కర్నూలు(అగ్రికల్చర్), న్యూస్‌లైన్: కౌలు రైతుల కోసం సాగు రైతు, రక్షణ హస్తం పేరిట ప్రభుత్వం ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చినా కాగితాలకే పరిమితమైంది. జిల్లాలో దాదాపు ఆరు లక్షల మంది రైతులు ఉండగా, 30 శాతం మందికి పైగా రైతులు ప్రకృతి వైపరీత్యాలతో నష్టాలను తాళలేకపోయారు. విధిలేని పరిస్థితుల్లో వీరంతా భూములను కౌలుకు ఇచ్చేసి పట్టణాల్లో స్థిరపడ్డారు. జిల్లాలో 2 లక్షలకు పైగా కౌలు రైతులు ఉన్నప్పటికీ 2013-14 ఆర్థిక సంవత్సరానికి 35,447 మంది కౌలుదారులకే రుణ అర్హత కార్డులు పంపిణీ చేశారు.
ఈ కార్డులు చూపితే బ్యాంకులు రుణాలు ఇస్తాయని.. ప్రకృతి వైపరీత్యాలతో పంటలు దెబ్బతింటే ఇన్‌పుట్ సబ్సిడీ లభిస్తుందని.. సబ్సిడీపై విత్తనాలు, ఎరువులు పొందవచ్చని ప్రభుత్వం సెలవిచ్చింది. ఇదంతా వినడానికి బాగానే ఉన్నా.. ఆచరణలో పూర్తిగా విఫలమయ్యారు. 2013-14 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వ్యవసాయ సీజన్ దాదాపు ముగుస్తోంది. అయితే బ్యాంకర్లు 3,500 మంది కౌలు రైతులకు మాత్రమే రుణాలిచ్చి బ్యాంకర్లు చేతులు దులుపుకున్నారు. వీరికి కూడా రాజకీయ నాయకులు గట్టిగా సిఫారసు చేయడం వల్లే దాదాపు రూ.5 కోట్లు పంపిణీ చేపట్టారు. ప్రభుత్వం కౌలుదారులకు పంపిణీ చేసిన రుణ అర్హత కార్డులను తీసుకొని బ్యాంకులకు వెళితే మేనేజర్‌తో పాటు సిబ్బంది వింతగా చూస్తున్నారు.
పట్టా రైతులకే రుణాలు ఇవ్వడం లేదు.. ఏడాది, రెండేళ్లు కౌలు చేసుకునే మీకెలా రుణాలు ఇస్తామంటూ ముఖంపైనే తేల్చి చెప్పేస్తున్నారు. ఈ ఏడాది కౌలు రైతులకు రూ.500 కోట్ల రుణాలు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ బ్యాంకర్లకు లక్ష్యాన్ని నిర్దేశించారు. నెలకోసారి బ్యాంకర్లతో సమావేశాలు నిర్వహిస్తూ తగిన ఆదేశాలు జారీ చేస్తున్నా ఫలితం లేకపోతోంది. 2011-12 నుంచి కౌలు రైతులకు ఏడాది కాల పరిమితితో రుణ అర్హత కార్డులను అందిస్తున్నారు. అయితే మూడేళ్లుగా బ్యాంకర్లు నాలుగు రాళ్లు వారి ముఖాన కొట్టి గొప్పలు చెప్పుకుంటున్నారు. 2011, 2012 సంవత్సరాల్లో వచ్చిన కరువుకు సంబంధించి జిల్లాకు కోట్లాది రూపాయల ఇన్‌పుట్ సబ్సిడీ విడుదలైనా.. రుణ అర్హత కార్డులు పొందిన కౌలు రైతుల్లో 5 శాతం మంది కూడా పరిహారానికి నోచుకోకపోవడం గమనార్హం.
కార్డుల్లేవు.. రుణాల్లేవు
Published Mon, Jan 13 2014 4:13 AM | Last Updated on Mon, Aug 13 2018 8:03 PM
Advertisement
Advertisement