డీల్..!
వరంగల్, న్యూస్‌లైన్ : ఎన్పీడీసీఎల్లో వెలుగులోకి వస్తున్న అక్రమాలపై దూకుడు ప్రదర్శిస్తున్న సీఎండీ కార్తికేయ మిశ్రాను సాగనంపేందుకు డిస్కంలోని ఇంజినీర్లు పథకం పన్నారు. ఆయన బదిలీ కోసం కోట్లు ఖర్చు పెట్టేందుకు డీల్ కుదుర్చుకున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. ఇటీవల వరుసగా వెలుగులోకి వస్తున్న అవినీతి బాగోతాలు ఎన్పీడీసీఎల్‌ను కుదిపేస్తున్నాయి.
ఈ అక్రమాల్లో కంపెనీకి చెందిన పలువురు ఇంజినీర్లతోపాటు ఉన్నతస్థాయి సిబ్బంది వరకు పాత్ర ఉన్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో విజిలెన్స్ విచారణ చేపట్టగా... నివేదికలు తుది ద శకు చేరుకున్నాయి. పని చేసిన చోటల్లా అక్రమాలకు పాల్పడినట్లు విచారణలో రుజువైంది. కంపెనీకి చెం దిన కోట్ల రూపాయలు దుర్వినియోగమైనట్లు తేటతెల్లమైంది. దీంతో అక్రమార్కులు తమకు తిప్పలు తప్పవనే ఉద్దేశంతో మిశ్రాను బదిలీ చేసే పనిలో ప డ్డారు. ఏకంగా ఓ కేంద్ర మంత్రితో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. సీఎండీని ఇక్క డి నుంచి బదిలీ చేస్తే డబ్బుల సంచులను బహుమానంగా ఇస్తామని ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం.
ఎందుకంటే...
ఇటీవల వెలుగులోకి వచ్చిన కేబుల్ కుంభకోణం ఎన్పీడీసీఎల్‌ను కుదిపేసింది. దీంతో సీఎండీ కార్తికేయ మిశ్రా విచారణ బాధ్యతలను థర్డ్ పార్టీకి అప్పగించారు. మీటర్ల కొనుగోలు, అధిక ధరలకు దిగుమతి చేసుకోవడం.. వంటి తదితర అంశాలను పూర్తిస్థాయిలో వెలికి తీసే పనిలో పడ్డారు. కొనుగోలు చేసిన ప్రతి వస్తువు బిల్లులను తనిఖీ చేసేందుకు సిద్ధమయ్యూరు. అంతేకాదు... కింది స్థాయిలో విధులను నిర్లక్ష్యం చేసిన వారిపైనా కఠినంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా జరిగిన డీఈల బదిలీల్లో ఈ మార్పు కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.
అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని బదిలీ చేసినట్లు సంస్థ ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. అదేవిధంగా ఎన్పీడీసీఎల్ పరిధిలో సీఎండీ కార్తికేయ మిశ్రా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతుమిత్ర కార్యక్రమంలో కూడా అవినీతి జరిగినట్లు తెలుస్తోంది. కాంట్రాక్టర్లకు దోచిపెడుతున్నట్లు ఆరోపణలు విన్పిస్తున్నాయి. ట్రాన్స్ఫార్మర్లకు మైనర్ మరమ్మతులు వచ్చినా... వాటిని మేజర్‌గా చూపించి కాంట్రాక్టర్లతో కలిసి బిల్లులు విడుదల చేశారని సీఎండీకి ఫిర్యాదులు సైతం అందాయి. ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్న మిశ్రా కఠిన నిర్ణయూలకు వెనుకాడడం లేదు. అన్నింటిపైనా క్రమక్రమంగా విచారణ చేపట్టాలని ఆదేశాలిచ్చారు.
రైతుమిత్ర, బిల్ కలెక్షన్లు, విద్యుత్ సరఫరాపై నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఇది ఇంజినీర్లకు మింగుడు పడడం లేదు. అంతేకాకుండా చాలా ఏళ్ల తర్వాత ఎన్పీడీసీఎల్కు ఐఏఎస్ అధికారి సీఎండీగా రావడంతో సీనియర్లంతా అయిష్టంగానే ఉన్నారు. ఐఏఎస్‌లు లేకపోవడం, తమతో పనిచేసిన ఇంజినీర్లు సీఎండీగా ఉండడంతో వారిదే ఇష్టారాజ్యం. తాము అడిందే ఆట.. పాడిందే పాటగా పలు యూనియన్లు చక్రం తిప్పాయి. ఇప్పుడా పరిస్థితి లేదు... దీంతో ఆయనను ఈపీడీసీఎల్‌కు సాగనంపేందుకు ఓ ఇంజినీరింగ్ అసోసియేషన్ నేతలు రాష్ర్టస్థాయిలో రంగంలోకి దిగారు. ఈ విషయం సీఎండీ కార్తికేయ మిశ్రా దృష్టికి సైతం వెళ్లినట్లు తెలిసింది.