సూపర్ స్టార్‌తో సినిమా నా అదృష్టం
విదేశీ భామలు భారతీయ చిత్రాల్లో నటించడం కొత్త కాదు. అయితే, ఎక్కువ శాతం నృత్యగీతాల్లో కనిపిస్తుంటారు. ఎమీ జాక్సన్ వంటి ఏ కొందరో కథానాయికలుగా కూడా ఇక్కడ రాణిస్తుంటారు. ఇప్పుడు మరో విదేశీ భామ మన భారతీయ చిత్రంలో మెరవనున్నారు. అది కూడా తొలి చిత్రంతోనే ఏకంగా సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన నటించే అవకాశం దక్కించుకున్నారు. ఈ విదేశీ అందం పేరు ‘లారెన్ జె ఇర్విన్’. రజనీ సరసన ‘లింగా’లో నటిస్తున్నారు.
ఇంగ్లాండ్‌లో నటిగా, గాయనిగా, నృత్యకారిణిగా చేశానని, రజనీ సరసన నటించడం తన అదృష్టమని లారెన్ తెలిపారు. కొంచెం కొంచెం తమిళ్ నేర్చుకుంటున్నానని ముద్దు ముద్దుగా అన్నారు. ఇదిలా ఉంటే.. ‘లింగా’లో ఇప్పటికే అనుష్క, సోనాక్షీ సిన్హా కథానాయికలుగా నటిస్తున్నారు. కేయస్ రవికుమార్ దర్శకత్వంలో రాక్‌లైన్ వెంకటేశ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్లో లారెన్ పాత్ర వస్తుందని సమాచారం. రజనీ కాంబినేషన్లో లారెన్ తొలి సన్నివేశం చేసినప్పుడు, ‘బాగా నటించావు’ అని ఆయన అభినందించారట. ఆ విషయాన్ని తెగ ఆనందపడిపోతూ చెప్పారు లారెన్.