కొత్త జిల్లాల్లో వేగంగా జేఏసీలు
టీజేఏసీ నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న కొత్త జిల్లాలకు అనుగుణంగా జేఏసీల నిర్మాణాన్ని చేపట్టాలని టీజేఏసీ నాయకత్వం నిర్ణయించింది. కొత్త జిల్లాల్లో వీలైనంత వేగంగా జేఏసీలను ఏర్పాటు చేయడంతోపాటు కొత్తగా తలెత్తబోయే సమస్యలపైనా ప్రజల పక్షాన పోరాటం చేయడానికి సిద్ధం కావాలని నాయకత్వం నిర్ణయించింది. హైదరాబాద్ శివార్లలో 2రోజుల క్రితం జేఏసీ చైర్మన్ ఎం.కోదండరాం అధ్యక్షతన ముఖ్యనేతలు సమావేశమయ్యారు. కొత్త జిల్లాల్లో జేఏసీల ఏర్పాటు, విద్య, వైద్యం, యువతకు ఉపాధితో పాటు జిల్లాల విభజన ద్వారా వచ్చే సమస్యలపై అధ్యయనం చేసి, పోరాటాలు చేయాలని నిర్ణయించారు.
రైతు సంఘాల జేఏసీ అక్టోబర్ 2న చేపట్టనున్న మౌనదీక్ష, ఇతర పోరాటాలకు ఎలాంటి మద్దతునివ్వాలనే అంశంపైనా చర్చించారు. రాజకీయ వేదికగా కాకుండా కేవలం ప్రజాసంఘాల జేఏసీ ద్వారానే ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని నిర్ణయించారు. జిల్లాల విభజనలో ప్రభుత్వం పారదర్శకత, నిర్ధిష్ట విధానం లేకుండా వ్యవహరిస్తోందని జేఏసీ అభిప్రాయపడింది. ఈ విషయంలో ప్రత్యామ్నాయ ప్రతిపాదనలను పెట్టాలని జేఏసీ నేతలు నిర్ణయించారు.