lease farmers
-
కౌలు రైతుకు రుణార్హత హుళక్కేనా?
కార్డులున్నా ఫలితం లేదన్నా... ముందుకురాని బ్యాంకర్లు సహకరించని భూయజమానులు రానున్న ప్రభుత్వమైనా కరుణించేనా? ముదినేపల్లి రూరల్, న్యూస్‌లై న్ : కౌలు రైతుల సంక్షేమమే ధ్యేయమన్న ప్రభుత్వాల ఆర్భాటపు ప్రకటనలు ఆచరణలో అడ్రస్ లేకుండాపోతున్నాయి. వీరికి గుర్తింపు కార్డులతో వ్యవసాయాన్ని మూడు పువ్వులు ఆరు కాయలుగా వికసింపజేస్తామన్న గత ప్రభుత్వ హామీలు నీటి మీద రాత లుగానే మిగిలాయి. త్వరలో అధికారం చేపట్టబోతున్న టీడీపీ ప్రభుత్వం కౌలు రైతుల తలరాతను ఏవిధంగా మారుస్తుందనేది ప్రశ్నార్థకంగా మారింది. కౌలురైతులకు అటు ప్రభుత్వ పరంగా ఇటు భూయజమానుల పరంగా ఎలాంటి సహకామంద డంలేదు. దీంతో అనేక మంది సాగుకు దూరమవుతున్నారు. ఇలాంటి పరిస్థితిని అధిగమించేందుకు గత ప్రభుత్వం కౌలు రైతులకు గుర్తింపు, రుణార్హత కార్డులు మంజూరు చేసింది. ఈ కార్డులతో సబ్సిడీపై విత్తనాలు, ఎరువులు, బ్యాంకు రుణాలు పొం దవచ్చని ఆశపెట్టింది. ఆచరణలో మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధంగా జరుగుతోంది. బ్యాంకర్ల విముఖత... ఎలాంటి హామీలేకుండా కౌలు రైతులకు రుణాలిచ్చేందుకు బ్యాంకర్లు తీవ్ర విముఖత వ్యక్తం చేస్తున్నారు. లాభార్జనే ధ్యేయంగా పనిచేసే బ్యాంకులు హామీ లేకుండా అప్పు లిచ్చి చేతులుకాల్చుకోవు. ఇది తెలిసినప్పటికీ కౌలు రైతులను వంచించేందుకు రుణార్హత కార్డులను గతప్రభుత్వం జారీ చేసింది. ఈ కార్డులతో బ్యాంకులుచుట్టూ కాళ్లరిగేలా తిరిగినా అధికారుల ఈసడింపులే తప్ప వీసమెత్తు ప్రయోజనం కలగలేదు. బీమా ధీమా లేదు... బ్యాంకులు మంజూరుచేసే పంట రుణాలపై రైతుల నుంచి విధిగా బీమా ప్రీమియం వసూలుచేస్తాయి. ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు నష్టపోతే బీమా కంపెనీ పరిహారం చెల్లిస్తుంది. దీని వల్ల బ్యాంకుల రుణాలు సులభంగా వసూలవుతాయి. కౌలురైతులకు మొక్కుబడిగా రుణాలిచ్చినా వీటికి బీమా ప్రీమియం వసూలు చేయడంలేదు. కౌలు రైతులు సాగు చేసే భూమినే యజమాని బ్యాంకులో తనఖా పెట్టి పంట రుణం పొందుతున్నాడు. ఈ సమయంలో బీమా ప్రీమియం చెల్లిస్తున్నాడు. ఈ కారణం వల్ల ఒకే భూమిపై రెండు సార్లు ప్రీమియం ఎలా వసూలు చేస్తామని బ్యాంకర్లు చెబుతున్నారు. అదే విధంగా వడ్డీ రాయితీలు సైతం కౌలు రైతులకు రావడం లేదు. కార్డులొద్దు బాబోయ్! కౌలు రైతులకు మూడేళ్ల నుంచి రుణార్హత కార్డులు మంజూరు చేస్తున్నారు. ఒకసారి కార్డు పొందిన రైతు రెండో ఏడాది కార్డు తీసుకునేందుకు ముందుకు రావడం లేదు. కార్డుల వల్ల ప్రయాస తప్ప ప్రయోజనం లేదనే అభిప్రాయానికి కౌలు రైతులు వచ్చినందున కార్డులు తీసుకునేందుకు ముందుకు రావడంలేదని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. నూతన ప్రభుత్వం రుణార్హత కార్డులను మంజూరు చేసి చేతులు దులిపేసుకుంటుందా? లేక వినూత్న మార్పులేమైనా చేపడుతుందో వేచి చూడాల్సి ఉంది. కౌలు రైతులకు రక్షణ కల్పించాలనే చిత్తశుద్ధి ఉంటే అదను దాటకముందే సరైన చర్యలు తీసుకోవాలని కౌలు రైతులు కోరుతున్నారు. -
కార్డుల్లేవు.. రుణాల్లేవు
కర్నూలు(అగ్రికల్చర్), న్యూస్‌లైన్: కౌలు రైతుల కోసం సాగు రైతు, రక్షణ హస్తం పేరిట ప్రభుత్వం ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చినా కాగితాలకే పరిమితమైంది. జిల్లాలో దాదాపు ఆరు లక్షల మంది రైతులు ఉండగా, 30 శాతం మందికి పైగా రైతులు ప్రకృతి వైపరీత్యాలతో నష్టాలను తాళలేకపోయారు. విధిలేని పరిస్థితుల్లో వీరంతా భూములను కౌలుకు ఇచ్చేసి పట్టణాల్లో స్థిరపడ్డారు. జిల్లాలో 2 లక్షలకు పైగా కౌలు రైతులు ఉన్నప్పటికీ 2013-14 ఆర్థిక సంవత్సరానికి 35,447 మంది కౌలుదారులకే రుణ అర్హత కార్డులు పంపిణీ చేశారు. ఈ కార్డులు చూపితే బ్యాంకులు రుణాలు ఇస్తాయని.. ప్రకృతి వైపరీత్యాలతో పంటలు దెబ్బతింటే ఇన్పుట్ సబ్సిడీ లభిస్తుందని.. సబ్సిడీపై విత్తనాలు, ఎరువులు పొందవచ్చని ప్రభుత్వం సెలవిచ్చింది. ఇదంతా వినడానికి బాగానే ఉన్నా.. ఆచరణలో పూర్తిగా విఫలమయ్యారు. 2013-14 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వ్యవసాయ సీజన్ దాదాపు ముగుస్తోంది. అయితే బ్యాంకర్లు 3,500 మంది కౌలు రైతులకు మాత్రమే రుణాలిచ్చి బ్యాంకర్లు చేతులు దులుపుకున్నారు. వీరికి కూడా రాజకీయ నాయకులు గట్టిగా సిఫారసు చేయడం వల్లే దాదాపు రూ.5 కోట్లు పంపిణీ చేపట్టారు. ప్రభుత్వం కౌలుదారులకు పంపిణీ చేసిన రుణ అర్హత కార్డులను తీసుకొని బ్యాంకులకు వెళితే మేనేజర్‌తో పాటు సిబ్బంది వింతగా చూస్తున్నారు. పట్టా రైతులకే రుణాలు ఇవ్వడం లేదు.. ఏడాది, రెండేళ్లు కౌలు చేసుకునే మీకెలా రుణాలు ఇస్తామంటూ ముఖంపైనే తేల్చి చెప్పేస్తున్నారు. ఈ ఏడాది కౌలు రైతులకు రూ.500 కోట్ల రుణాలు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ బ్యాంకర్లకు లక్ష్యాన్ని నిర్దేశించారు. నెలకోసారి బ్యాంకర్లతో సమావేశాలు నిర్వహిస్తూ తగిన ఆదేశాలు జారీ చేస్తున్నా ఫలితం లేకపోతోంది. 2011-12 నుంచి కౌలు రైతులకు ఏడాది కాల పరిమితితో రుణ అర్హత కార్డులను అందిస్తున్నారు. అయితే మూడేళ్లుగా బ్యాంకర్లు నాలుగు రాళ్లు వారి ముఖాన కొట్టి గొప్పలు చెప్పుకుంటున్నారు. 2011, 2012 సంవత్సరాల్లో వచ్చిన కరువుకు సంబంధించి జిల్లాకు కోట్లాది రూపాయల ఇన్పుట్ సబ్సిడీ విడుదలైనా.. రుణ అర్హత కార్డులు పొందిన కౌలు రైతుల్లో 5 శాతం మంది కూడా పరిహారానికి నోచుకోకపోవడం గమనార్హం.