కర్ణాటకలో సూత్రధారి.. రాష్ట్రంలో పాత్రధారి
* పీజీ మెట్ స్కామ్‌లో రాజగోపాల్‌రెడ్డి ప్రమేయం
* బెంగళూరులో నాలుగు కేసుల్లో నిందితుడు
* రాజగోపాల్‌రెడ్డి ఆచూకీ కనిపెట్టిన రాష్ట్ర సీఐడీ ప్రత్యేక బృందాలు
* అదుపులో ఏడుగురు ర్యాంకర్లు, ముగ్గురు దళారులు
సాక్షి, హైదరాబాద్: కర్ణాటకలో 2007 నుంచి నాలుగు ప్రవేశ పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజి స్కామ్‌లలో సూత్రధారి అయిన రాజగోపాల్‌రెడ్డికి తాజాగా ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం నిర్వహించిన పీజీ మెట్-2014 ప్రశ్నపత్రం లీకేజ్లోనూ పాత్ర ఉన్నట్లు సీఐడీ అధికారులు నిర్ధారించారు. అతడి కోసం ముమ్మరంగా గాలిస్తున్న ప్రత్యేక బృందాలు సోమవారం రాత్రి ఆచూకీ కనిపెట్టినట్లు తెలిసింది. మరోపక్క ఈ స్కామ్‌తో సంబంధం ఉన్న ఏడుగురు ర్యాంకర్లు, ముగ్గురు దళారుల్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. పీజీ మెట్ లీకేజి వ్యవహారంలో సూత్రధారిగా ఉన్న కర్ణాటకలోని దావణగెరెకు చెందిన అమీర్ అహ్మద్‌ను ఈ నెల 16న సీఐడీ అరెస్టు చేసిన విషయం విదితమే. అతన్ని విచారించిన సందర్భంగా తన మాజీ గురువైన రాజగోపాల్‌రెడ్డి పాత్రను బయటపెట్టాడు.
అనంతపురం జిల్లాకు చెందిన రాజగోపాల్‌రెడ్డి అలియాస్ గోవింద్‌రెడ్డి బెంగళూరులోని కోరమంగళ ప్రాంతంలో స్థిరపడ్డాడు. విజయా బ్యాంక్‌లో పని చేసి, 2005లో స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. విద్యా రంగంలో అనేక మందితో పరిచయాలు పెంచుకొని, 2007 - 2013 మధ్య నాలుగు ‘లీకేజ్’లకు పాల్పడి అరెస్టయ్యాడు. బెంగళూరులోని రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సెన్సైన్ (ఆర్జీయూహెచ్ఎస్-2007) ప్రశ్నపత్రం లీకేజ్, కన్సార్షియం ఆఫ్ మెడికల్, ఇంజనీరింగ్ అండ్ డెంటల్ కాలేజెస్ ఆఫ్ కర్ణాటక (కొమెడ్ కే-2011) బోగస్ ప్రశ్నపత్రం లీకేజ్ కేసులతో సహా బెంగళూరు సీబీఐ, సెంట్రల్, హెచ్ఎస్ఆర్ లేఔట్, జయనగర్ పోలీసుస్టేషన్లలో ఇతడిపై కేసులు ఉన్నాయి.
ఎన్టీఆర్ విశ్వవిద్యాలయం పీజీ మెట్ స్కామ్‌కు వ్యూహ రచన చేసిన అమీర్ అహ్మద్ అప్పట్లో రాజగోపాల్‌రెడ్డి వద్ద డ్రైవర్‌గా పనిచేశాడు. మణిపాల్ ప్రింటింగ్ టెక్నాలజీస్ లిమిటెడ్ ప్రెస్ నుంచి ప్రశ్నల తస్కరణ నుంచి బ్రోకర్ల ద్వారా వైద్య విద్యార్థుల గుర్తింపు, ప్రత్యేక క్లాసుల నిర్వహణ వరకు రాజగోపాల్‌రెడ్డి తెరవెనుక ఉండి కథ నడిపినట్లు సీఐడీ గుర్తించింది. ఇందు కు ఆధారాలు కూడా సేకరించింది. దీంతో అతడి కోసం మూడు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. మరోపక్క స్కామ్ వెలుగులోకి వచ్చిన తరవాత ప్రాథమికంగా 100 లోపు ర్యాంకర్లను మాత్రమే విచారించిన సీఐడీ అధికారులు ఇప్పుడు 200 ర్యాంకుల వరకు అనేక మందిని అనుమానితుల జాబితాలో చేర్చారు. వారికి గతంలో జరిగిన పరీక్షలు, మెడిసిన్ ఎంట్రన్స్ టెస్టులు, సెమిస్టర్లలో వచ్చిన మార్కుల్ని పరిగణనలోకి తీసుకున్నారు. వీరిలో ఏడుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మిగతా నిందితులకు సహకరించిన ముగ్గురు దళారుల్ని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.