వాటార్‌షెడ్!
►వాటర్ షెడ్ పనుల్లో అంతులేని అవినీతి?
►కోట్లలో నిధుల స్వాహాపై ఆరోపణలు
►అధికారుల కనుసన్నల్లోనే అంతా
►కూలీల నమోదులో అవకతవకలు
►కోర్టుకు వెళ్లేందుకు రైతుల సమాలోచన
సోమల మండలంలో జరిగిన వాటర్ షెడ్ పనుల్లో అంతులేని అవినీతి చోటుచేసుకుంది. అధికార పార్టీ నేతలతో చేతులు కలిపిన కొందరు అధికారులు నిబంధనలు తుంగలో తొక్కేశారు. కూలీలతో చేయించాల్సిన పనులు యంత్రాలతో చేయించి మస్టర్లు సృష్టించా రు. వాటికి బిల్లులు చేయించుకుని వాటాలు పంచేసుకున్నారు. విషయం తెలుసుకుని రైతులు అవాక్కయ్యారు. పక్కదారి పట్టిన ప్రభుత్వ నిధులపై కోర్టు కు వెళ్లేందుకు సమాయత్తమవుతున్నారు. స్వాహా చేసిన డబ్బులు ప్రభుత్వ ఖజానాకు చేరేవరకు వదిలే ప్రసక్తే లేదని తెగేసి చెబుతున్నారు.
తిరుపతి: వాటర్‌షెడ్ పథకంలో ని«ధులు దుర్వి నియోగమయ్యామని సోమల మండలానికి చెందిన రైతులు ఆరోపిస్తున్నారు. కొంతమంది అధికారులు ఈ పనుల ద్వారా తమ ధన దాహాన్ని తీర్చుకున్నారన్న విమర్శలున్నాయి. అధికారుల అండదండలతో వాటర్‌షెడ్ పథకంలో పక్కాగా నిధులు దుర్వినియోగమైనట్లు తెలుస్తోంది. కమిటీ తయారీ సమయంలో ఫీల్డ్ అసిస్టెంట్ల నియామకానికి తిలోదకాలిచ్చి, భూముల అభివృద్ధికి చేపట్టాల్సిన పనుల్లో అక్రమాలకు పాల్పడినట్టు సమాచారం.
రూ.8 కోట్లు ఖర్చు చేసినట్టు అంచనా!
పలమనేరు కేంద్రంగా సోమల మండలంలో 2013లో వల్లిగట్ల, కామిరెడ్డిగారిపల్లె, కందూరు, తమ్మినాయునిపల్లె, నెల్లిమంద, ఇరికిపెంట పంచాయతీల్లో వాటర్‌షెడ్ పథకం ప్రవేశ పెట్టారు. సర్పంచ్‌లు అధ్యక్షులుగా ప్రతి గ్రామానికీ ఒక్కో రైతుకు సభ్యత్వం కల్పించారు. సభ్యుల ఆమోదంతో ప్రతి పంచాయతీకి ఒక ఫీల్డ్ అసిస్టెంట్‌ను నియమించారు. ప్రారంభం నుంచి 2017 మార్చి వరకు వ్యవసాయ పొలాల్లో 375 పంటకుంటలు, 35 చెక్ డ్యాంలు
నిర్మించినట్లు అధికారులు లెక్కలు చూపుతున్నారు. వీటి నిర్మాణానికి సుమారు రూ.8 కోట్లు ఖర్చు చేసినట్లు అంచనా. ఇష్టారాజ్యం కొందరు అధికారులు తమ తెలివితేటలను ఉపయోగించి ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కారు. ఇష్టారాజ్యంగా పనులు పూర్తి చేయించారు. కూలీలకు పనులు కల్పించాల్సిన చోట కాంట్రాక్టర్లను ఏర్పాటు చేసుకున్నారు. రైతులకు అవసరం లేని చోట్ల మొత్తం మిషన్లతోనే పనులు చేయించారు. సంబంధంలేని పంచాయతీల నుంచి కూలీల చేత పనులు చేయించినట్లు రికార్డులు సృష్టించారు. ఒక్క కూలీ కూడా వాటర్ షెడ్ పనులకు వెళ్లలేదని తెల్సింది. ఆరు పంచాయతీల్లో జరిగిన పనుల కోసం 14 పంచాయతీలకు చెందిన కూలీలను ఉపయోగించినట్లు రికార్డుల్లో నమోదు చేశారు. వీరి ఖాతాలకు నిధులు మళ్లించారు. వీరికి కొంతమంది జాతీయ గ్రామీణ ఉపాధి హామీ సిబ్బంది సహకారం అందించినట్లు ప్రచారం సాగుతోంది. పలు పంచాయతీల్లో కూలీల నమోదులోనూ అవకతవకలు జరినట్లు సమాచారం.
పక్కా స్కెచ్‌తోనే..
పక్కా స్కెచ్‌తో వాటర్ షెడ్‌లో ఇద్దరు టెక్నికల్ అసిస్టెంట్లు నిధుల స్వాహాకు తెరలేపారు. పనుల పర్యవేక్షించాల్సింది పోయి దగ్గరుండి యంత్రాలతో పనులు చేయించారు. కాంట్రాకర్లను నియమించుకున్నారు. వారి చేతనే మస్టర్లు రాయించుకున్నారు. ఆరు పంచాయతీ వాటర్ షెడ్లలో మిషన్లతో పనులు చేశారు. 14 పంచాయతీలలో కూలీలను నమోదు చేయించారు. వారి ఖాతాల నుంచి నగదు డ్రా చేయించుకుంటున్నారు. కొంత మంది కూలీల ఖాతాల్లో రూ.15 లక్షల వరకూ నిధులు మూలుగుతున్నాయి. తమకు తెలియకనే ఎలా మస్టర్లలో పేర్లు రాసుకున్నారని కొందరు నిలదీయడంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఉన్నతాధికారులు లోతుగా విచారిస్తే నిధుల స్వాహాపై మరిన్ని వాస్తవాలు బయటపడే వీలుంది.
– వెంకటప్పనాయుడు, కందూరు
రైతులకు అండగా ఉంటాం
మేం వాటర్‌షెడ్ పథకంలో దుర్వినియోగమైన నిధులు రాబట్టడానికి ముందుకు వచ్చే రైతులకు అండగా ఉంటాం. చెక్ డ్యాంల నిర్మాణాల్లో నిబంధనలకు తిలోదకాలిచ్చారు. కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూరే విధంగా టెక్నికల్ సిబ్బంది, జేఈ వ్యవహరించారు.
– నాగేశ్వరరావు, మార్కెట్టు కమిటీ మాజీ అధ్యక్షుడు, నెల్లిమంద