కొత్త పెళ్లికొడుకుల్లా మోదీ, బాబు, కేసీఆర్...
- విహార యాత్రపై సీపీఐ నేత నారాయణ
సాక్షి, హైదరాబాద్: కొత్త పెళ్లి కొడుకుల్లా ప్రధాని మోదీ, ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్ విహార యాత్రలు చేస్తున్నారని సీపీఐ నేత కె.నారాయణ ఎద్దేవా చేశారు. సహజ వనరులను కార్పొరేట్ శక్తులకు అప్పగించే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.వరంగల్ ఎన్కౌంటర్కు నిరసనగా ప్రజా సంఘాలు చేపట్టిన చలో అసెంబ్లీని పెద్ద ఎత్తున నిర్భందాన్ని ప్రయోగించడం.. అరెస్ట్లు సాగించడాన్ని ఖండించారు. చలో అసెంబ్లీ సందర్భంగా రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీని అమలుచేశారన్నారు.
గురువారం హైదరాబాద్లోని మఖ్దూం భవన్లో పార్టీ నేతలు చాడ వెంకటరెడ్డి, కె.రామకృష్ణలతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడుతూ పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరలకు నిరసనగా దేశ వ్యాప్తంగా ఈ నెల ఒకటి నుంచి 6వరకు ధర్నాలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. తమ నిరసనల తర్వాత కూడా పరిస్థితిలో మార్పు రాకపోతే గోడౌన్లలోని అక్రమ నిల్వలను బయటకు తీసుకొస్తామని చాడ వెంకటరెడ్డి హెచ్చరించారు. 22న ఏపీ రాజధాని శంకుస్థాపనకు వస్తున్న ప్రధాని మోదీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని కె.రామకృష్ణ డిమాండ్ చేశారు.
8న చలో అసెంబ్లీ: హైదరాబాద్ పాత నగరంలో కూడా మెట్రోరైలు పనులను చేపట్టాలని డిమాండ్ చేస్తూ 8న చలో అసెంబ్లీని నిర్వహిస్తున్నట్లు సీపీఐ నగర దక్షిణ జోన్ కమిటీ ప్రకటించింది. చలో అసెంబ్లీ పోస్టర్ను కె.నారాయణ, చాడ వెంకటరెడ్డి, కె.రామకృష్ణ, ఈటి నర్సింహ, సీపీఎం కార్యదర్శి తమ్మినేని విడుదల చేశారు.