కేసు గెలిచి, కోట్లు కాపాడుకున్న సౌదీ రాజు!
లండన్: దివంగత సౌదీ రాజు ఫహద్ కుమారుడు అబ్దుల్ అజీజ్ తన తండ్రి రహస్య భార్యకు నష్టపరిహారం చెల్లించే పరిస్థితి నుంచి బయటపడ్డారు. కొన్ని వందల కోట్ల రూపాయలను రాకుమారుడు తండ్రి మరణానంతరం ఆయన భార్యకు చెల్లించాలంటూ గత ఏడాది నవంబర్ లో కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఫహద్ మరణానంతరం జనన్ హర్బ్ అనే ఆమె సౌదీ రాజు తనను రహస్యంగా వివాహమాడారని కోర్టులో కేసు వేశారు. దీనిపై విచారణ జరిపిన జడ్జి ఆమెకు రూ. 154 కోట్లతో పాటు లండన్ లో రెండు ఫ్లాట్లు ఇవ్వాలని ఆదేశించారు.
దీనిపై రాకుమారుడు అబ్దుల్ అజీజ్ పైకోర్టులో అప్పీల్ చేసుకున్నారు. జడ్జి ఆమె పట్ల పక్షపాతం వ్యవహరించారని వేరే జడ్జితో కేసు విచారణ జరిపించాలని కోరారు. విచారణ చేపట్టిన మరో జడ్జి ఆమెకు పరిహారం చెల్లించాల్సిన అవసరం లేదని తీర్పు చెప్పారు. కాగా, బ్రిటీష్ జాతీయురాలైన హర్బ్ 1968లో ఫహద్ ను వివాహమాడినట్లు తెలిపారు. 1982లో రాజైన ఫహద్ 2005లో చనిపోయే ముందు తనను జీవితకాలం ఆర్ధికంగా నిలదొక్కుకునేలా చేస్తానని మాటిచ్చినట్లు చెప్పారు. 2003లో అజీజ్ తనకు రూ. 80 కోట్ల పరిహారంతో పాటు థేమ్స్ నది ఒడ్డున రెండు ఫ్లాట్లు ఇస్తానని వాగ్దానం చేసినట్లు తెలిపారు.