ఆహా..! సొరపిట్టు
♦ ఓ పట్టుపట్టు
♦ పసందైన వంటకం
♦ మాంసాహారులు లొట్టలేయాల్సిందే
♦ పాలసొర టేస్టే వేరు క్రేజీ నాన్వెజ్ డిష్
తాడేపల్లిగూడెం :
సొరపిట్టు. ఇది తమిళనాడు బ్రాండ్ వంటకం. చూడగానే నోరూరిస్తుంది. మాంసాహార ప్రియులే కాకుండా శాకాహారులూ ఒక్కసారి టేస్టు చూస్తే పోలా అనుకునేలా ఉండే లావిష్ డిష్ ఇది. సముద్రపు చేపలకు మనప్రాంతంలో డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. సముద్రపు సొర చేపలతో చేసే ప్రత్యేకమైన వంటకం పిట్టు. ఇది ఇటీవల ప్రత్యేక మెనూగా మారింది. విందులు, వినోదాలలో పాలుపంచుకుంటోంది. భుజించడానికి రుచికరంగా ఉండటంతోపాటు ముళ్ల వంటి బెడద లేకపోవడం దీని ప్రత్యేకత. నరసాపురం, అంతర్వేదిల నుంచి సొర చేపలు భీమవరం మార్కెట్కు వస్తున్నాయి. అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు రవాణా అవుతున్నాయి. దీంతో వీటి కొనుగోలుకు మాంసాహార ప్రియులు ఆసక్తి చూపుతున్నారు. ఎవరైనా సొరపిట్టు కూర ఒక్కసారి తింటే.. కోరిమరీ మళ్లీమళ్లీ చేయించుకోవాలనుకుంటారు. దీనిలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
రెండురకాల సొరలు
సొర చేపలలో రెండు రకాలు ఉన్నాయి. ముంబై వంటి ప్రాంతాల నుంచి వచ్చేవి ఓ రకం. మన ప్రాంతంలో పాలసొరలు ఎక్కువగా దొరుకుతాయి. ఈ రకం చేప ధర కిలో రూ.300 వరకు ఉంది. ముంబై నుంచి వచ్చే సొరలు పెద్దవిగా ఉంటాయి. ఇవి కిలో రూ.150కి దొరుకుతాయి. కానీ పాలసొరకున్నంత రుచి ముంబై సొరలకు ఉండదు.
చింతచిగురుతో వండితే వాహ్..
సొరచేపను నాలుగు రకాలుగా వండుకోవచ్చు. ఎక్కువగా సొరపిట్టుగా వండుతారు. సొర చేపను ముక్కలుగా చేసిన తర్వాత వాటిలో కొద్దిగా నీరు పోసి. చిటికెడు పసుపు వేసి స్టౌపై పది నిమిషాలు ఉడకనివ్వాలి. తర్వాత వేరే బాణీలో నూనె పోసి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, జీలకర్ర, అల్లం పేస్టు వేయాలి. పది నిమిషాలు వేయించిన తర్వాత అంతకు ముందు పసుపు వేసి ఉడికించిన సొర చేప ముక్కల పైతోలును తీసి ముక్కలను బాగా పిసకాలి.
అలా వచ్చిన పిట్టును వేయించిన ముక్కలలో వేయాలి. కొద్దిగా పసుపు, కారం, ఉప్పు చల్లి కలపాలి. పది నిమిషాల అనంతరం కరివేపాకు. కొత్తిమీర వేసి ఉడికించి ఐదు నిమిషాల తర్వాత దించాలి. దీనిని వేడివేడి అన్నంలో కలుపుకుని తింటే ఆ అనుభూతే వేరు. సొర పిట్టులో చింతచిగురు వేసి వండుకుంటే ఇంకా బాగుంటుంది. సొర ఇగురు, సొర పులుసు కూడా పెడతారు. కొందరు సొర పిట్టులో కోడిగుడ్డు సొనను కూడా వేసుకుని వండుకుంటారు. ఇదొక రుచి.