కళ్లలో కారం చల్లి రూ.6 లక్షలు దోపిడీ
రాజవరం(గంపలగూడెం) : మండలంలోని రాజవరం-పెనుగొలను గ్రామాల మధ్య తిరువూరు-మధిర ఆర్ అండ్ బీ ప్రధాన రహదారిపై గురువారం భారీ దారిదోపిడీ ఘటన జరిగింది. మోటార్‌సైకిల్‌పై వెళుతున్న ఇద్దరు వ్యక్తుల కళ్లలో దుండగులు కారం చల్లి రూ. 6 లక్షల నగదు దోచుకున్నారు. ఈ ఘటన ప్రాంతంలో తీవ్ర కలకలం సృష్టించింది. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్సై మహాలక్ష్మి ఈ వివరాలు వెల్లడించారు.
ఆయన తెలిపిన వివ రాల ప్రకారం.. నందిగామకు చెందిన విశ్రాంత అధ్యాపకుడు బాణావత్ భగవత్, తన తమ్ముడి చిన్నల్లుడు అజ్మీరా పాపారావు(ఎ.కొండూరు మండలం కేశ్యతండా వాసి)తో కలిసి మోటార్‌సైకిల్‌పై మండలంలోని పెనుగొండకు బయలుదేరారు. భూమి కొనుగోలు కోసం రూ.6 లక్షల నగదు గల బ్యాగ్ వారి వద్ద ఉంది. మండలంలోని రాజవరం దాటిన తరువాత ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వస్తూ వారికి ఎదురుపడ్డారు.
భగవత్, పాపారావు కళ్లలో వారు కారం చల్లి నగదు ఉన్న బ్యాగ్‌ను లాక్కుని పరారయ్యారు. ఈ ఘటనపై బాధితులు వెంటనే స్థానిక పోలీస్‌స్టేష న్లో ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి దారిదోపిడీకి పాల్పడిన వారి కోసం గాలిస్తున్నట్లు ఎస్సై తెలిపారు. నగదు అపహరించుకుపోయినవారు ఎ.కొండూరు మండలానికి చెందిన వ్యక్తులుగా భావిస్తున్నామన్నారు.
ఈ ఘటన ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. ఇటీవలి కాలంలో ఇలాంటి ఘటనలు ఈ ప్రాంతంలో జరగలేదని వారు పేర్కొంటున్నారు. పక్కా పథకం ప్రకారమే దుండగులు దారిదోపిడీకి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. 15 సంవత్సరాల క్రితం పెనుగొలను ఆంధ్రాబ్యాంక్‌కు చెందిన సిబ్బంది నగదుతో మోటార్‌సైకిల్‌పై వెళుతుండగా తిరువూరు మండలం చింతలపాడు శివారులో దోపిడీకి జరిగింది. ఆ తరువాత ఇలాంటి ఘటన జరగడం ఇదే మొదలు.