగా పరిశీలించి లోపాలుంటే సరిచేస్తేనే ఆ రైలు సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకుంటుంది. అలాగే గలగల పారే నీరు కూడా. ఎటువంటి అవరోధాలు లేకుండా చివరి ఆయకట్టు వరకూ నీరు జలజలా పారితేనే పంటకు ఊపిరందుతుంది. చివరి నీటిబొట్టు కడవరకూ చేరాలంటే గ్యాంగ్ మెన్లలాగే పర్యవేక్షించే లస్కర్లుండాలి. కానీ ఈ పోస్టుల నియామకంపై నిషేధం ఉండడంతో సాగుకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
.
డెల్టా లాకులు మంజూరైన పోస్టులు ఖాళీలు
ఈస్ట్రన్ 14 174 92
సెంట్రల్ 17 198 110
వెస్ట్రన్ 27 306 221
హెడ్‌వర్క్స్ –– 221 131
.
రాయవరం (మండపేట):
సాగునీటి వ్యవస్థను అజమాయిషీలో కీలకపాత్ర పోషించే లస్కర్ పోస్టుల నియామకంపై నిషేధం ఉండడంతో నీటిపారుదల వ్యవస్థ అస్థవ్యస్తంగా తయారవుతోంది. శివారు పంట పొలాలకు సాగునీరు సక్రమంగా అందడానికి లస్కర్ వ్యవస్థను బ్రిటిష్ వారి హయాంలో ప్రవేశ పెట్టగా నేటి పాలకులు పట్టించుకోకపోవడంతో కాలువల వ్యవస్థ దెబ్బతినే పరిస్థితి నెలకొంది. దీన్ని మళ్లీ పునరుద్ధరిస్తే కాలువలు, గట్లు, స్లూయిస్‌లు, లాకులు వంటివాటికి రక్షణ ఏర్పడి శివారు ఆయకట్టుకు కూడా నీరందే అవకాశం ఉందని నీటి పారుదలరంగ నిపుణులు చెబుతున్నారు.
.
ఖాళీల భర్తీలో నిర్లక్ష్యం...
నీటి ఎద్దడి సమయంలో ముఖ్యంగా దాళ్వాను సాగునీటి సంఘాలు, రైతులు, అధికారులు కలిసి ఉమ్మడిగా గట్టెక్కించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అయితే ప్రతి పంటకూ అదేవిధంగా వ్యవహరించాలంటే సాధ్యమయ్యే పనికాదు. గోదావరిలో పుష్కలంగా నీరున్నా కాలువలు, పొలాలకు సక్రమంగా సాగునీరు సరఫరా చేయాలంటే క్షేత్రస్థాయిలో లస్కర్లు, గంటా కళాసీలు ఎంతో కీలకం. ఎప్పటికప్పుడు నీటి ప్రవాహాన్ని రైతుల అవసరరాలను దృష్టిలో ఉంచుకుని సాగునీరు పంపిణీ చేయాల్సి ఉంటుంది. నీటి ప్రవాహానికి అడ్డంకులు లేకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తేనే సాగునీరు పొలాలకు సాఫీగా చేరుతుంది.
.
రైతులతో మిళితమైన లస్కర్ల వ్యవస్థ... రైల్వేలైన్ వెంబడి పర్యవేక్షించే కీమెన్ పోస్టుల మాదిరిగానే పంట కాలువల పరిరక్షణకు లస్కర్ల అవసరం ఎంతో ఉంది. ప్రధాన పంట కాలువలు, మురుగు కాలువలతోపాటు మంచినీటి చెరువులకు కూడా కాపలా ఉండేవారు. పంట సమయంలో రాత్రి సమయాల్లో కూడా వాటర్ మేనేజ్మెంట్ చేయాల్సిన బాధ్యత వీరిపైనే ఉంది. అందుకే బ్రిటిష్ హయాం నుంచి రైతులతో లస్కర్ల వ్యవస్థ మిళితమై ఉండడంతో పంట పండగానే లస్కర్లకు కొంత ధాన్యాన్ని బహుమానంగా ఇచ్చే ఆచారం కూడా ఉంది. ప్రస్తుతం ఇదే పోస్టులో పేరు మార్పు చేసి కొన్ని పోస్టుల్లో హెల్పర్లు, మజ్దూర్లుగా పని చేస్తున్నారు. ప్రధాన కాల్వల పరిధిలోని పలుచోట్ల ఉన్న లాకుల వద్ద లాక్ సూపరింటెండెంట్ ఉండేవారు. ఆయనే దానికి అధిపతి. లాక్ సూపరింటెండెంట్ కింద మైలు కూలీలు, లస్కర్లు, గంటా కళాసీలు పని చేయాల్సి ఉంటుంది.
.
ప్రధాన విధులివీ..
పంట కాలువలను పరిరక్షిస్తూ వీరు కాలువ వెంబడి పర్యటించడం వీరి విధి. కాలువ పరిధిలో అపారిశుద్ధ్యం, చెత్తా చెదారం వంటి వాటిని ప్రజలు వేస్తే వారి అజమాయిషీతో నిషేధించేంవారు. పంట కాలువలోకి కలుషిత నీటిని వదిలితే చర్యలు తీసుకునే వారు. కాలువల్లో వ్యర్థాలు వేసినా శిక్ష తప్పదనే విధంగా ఉండేది. పంట కాలువల నుంచి అక్రమంగా తూరలు నిర్మించి నీటిని తోడుకోవడం వంటి వాటిని అరికట్టడం వీరి చేతుల్లోనే ఉండేది. గోదావరి, కృష్ణా డెల్టాల్లో ఈ విధానం అత్యంత పకడ్బందీగా అమలు జరిగేది. 1997లో అప్పటి టీడీపీ ప్రభుత్వం నీటి పంపిణీ వ్యవస్థలో భారీ మార్పులు చేసి, నీటి వ్యవస్థపై పెత్తనాన్ని నీటి సంఘాలకు అప్పగించింది.
.
ఇదీ దుస్థితిదీ...
గోదావరి డెల్టాలో ఈస్ట్రన్, సెంట్రల్, వెస్ట్రన్ డెల్టాలున్నాయి. ఈస్ట్రన్ డెల్టాలో 174 లస్కర్ పోస్టులకు 82, సెంట్రల్ డెల్టాలో 198 పోస్టులకు 80 మంది, వెస్ట్రన్ డెల్టాలో 306 పోస్టులకు 85 మంది విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ హెడ్‌వర్క్స్‌లో 221 మంది లస్కర్లు ఉండాల్సి ఉండగా 90 మంది విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ వ్యవస్థలో నియామకాలు జరగకపోవడంతో రిటైరయిన వారి స్థానంలో కొత్త పోస్టుల నియామకం దాదాపుగా నిలిచి పోయింది.
.
పోస్టులను భర్తీ చేయాలి..
నీటి వ్యవస్థలో లస్కర్ల విదానం రైతులకు ఎంతో మేలు కలిగిస్తుంది. పంట కాలువల పరిరక్షణకు ఈ వ్యవస్థ ఉత్తమం. అక్రమ తూరలు, కలుషిత వ్యర్ధాలు కాలువల్లోకి వదలకుండా పరిరక్షించే లస్కర్ల వ్యవస్థను పునరుద్ధరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. వెంటనే ఖాళీగా ఉన్న ఈ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయాలి. – కొవ్వూరి త్రినాథరెడ్డి, వైఎస్సార్సీపీ రైతు విభాగం కార్యనిర్వాహక ప్రధాన కార్యదర్శి, పసలపూడి, రాయవరం మండలం.
.
తాత్కాలిక పద్ధతిపై నియామకాలు..
లస్కర్ల నియామకాలు నిలిపివేశారు.కాలువల వెంబడి పరిరక్షించే ఈ పోస్టులపై నిషేధం ఉంది. గత 17 సంవత్సరాలుగా నియామకం జరగలేదు. అత్యవసర సమయాల్లో తాత్కాలిక సిబ్బందిని నియమిస్తున్నాం. లస్కర్ పోస్టులు ఖాళీగా ఉన్నచోట తాత్కాలిక పద్ధతిపై నియమిస్తున్నారు. – బి.రాంబాబు, ఎస్ఈ, నీటిపారుదల శాఖ.