water shed
-
బీడు భూములు సస్యశ్యామలం
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఇప్పటివరకు వర్షాధారంపై మాత్రమే ఆధారపడుతూ వ్యవసాయం చేసుకునే భూములు లేదా ఏ వనరులు లేక బీడుగా ఉండిపోయిన ఆరు లక్షల ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం వాటర్ షెడ్ల నిర్మాణం ద్వారా కొత్తగా సాగులోకి తీసుకురాబోతోంది. అనంతపురం, శ్రీ సత్యసాయి, కర్నూలు, నంద్యాల, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, ప్రకాశం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లోని 59 మండలాల పరిధిలో వర్షపు నీటిని ఎప్పటికప్పుడు అక్కడే నిల్వ ఉంచేలా రూ.555.31 కోట్లతో వాటర్షెడ్ల నిర్మాణం చేపట్టాలని సంకల్పించింది. ఈ ఖర్చును 60–40 నిష్పతిలో కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా భరించనున్నాయి. వీటి నిర్మాణం పూర్తయితే మొత్తం 310 గ్రామ పంచాయతీల పరిధిలోని దాదాపు ఐదు లక్షల రైతు కుటుంబాలకు సంబంధించిన 6,03,938 ఎకరాలకు (2,44,405 హెక్టార్లు) సాగునీటి వసతి మెరుగుపడుతుందని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి అధికారులు వెల్లడించారు. అంతేకాక.. ఆయా గ్రామాల్లో మరో రెండు లక్షల దాకా రైతు కూలీ కుటుంబాలకు ఆదాయ మార్గాలు పెరిగేలా వివిధ రకాల జీవనోపాధుల కల్పనకు ప్రభుత్వం ఆర్థిక సహాయం కూడా అందించనుంది. ఫలితాల సాధనే ధ్యేయంగా.. వాటర్షెడ్ల నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఈసారి వినూత్న ఫలితాల సాధనే ధ్యేయంగా చేపట్టబోతోంది. వాటి నిర్మాణ సమయంలోనే ఆయా గ్రామాల్లో నిర్ణీత లక్ష్యం మేరకు బీడు, బంజరు భూములకు సాగునీరు వసతి మెరుగుపడుతుందా లేదా అన్నది పరిశీలన, సమీక్షలు చేసుకుంటూ రెండు నుంచి ఐదేళ్ల మధ్య కాలంలో ఈ కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఈ ఏడాది మార్చి నుంచి ఆయా గ్రామాల్లో క్షేత్రస్థాయిలో పరిశీలించి ఏ ప్రాంతంలో ఎలాంటి నిర్మాణం చేపట్టాలన్నది అంచనా వేశారు. అలాగే, సమగ్ర ప్రణాళిక (డీపీఆర్)లు కూడా అధికారులు సిద్ధంచేశారు. రేపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమీక్ష ఇక కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి నిధులతో చేపడుతున్న ఈ కార్యక్రమంపై రాష్ట్రస్థాయి అధికారులతో చర్చించేందుకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలో ఉండే భూ వనరుల (ల్యాండ్ రిసోర్స్) విభాగం అదనపు కార్యదర్శి హుకుంసింగ్ మీనా ఆదివారం రాష్ట్రానికి రానున్నారు. రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో సోమవారం తొలత సమీక్ష సమావేశం నిర్వహించిన అనంతరం రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులతోనూ ఆయన భేటీ అవుతారు. -
వాటార్షెడ్!
►వాటర్ షెడ్ పనుల్లో అంతులేని అవినీతి? ►కోట్లలో నిధుల స్వాహాపై ఆరోపణలు ►అధికారుల కనుసన్నల్లోనే అంతా ►కూలీల నమోదులో అవకతవకలు ►కోర్టుకు వెళ్లేందుకు రైతుల సమాలోచన సోమల మండలంలో జరిగిన వాటర్ షెడ్ పనుల్లో అంతులేని అవినీతి చోటుచేసుకుంది. అధికార పార్టీ నేతలతో చేతులు కలిపిన కొందరు అధికారులు నిబంధనలు తుంగలో తొక్కేశారు. కూలీలతో చేయించాల్సిన పనులు యంత్రాలతో చేయించి మస్టర్లు సృష్టించా రు. వాటికి బిల్లులు చేయించుకుని వాటాలు పంచేసుకున్నారు. విషయం తెలుసుకుని రైతులు అవాక్కయ్యారు. పక్కదారి పట్టిన ప్రభుత్వ నిధులపై కోర్టు కు వెళ్లేందుకు సమాయత్తమవుతున్నారు. స్వాహా చేసిన డబ్బులు ప్రభుత్వ ఖజానాకు చేరేవరకు వదిలే ప్రసక్తే లేదని తెగేసి చెబుతున్నారు. తిరుపతి: వాటర్‌షెడ్ పథకంలో ని«ధులు దుర్వి నియోగమయ్యామని సోమల మండలానికి చెందిన రైతులు ఆరోపిస్తున్నారు. కొంతమంది అధికారులు ఈ పనుల ద్వారా తమ ధన దాహాన్ని తీర్చుకున్నారన్న విమర్శలున్నాయి. అధికారుల అండదండలతో వాటర్‌షెడ్ పథకంలో పక్కాగా నిధులు దుర్వినియోగమైనట్లు తెలుస్తోంది. కమిటీ తయారీ సమయంలో ఫీల్డ్ అసిస్టెంట్ల నియామకానికి తిలోదకాలిచ్చి, భూముల అభివృద్ధికి చేపట్టాల్సిన పనుల్లో అక్రమాలకు పాల్పడినట్టు సమాచారం. రూ.8 కోట్లు ఖర్చు చేసినట్టు అంచనా! పలమనేరు కేంద్రంగా సోమల మండలంలో 2013లో వల్లిగట్ల, కామిరెడ్డిగారిపల్లె, కందూరు, తమ్మినాయునిపల్లె, నెల్లిమంద, ఇరికిపెంట పంచాయతీల్లో వాటర్‌షెడ్ పథకం ప్రవేశ పెట్టారు. సర్పంచ్‌లు అధ్యక్షులుగా ప్రతి గ్రామానికీ ఒక్కో రైతుకు సభ్యత్వం కల్పించారు. సభ్యుల ఆమోదంతో ప్రతి పంచాయతీకి ఒక ఫీల్డ్ అసిస్టెంట్‌ను నియమించారు. ప్రారంభం నుంచి 2017 మార్చి వరకు వ్యవసాయ పొలాల్లో 375 పంటకుంటలు, 35 చెక్ డ్యాంలు నిర్మించినట్లు అధికారులు లెక్కలు చూపుతున్నారు. వీటి నిర్మాణానికి సుమారు రూ.8 కోట్లు ఖర్చు చేసినట్లు అంచనా. ఇష్టారాజ్యం కొందరు అధికారులు తమ తెలివితేటలను ఉపయోగించి ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కారు. ఇష్టారాజ్యంగా పనులు పూర్తి చేయించారు. కూలీలకు పనులు కల్పించాల్సిన చోట కాంట్రాక్టర్లను ఏర్పాటు చేసుకున్నారు. రైతులకు అవసరం లేని చోట్ల మొత్తం మిషన్లతోనే పనులు చేయించారు. సంబంధంలేని పంచాయతీల నుంచి కూలీల చేత పనులు చేయించినట్లు రికార్డులు సృష్టించారు. ఒక్క కూలీ కూడా వాటర్ షెడ్ పనులకు వెళ్లలేదని తెల్సింది. ఆరు పంచాయతీల్లో జరిగిన పనుల కోసం 14 పంచాయతీలకు చెందిన కూలీలను ఉపయోగించినట్లు రికార్డుల్లో నమోదు చేశారు. వీరి ఖాతాలకు నిధులు మళ్లించారు. వీరికి కొంతమంది జాతీయ గ్రామీణ ఉపాధి హామీ సిబ్బంది సహకారం అందించినట్లు ప్రచారం సాగుతోంది. పలు పంచాయతీల్లో కూలీల నమోదులోనూ అవకతవకలు జరినట్లు సమాచారం. పక్కా స్కెచ్‌తోనే.. పక్కా స్కెచ్‌తో వాటర్ షెడ్లో ఇద్దరు టెక్నికల్ అసిస్టెంట్లు నిధుల స్వాహాకు తెరలేపారు. పనుల పర్యవేక్షించాల్సింది పోయి దగ్గరుండి యంత్రాలతో పనులు చేయించారు. కాంట్రాకర్లను నియమించుకున్నారు. వారి చేతనే మస్టర్లు రాయించుకున్నారు. ఆరు పంచాయతీ వాటర్ షెడ్లలో మిషన్లతో పనులు చేశారు. 14 పంచాయతీలలో కూలీలను నమోదు చేయించారు. వారి ఖాతాల నుంచి నగదు డ్రా చేయించుకుంటున్నారు. కొంత మంది కూలీల ఖాతాల్లో రూ.15 లక్షల వరకూ నిధులు మూలుగుతున్నాయి. తమకు తెలియకనే ఎలా మస్టర్లలో పేర్లు రాసుకున్నారని కొందరు నిలదీయడంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఉన్నతాధికారులు లోతుగా విచారిస్తే నిధుల స్వాహాపై మరిన్ని వాస్తవాలు బయటపడే వీలుంది. – వెంకటప్పనాయుడు, కందూరు రైతులకు అండగా ఉంటాం మేం వాటర్‌షెడ్ పథకంలో దుర్వినియోగమైన నిధులు రాబట్టడానికి ముందుకు వచ్చే రైతులకు అండగా ఉంటాం. చెక్ డ్యాంల నిర్మాణాల్లో నిబంధనలకు తిలోదకాలిచ్చారు. కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూరే విధంగా టెక్నికల్ సిబ్బంది, జేఈ వ్యవహరించారు. – నాగేశ్వరరావు, మార్కెట్టు కమిటీ మాజీ అధ్యక్షుడు, నెల్లిమంద -
గూగూడు వాటర్‌షెడ్‌లో.. అవినీతి ప్రవాహం
= నాసిరకంగా చెక్‌డ్యాంల నిర్మాణం = నెల తిరక్కుండానే పగుళ్లు = పట్టించుకోని అధికారులు = రూ. లక్షలు దుర్వినియోగం సాక్షి టాస్క్‌ఫోర్స్ : అనంత పర్యావరణ పరిరక్షణ సమితి (ఏపీపీఎస్) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గూగూడు మెగా వాటర్‌షెడ్‌లో అవినీతి ఏరులై పారుతోంది. జల సంరక్షణ పనులను అడ్డగోలుగా చేపడుతూ అందినకాడికి దోచుకుంటున్నారు. నార్పల మండలంలోని హెచ్.సోదనపల్లి సమీపంలో నల్లగుట్ట కింది సాగు భూముల్లో ఇటీవల సుమారు రూ.18 లక్షలతో చెక్‌డ్యాంల నిర్మాణం చేపట్టారు. నల్లగుట్ట మీద కురిసిన వర్షపు నీరు వృథాగా పోకుండా దాదాపు 120 ఎకరాల భూమిలో ఇంకేందుకు వీలుగా 12 చెక్ డ్యాంలు నిర్మించారు. వీటిలో ఏడింటిని అధికార ‡పార్టీకి చెందిన ముఖ్య కార్యకర్త బినామీ పేర్లతో నిర్మించాడు. సిమెంట్, ఇసుక, కంకర తగిన పరిమాణంలో వాడలేదు. దీనివల్ల నిర్మాణ దశలోనే పగుళ్లు ఏర్పడ్డాయి. ఒకే రైతుకు చెందిన 90 ఎకరాల చదును భూమిలో ఏకంగా ఏడు చెక్‌డ్యాంలు నిర్మించారు. వారం రోజులు గడవకనే సైడ్ వాల్స్ నెర్రెలు చీలాయి. ఈ విషయం బయటకు పొక్కకుండా తిరిగి సిమెంట్ ప్లాస్టింగ్ చేసేందుకు ప్రయత్నించారు. వాటర్ షెడ్ క్యూరింగ్ చేయకపోవడంతో అది సాధ్యపడలేదు. దీంతో నల్లమట్టి పరిచి నెర్రెలను మరుగు చేశారు. ఒక్కో చెక్‌డ్యాం నిర్మాణానికి రూ.1.10 లక్షల నుంచి రూ. 1.60 లక్షల వరకు వెచ్చించారు. వీటి నాణ్యతను పరిశీలించాల్సిన అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు. ఏకంగా సదరు వ్యక్తికి బిల్లు కూడా ఇచ్చేశారు. నాసిరకంగా నిర్మించారు : చెక్‌డ్యాంలను నాసిరకంగా నిర్మించారు. సిమెంట్, ఇసుక, కంకర తగిన మోతాదులో వాడలేదు. వీటిలో చుక్కనీరు నిలిచే ఆస్కారం లేదు. అధికారుల పర్యవేక్షణ లోపంతోనే నిధులు దుర్వినియోగమయ్యాయి. – లక్ష్మి నారాయణ, రైతు, హెచ్.సోదనపల్లి నాణ్యత లేకుంటే చర్యలు : – కృష్ణానాయక్, వాటర్‌షెడ్, అదనపు పీడీ చెక్‌డ్యాం నిర్మాణాల్లో వంద శాతం నాణ్యత ఉండాల్సిందే. సోదనపల్లిలో ఏం జరిగిందో తెలీదు. అక్కడికి వెళ్లి పరిశీలిస్తే విషయం అర్థమవుతుంది. సిబ్బంది నిర్లక్ష్యంగా ఉంటే తప్పకుండా చర్యలు తీసుకుంటాం. సమగ్ర విచారణ చేసి అక్రమాలు ఉంటే సంబంధిత ఇంజనీర్, టెక్నికల్ ఆఫీసర్, ప్రాజెక్ట్ ఆఫీసర్లపై సైతం చర్యలకు వెనుకాడం. ఎక్కడా రాజీ పడలేదు : – హనుమంతరెడ్డి, వాటర్‌షెడ్ ప్రాజెక్టు ఆఫీసర్ గూగూడు మెగా వాటర్‌షెడ్ పనుల్లో ఎక్కడా రాజీపడలేదు. సోదనపల్లి దగ్గర చెక్ డ్యాంల నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించాం. రాజకీయ పంతాలతోనే కొందరు ఆరోపణలు చేస్తున్నారు. చెక్‌డ్యాంలను పగులగొట్టి ఇసుక, సిమెంట్, కంకర మిశ్రమ పరిమాణాన్ని, నాణ్యతను పరిశీలించుకోవచ్చు. -
3 నెలలు.. రూ.39.18 కోట్లు
కర్నూలు(అగ్రికల్చర్): ‘అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని’ అన్నట్లు నిధులు పుష్కలంగా ఉన్నా వినియోగించడంలో నిర్లక్ష్యం నెలకొంది. కోట్లాది రూపాయల నిధులు వృథా అయ్యే ప్రమాదం ఉంది. జిల్లా అభివృద్ధికి ఎంతో ఉపయోగపడే నిధులను చేజేతులా ల్యాప్స్ చేసుకొనే పరిస్థితి ఏర్పడింది. ఇది డ్వామా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వాటర్షెడ్ల దుస్థితికి నిదర్శనం. సమీకృత నీటి యాజమాన్య కార్యక్రమం(ఐడబ్ల్యూఎంపీ) కింద మెగా వాటర్ షెడ్లు నిర్వహిస్తున్నారు. భూగర్భ జలాల అభివృద్ధి లక్ష్యంగా వాటర్‌షెడ్ కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టారు. నిధులు పుష్కలంగా ఉన్నాయి. వీటిని సక్రమంగా వినియోగిస్తే భూగర్భ జలాలు అభివృద్ధి చెందుతాయనడంలో సందేహం లేదు. కానీ నిధుల వినియోగంలో నిర్లక్ష్యం తాండవిస్తోంది. దీంతో నిధులు మురిగిపోయే ప్రమాదం ఏర్పడింది. 2009-10లో జిల్లాకు 13 మెగా వాటర్షెడ్లు మంజూరయ్యాయి. వీటిని 13 మండలాల్లోని 95 గ్రామాల్లో నిర్వహిస్తున్నారు. 58199 హెక్టార్లలో వాటర్‌షెడ్ కార్యక్రమాలను నిర్వహించేందుకు రూ.69.84 కోట్లు విడుదలయ్యాయి. వీటిని 2015 మార్చి లోపు పూర్తిగా వినియోగించుకోవాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు కేవలం రూ.30.66 కోట్లు మాత్రమే వినియోగించారు. నాలుగేళ్లలో మొదటి బ్యాచ్ వాటర్షెడ్ల కోసం కేవలం రూ.30.66 కోట్లు మాత్రమే ఖర్చు చేయడంతో ఇంకా రూ.39.18 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంది. ఇందుకు కేవలం మూడు నెలలు మాత్రమే సమయం వుంది. ఈ నిధులు వినియోగించకపోతే ల్యాప్స్ అయిపోతాయి. ఐడబ్ల్యూఎంపీ వాటర్షెడ్ల నిర్వహణ జిల్లా నీటి యాజమాన్య సంస్థలో ఒక భాగమే. వాటర్‌షెడ్ కార్యక్రమాల అమలుకు జిల్లా స్థాయిలో పీడీ ఉండగా, పర్యవేక్షణకు ఇద్దరు అదనపు పీడీలు ఉన్నారు. మండల స్థాయిలో ప్రాజెక్టు ఆఫీసర్లు, సాంకేతిక అధికారులు తదితరులు ఉన్నారు. గ్రామ వాటర్‌షెడ్ కమిటీలు ఉన్నాయి. ప్రాజెక్టు ఆఫీసర్లు, సాంకేతిక అధికారులు కుంటి సాకులు చెబుతూ పనుల నిర్వహణలో అలసత్వం వహిస్తున్నట్లు తెలుస్తోంది. గడువు ముగియవస్తున్నా నిధుల వినియోగం 50 శాతం కూడా మించకపోవడంతో జిల్లా కలెక్టర్ విజయమోహన్ వాటర్‌షెడ్ యంత్రాంగంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. గత నెలలో నిర్వహించిన డివిజనల్ సమావేశంలో వాటర్‌షెడ్ నిధుల వినియోగంపై మండిపడ్డారు. నెల రోజుల్లో నిధుల వినియోగాన్ని పెంచాలని లేకపోతే చర్యలు ఉంటాయని ప్రాజెక్టు ఆఫీసర్లు, సాంకేతిక అధికారులను హెచ్చరించారు. కానీ ఫలితం లేదు. భూముల్లో పంటలు ఉన్నాయనే కారణాలతో పనుల నిర్వహణలో అలసత్వం వహిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా.. రెండవ బ్యాచ్ కింద 2010-11లో 16 మెగా వాటర్షెడ్లు మంజూరయ్యాయి. వీటిని 16 మండలాల్లోని 104 గ్రామాల్లో అమలు చేస్తున్నారు. రెండవ బ్యాచ్ వాటర్ షెడ్ కార్యక్రమాల నిర్వహణకు రూ.79.36 కోట్లు విడుదలయ్యాయి. ఇందులో ఇప్పటి వరకు రూ.28.27 కోట్లు మాత్రమే వ్యయం చేశారు. 2016 మార్చి నెల చివరిలోపు మిగిలిన రూ.50.99 కోట్లు వ్యయం చేయాల్సి ఉంది. నిధులు వినియోగించుకోలేకపోతే ల్యాప్స్ అవుతాయి. చేపట్టాల్సిన పనులు ఇవే... వాటర్‌షెడ్ కార్యక్రమాల కింద భూగర్భ జలాల అభివృద్ధి చేసే పనులకు ప్రాధాన్యత ఇస్తారు. మొత్తం నిధుల్లో ఈ పనులకు 56 శాతం నిధులు ఖర్చు చేయాల్సి ఉంది. మిగిలిన 44 శాతం నిధులను వివిధ కార్యక్రమాలకు వినియోగిస్తారు. భూగర్భ జలాల అభివృద్ధికి వాగులకు, వంకలకు చెక్‌డ్యామ్‌లు, చెక్వాళ్లు, రాతికత్వలు, రాళ్లకట్టలు, మట్టి కట్టలు, నీటి కుంటలు, ఫాంపాండ్స్, చెరువులు, డగౌటు ప్లాంట్లు, ఆర్ఎఫ్డీలు, పండ్ల తోటల పెంపకం, బండ్ ప్లాంటేషన్ అవెన్యూ ప్లాంటేషన్ వంటి పనులు నిర్వహించాల్సి ఉంది. నిధులు అపారంగా ఉన్నా పనులు చేపట్టడంలో అడుగడుగునా నిర్లక్ష్యం నెలకొని ఉంది. భూగర్భ జలాలు అంటుగంటిపోతున్నాయి. జలసంరక్షణ పనులకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంది. ఇందుకు కేంద్రం నిధుల కొరత లేకుండా మంజూరుచేస్తోంది. కానీ పనులు చేపట్టడంలో అలసత్వం నెలకొని ఉండటంతో కోట్లాది రూపాయలు వృధాగా అయ్యే అవకాశం ఉంది. కలెక్టర్ వాటర్‌షెడ్ పనుల తీరుపై అసంతృప్తితో ఉన్నారు. త్వరలో రెండవ విడత డివిజనల్ సమావేశాలు జరగనున్నాయి. వీటిల్లో వాటర్‌షెడ్ నిధుల వినియోగంపైనే సమీక్ష నిర్వహించనున్నారు. అప్పటికి ప్రగతి లేకపోతే పలువురు ప్రాజెక్టు ఆఫీసర్లు, సాంకేతిక అధికారులపై వేటు వేయడానికి కలెక్టర్ రంగం సిద్ధం చేశారు.