3 నెలలు.. రూ.39.18 కోట్లు
కర్నూలు(అగ్రికల్చర్): ‘అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని’ అన్నట్లు నిధులు పుష్కలంగా ఉన్నా వినియోగించడంలో నిర్లక్ష్యం నెలకొంది. కోట్లాది రూపాయల నిధులు వృథా అయ్యే ప్రమాదం ఉంది. జిల్లా అభివృద్ధికి ఎంతో ఉపయోగపడే నిధులను చేజేతులా ల్యాప్స్ చేసుకొనే పరిస్థితి ఏర్పడింది. ఇది డ్వామా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వాటర్‌షెడ్ల దుస్థితికి నిదర్శనం. సమీకృత నీటి యాజమాన్య కార్యక్రమం(ఐడబ్ల్యూఎంపీ) కింద మెగా వాటర్ షెడ్లు నిర్వహిస్తున్నారు. భూగర్భ జలాల అభివృద్ధి లక్ష్యంగా వాటర్‌షెడ్ కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టారు. నిధులు పుష్కలంగా ఉన్నాయి. వీటిని సక్రమంగా వినియోగిస్తే భూగర్భ జలాలు అభివృద్ధి చెందుతాయనడంలో సందేహం లేదు. కానీ నిధుల వినియోగంలో నిర్లక్ష్యం తాండవిస్తోంది. దీంతో నిధులు మురిగిపోయే ప్రమాదం ఏర్పడింది.
2009-10లో జిల్లాకు 13 మెగా వాటర్‌షెడ్లు మంజూరయ్యాయి. వీటిని 13 మండలాల్లోని 95 గ్రామాల్లో నిర్వహిస్తున్నారు. 58199 హెక్టార్లలో వాటర్‌షెడ్ కార్యక్రమాలను నిర్వహించేందుకు రూ.69.84 కోట్లు విడుదలయ్యాయి. వీటిని 2015 మార్చి లోపు పూర్తిగా వినియోగించుకోవాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు కేవలం రూ.30.66 కోట్లు మాత్రమే వినియోగించారు. నాలుగేళ్లలో మొదటి బ్యాచ్ వాటర్‌షెడ్ల కోసం కేవలం రూ.30.66 కోట్లు మాత్రమే ఖర్చు చేయడంతో ఇంకా రూ.39.18 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంది. ఇందుకు కేవలం మూడు నెలలు మాత్రమే సమయం వుంది. ఈ నిధులు వినియోగించకపోతే ల్యాప్స్ అయిపోతాయి. ఐడబ్ల్యూఎంపీ వాటర్‌షెడ్ల నిర్వహణ జిల్లా నీటి యాజమాన్య సంస్థలో ఒక భాగమే. వాటర్‌షెడ్ కార్యక్రమాల అమలుకు జిల్లా స్థాయిలో పీడీ ఉండగా, పర్యవేక్షణకు ఇద్దరు అదనపు పీడీలు ఉన్నారు. మండల స్థాయిలో ప్రాజెక్టు ఆఫీసర్లు, సాంకేతిక అధికారులు తదితరులు ఉన్నారు. గ్రామ వాటర్‌షెడ్ కమిటీలు ఉన్నాయి. ప్రాజెక్టు ఆఫీసర్లు, సాంకేతిక అధికారులు కుంటి సాకులు చెబుతూ పనుల నిర్వహణలో అలసత్వం వహిస్తున్నట్లు తెలుస్తోంది. గడువు ముగియవస్తున్నా నిధుల వినియోగం 50 శాతం కూడా మించకపోవడంతో జిల్లా కలెక్టర్ విజయమోహన్ వాటర్‌షెడ్ యంత్రాంగంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.
గత నెలలో నిర్వహించిన డివిజనల్ సమావేశంలో వాటర్‌షెడ్ నిధుల వినియోగంపై మండిపడ్డారు. నెల రోజుల్లో నిధుల వినియోగాన్ని పెంచాలని లేకపోతే చర్యలు ఉంటాయని ప్రాజెక్టు ఆఫీసర్లు, సాంకేతిక అధికారులను హెచ్చరించారు. కానీ ఫలితం లేదు. భూముల్లో పంటలు ఉన్నాయనే కారణాలతో పనుల నిర్వహణలో అలసత్వం వహిస్తున్నట్లు తెలుస్తోంది.
కాగా.. రెండవ బ్యాచ్ కింద 2010-11లో 16 మెగా వాటర్‌షెడ్లు మంజూరయ్యాయి. వీటిని 16 మండలాల్లోని 104 గ్రామాల్లో అమలు చేస్తున్నారు. రెండవ బ్యాచ్ వాటర్ షెడ్ కార్యక్రమాల నిర్వహణకు రూ.79.36 కోట్లు విడుదలయ్యాయి. ఇందులో ఇప్పటి వరకు రూ.28.27 కోట్లు మాత్రమే వ్యయం చేశారు. 2016 మార్చి నెల చివరిలోపు మిగిలిన రూ.50.99 కోట్లు వ్యయం చేయాల్సి ఉంది. నిధులు వినియోగించుకోలేకపోతే ల్యాప్స్ అవుతాయి.
చేపట్టాల్సిన పనులు ఇవే...
వాటర్‌షెడ్ కార్యక్రమాల కింద భూగర్భ జలాల అభివృద్ధి చేసే పనులకు ప్రాధాన్యత ఇస్తారు. మొత్తం నిధుల్లో ఈ పనులకు 56 శాతం నిధులు ఖర్చు చేయాల్సి ఉంది. మిగిలిన 44 శాతం నిధులను వివిధ కార్యక్రమాలకు వినియోగిస్తారు. భూగర్భ జలాల అభివృద్ధికి వాగులకు, వంకలకు చెక్‌డ్యామ్‌లు, చెక్‌వాళ్లు, రాతికత్వలు, రాళ్లకట్టలు, మట్టి కట్టలు, నీటి కుంటలు, ఫాంపాండ్స్, చెరువులు, డగౌటు ప్లాంట్లు, ఆర్‌ఎఫ్‌డీలు, పండ్ల తోటల పెంపకం, బండ్ ప్లాంటేషన్ అవెన్యూ ప్లాంటేషన్ వంటి పనులు నిర్వహించాల్సి ఉంది. నిధులు అపారంగా ఉన్నా పనులు చేపట్టడంలో అడుగడుగునా నిర్లక్ష్యం నెలకొని ఉంది. భూగర్భ జలాలు అంటుగంటిపోతున్నాయి.
జలసంరక్షణ పనులకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంది. ఇందుకు కేంద్రం నిధుల కొరత లేకుండా మంజూరుచేస్తోంది. కానీ పనులు చేపట్టడంలో అలసత్వం నెలకొని ఉండటంతో కోట్లాది రూపాయలు వృధాగా అయ్యే అవకాశం ఉంది. కలెక్టర్ వాటర్‌షెడ్ పనుల తీరుపై అసంతృప్తితో ఉన్నారు. త్వరలో రెండవ విడత డివిజనల్ సమావేశాలు జరగనున్నాయి. వీటిల్లో వాటర్‌షెడ్ నిధుల వినియోగంపైనే సమీక్ష నిర్వహించనున్నారు. అప్పటికి ప్రగతి లేకపోతే పలువురు ప్రాజెక్టు ఆఫీసర్లు, సాంకేతిక అధికారులపై వేటు వేయడానికి కలెక్టర్ రంగం సిద్ధం చేశారు.