ఎన్నికల ప్రచారానికి ‘సాధ్వీ’
- కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు స్పష్టం
- నాయకుల ర్యాలీల రద్దు చేసే ప్రసక్తేలేదు
- 60 స్థానాల్లో గెలుపే ధ్యేయం
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర మంత్రి సాధ్వీ నిరంజన్ జ్యోతి ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు. ఢిల్లీలో ఓ ఎన్నికల ప్రచార సభలో సాధ్వీ నిరంజన్ జ్యోతి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై వెల్లువెత్తిన నిరసనల దృష్ట్యా ఆమె ప్రచార సభలల్లో పాల్గొనరనే ప్రచారం జరిగింది.
గోల్ మార్కెట్లో ఆమె పాల్గొనాల్సిన ఎన్నికల ర్యాలీలో అలీఘడ్ ఎంపీ సతీష్గౌతం పాల్గొనడంతో ఊహాగానాలను ఊపందుకొన్నాయి. కానీ ఆమె ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని ఆయన శుక్రవారం తెలియజేయడంతో తెరపడింది. ఢిల్లీలో బీజేపీ ఎంపీలతో పాటు నాయకులందరూ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని ఆయన తెలిపారు. నేతల ఎన్నికల ర్యాలీలను రద్దు చేసే ప్రసక్తే లేదని ఆయన చెప్పారు.
ప్రచార సభలు ప్రారంభం
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో 60 పైగా సీట్ల లక్ష్యాన్ని సాధించడం కోసం విస్తృతంగా ప్రచారం చేయాలని బీజేపీ జాతీయ అధ్య్యక్షుడు అమిత్ షా నిర్ణయించారు. ఈ మేరకు 300 మంది పార్టీ ఎంపీలతో నగరంలో 2,700 జనసభలు నిర్వహించాలని ఢిల్లీ శాఖను ఆదేశించారు. ఈ ఆదేశం మేరకు సోమవారం సాధ్వీనిరంజన్ జ్యోతితో సహా ఏడుగురు బీజేపీ ఎంపీలు ఢిల్లీలో ఎన్నికల ప్రచార సభలను ప్రారంభించారు.
దుమారం ఇక్కడే..
రాజోరీగార్డెన్‌లో జరిగిన జనసభలో సాధ్వీ నిరంజన్ జ్యోతి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. రామ్జాదోల (రాముని వారసుల) ప్రభుత్వం కావాలా లేక హరామ్జాదోల ( అక్రమ సంతానం) ప్రభుత్వం కావాలో ఢిల్లీవాసులు నిర్ణయిం చుకోవాలని ఆమె చేసిన వ్యాఖ్యలపై దుమారం లేచింది. ఈ వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్షాలు వ్యక్తం చేసిన నిరసనతో పార్లమెంటు ఉభయసభలు దద్దరిల్లాయి. సాధ్వీ నిరంజన్ జ్యోతి తన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఉభయసభలలో ఈ విషయమై ప్రకటన చేయవలసి వచ్చింది.
కారణాలేమైనా..ఐదు సభల రద్దు
ఈ నేపథ్యంలో సాధ్వీ నిరంజన్ జ్యోతితో పాటు మిగతా ఎంపీలు ఢిల్లీలో నిర్వహిస్తోన్న జనసభల ఆర్భాటం పలచబడింది. గురువారం 30 మంది ఎంపీలతో ప్రచార సభలు నిర్వహించనున్నట్లు ఢిల్లీ పార్టీ ప్రకటించినప్పటికీ వాటిలో ఐదు సభలు రద్దయ్యాయి. అందులో సాధ్వీ నిరంజన్ జ్యోతి గోల్ మార్కెట్లో నిర్వహించవలసిన సభ ఒకటి. నాంగ్లోయ్ వెస్ట్, వెస్ట్ సాగర్‌పుర్, హర్కేష్ నగర్‌తో పాటు ముండ్కాలో జరగవలసిన రెండు సభలు రద్దయ్యాయి. పెళ్లిళ్ల సీజన్ కారణంగా ఈసభలు రద్దయినట్లు కొందరు నేతలు చెబుతున్నారు. కానీ, ఎంపీలతో ఎన్నికల ర్యాలీల వ్యూహాన్ని అధినాయకత్వం సమీక్షిస్తోందని పార్టీ వర్గాలు అంటున్నాయి. ప్రముఖులు, వాగ్ధాటి కలిగిన ఎంపీలతో ర్యాలీలు జరిపించాలని, జనసభల సంఖ్య పై కన్నా పకడ్బందీగా నిర్వహించడంపై ఎక్కువ దృష్ట్టిపెట్టాలని పార్టీ యోచిస్తోందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం సభల సంఖ్య ఐదుకు తగ్గించినట్లు చెబుతున్నారు.