కర్నూలు(అగ్రికల్చర్) : ఆపద్బంధు పథకానికి నిర్లక్ష్యపు చీకట్లు అలుముకున్నాయి. 2013-14 నుంచి ఈ పథకం కింద ఒక్క కుటుంబానికి కూడా చేయూతనిచ్చిన దాఖలాలు లేవు. నిధలు మంజూరు చేస్తున్నట్లు జీవోలు ఇవ్వడం తప్ప నిధులు మాత్రం విడుదల కావడం లేదు. కుటుంబానికి ఆధారమైన వారు ప్రమాదవశాత్తు మరణిస్తే ఆదుకోవడానికి ప్రభుత్వం కొన్నేళ్ల క్రితమే ఆపద్బంధు పథకాన్ని చేపట్టింది. బాధిత కుటుంబాలకు ఇది ఉపశమనంగా ఉందనడంలో ఎటువంటి సందేహం లేదు. 2013-14 నుండి ఈ పథకం అమలులో నిర్లక్ష్యం నెలకొంది.
ఆపద్బంధు కింద ఆర్థిక సహాయం కోసం దరఖాస్తులు భారీగానే ఉన్నా ప్రభుత్వం మాత్రం నిధులు విదిల్చడం లేదు. 2012-13 వరకు ఈ పథకాన్ని బీమా కంపెనీల ద్వారా అమలు చేసేవారు. దీనివల్ల తక్కువ మందికే చేయూత లభిస్తుండటంతో 2013-14 నుండి ప్రభుత్వమే నేరుగా ఆర్థిక సహాయం మంజూరు చేసే విధంగా చర్యలు తీసుకుంది. గత ఆర్థిక సంవత్సరం నుండి ఇప్పటి వరకు ఆపద్బంధు పథకం కింద 200లకు పైగా దరఖాస్తులు రాగా ఇందులో అర్హత కలిగినవి 70 తేలాయి.
కుటుంబానికి ఆధారమైన వ్యక్తి లేదా మహిళలు ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.50 వేలు ఈ పథకం కింద లభిస్తుంది. ఈ పథకాన్ని ప్రభుత్వం పక్కన పెట్టిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొద్ది నెలల క్రితం రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం కింద 10 కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించేందుకు రూ.5 లక్షలు మంజూరు చేసింది. నిధులు మాత్రం విడుదల కాలేదు. ఇటీవలనే ఈపథకం కింద రూ 22 లక్షలు మంజూరు చేస్తూ జీవో జారీ అయింది. కానీ ట్రెజరీకి బడ్జెట్ విడుదల కాలేదు. నిధుల మంజూరు కాగితాలపై జరుగుతుంది తప్ప విడుదల కావడం లేదు.నిదుల ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందో అపద్బందు పథకాన్ని పరిశీలిస్తే తెలుస్తుంది. కుటుంబానికి ఆధారమైన వ్యక్తిని పోగొట్టుకుని అనేక కుటుంబాలు దయనీయమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. అటువంటి వారికి ఆపద్బంధు పథకం ఊరటనిస్తుంది. అయితే బాధిత కుటుంబాలను ఆదుకోవడంలో ప్రభుత్వం అలసత్వం వహిస్తోంది. దీని కింద ఆర్థిక సహాయం బాధిత కుటుంబాల సభ్యులు అటు తహశీల్దారు కార్యాలయాలు, ఇటు కలెక్టర్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. ప్రజాదర్బార్ వంటి కార్యక్రమాల్లో వినతులు ఇస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ తీసుకుని ఆపద్బంధు కింద నిధులు ఇచ్చి బాధిత కుటుంబాలను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
నిధులేవీ?
Published Fri, Dec 26 2014 3:10 AM | Last Updated on Sat, Sep 2 2017 6:44 PM
Advertisement
Advertisement