జననేతకు అపూర్వ మద్దతు
నర్సీపట్నం, న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర కోసం ఇప్పటివరకు రిలే నిరాహార దీక్షలు చేపట్టిన వైఎస్సార్సీపీ శ్రేణులు పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్రెడ్డి ఆమరణ దీక్షతో ఉద్యమాన్ని ఉధృతం చేశాయి. జననేతకు జిల్లా వ్యాప్తంగా అనూహ్య మద్దతు లభిస్తోంది. పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రాణత్యాగానికైనా సిద్ధమంటున్నారు. విశాఖలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, అభిమానులు పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి తమ మద్దతు ప్రకటించారు. ఆశీల్‌మెట్ట సంపత్ వినాయకుని ఆలయం వద్ద వైఎస్సార్సీపీ నగర,జిల్లా కన్వీనర్లు వంశీకృష్ణ శ్రీనివాస్, చొక్కాకుల వెంకటరావు ఆధ్వర్యంలో 101 కొబ్బరి కాయలు కొట్టారు. నర్సీపట్నంలో పార్టీ నాయకులు పీలా వెంకటలక్ష్మి, బేతిరెడ్డి విజయ్‌కుమార్, ఎం.డి.బాషాలు ఆదివారం నుంచి ఆమరణ దీక్షలు చేపట్టారు.
గొలుగొండ మండలంలో రాస్తారోకో చేపట్టారు. చోడవరంలో రిలే దీక్షలు పాటిస్తున్నారు. పార్టీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు అన్నంరెడ్డి అదీప్‌రాజ్, నాయకుడు బండారు సత్యనారాయణ దీనిని ప్రారంభించారు. చోడవరం, రోలుగుంట మండలాల యువజన విభాగం అధ్యక్షులు అల్లం రామఅప్పారావు, బండారు శ్రీనివాసరావు, గుడాల ప్రవీణ్‌కుమార్, కార్లె గీతాకృష్ణ, కొల్లి మురళీకృష్ణ దీక్షలో కూర్చున్నారు. చోడవరం నియోజకవర్గం ఎన్నికల పరిశీలకుడు పి.వి.ఎస్.ఎన్.రాజు, మాడుగుల నియోజకవర్గం నాయకుడు పి.వి.జె.కుమార్‌లు శిబిరానికి వచ్చి మద్దతు పలికారు.
మునగపాకలో రిలే నిరాహార దీక్ష చేపట్టారు. అంతకుముందు మెయిన్‌రోడ్డుపై పార్టీ నేతలు నియోజకవర్గ సమన్వయ కర్త బొడ్డేడ ప్రసాద్ ఆధ్వర్యంలో బైఠాయించి జగన్మోహన్రెడ్డికి మద్దతుగా నినాదాలు చేశారు. పాడేరులో నియోజకవర్గ సమన్వయకర్త సీక రి సత్యవాణి ఆధ్వర్యంలో కాగడాలు, కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు. పాతబస్టాండ్‌లోని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం ఎదుట కాగడాలతో జగన్మోహన్రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలని నినాదాలు చేశారు. అనంతరం కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు.