= నాసిరకంగా చెక్‌డ్యాంల నిర్మాణం
= నెల తిరక్కుండానే పగుళ్లు
= పట్టించుకోని అధికారులు
= రూ. లక్షలు దుర్వినియోగం
సాక్షి టాస్క్‌ఫోర్స్ : అనంత పర్యావరణ పరిరక్షణ సమితి (ఏపీపీఎస్) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గూగూడు మెగా వాటర్‌షెడ్‌లో అవినీతి ఏరులై పారుతోంది. జల సంరక్షణ పనులను అడ్డగోలుగా చేపడుతూ అందినకాడికి దోచుకుంటున్నారు. నార్పల మండలంలోని హెచ్.సోదనపల్లి సమీపంలో నల్లగుట్ట కింది సాగు భూముల్లో ఇటీవల సుమారు రూ.18 లక్షలతో చెక్‌డ్యాంల నిర్మాణం చేపట్టారు. నల్లగుట్ట మీద కురిసిన వర్షపు నీరు వృథాగా పోకుండా దాదాపు 120 ఎకరాల భూమిలో ఇంకేందుకు వీలుగా 12 చెక్ డ్యాంలు నిర్మించారు. వీటిలో ఏడింటిని అధికార ‡పార్టీకి చెందిన ముఖ్య కార్యకర్త బినామీ పేర్లతో నిర్మించాడు. సిమెంట్, ఇసుక, కంకర తగిన పరిమాణంలో వాడలేదు. దీనివల్ల నిర్మాణ దశలోనే పగుళ్లు ఏర్పడ్డాయి.
ఒకే రైతుకు చెందిన 90 ఎకరాల చదును భూమిలో ఏకంగా ఏడు చెక్‌డ్యాంలు నిర్మించారు. వారం రోజులు గడవకనే సైడ్ వాల్స్ నెర్రెలు చీలాయి. ఈ విషయం బయటకు పొక్కకుండా తిరిగి సిమెంట్ ప్లాస్టింగ్ చేసేందుకు ప్రయత్నించారు. వాటర్ షెడ్ క్యూరింగ్ చేయకపోవడంతో అది సాధ్యపడలేదు. దీంతో నల్లమట్టి పరిచి నెర్రెలను మరుగు చేశారు. ఒక్కో చెక్‌డ్యాం నిర్మాణానికి రూ.1.10 లక్షల నుంచి రూ. 1.60 లక్షల వరకు వెచ్చించారు. వీటి నాణ్యతను పరిశీలించాల్సిన అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు. ఏకంగా సదరు వ్యక్తికి బిల్లు కూడా ఇచ్చేశారు.
నాసిరకంగా నిర్మించారు : చెక్‌డ్యాంలను నాసిరకంగా నిర్మించారు. సిమెంట్, ఇసుక, కంకర తగిన మోతాదులో వాడలేదు. వీటిలో చుక్కనీరు నిలిచే ఆస్కారం లేదు. అధికారుల పర్యవేక్షణ లోపంతోనే నిధులు దుర్వినియోగమయ్యాయి.
– లక్ష్మి నారాయణ, రైతు, హెచ్.సోదనపల్లి
నాణ్యత లేకుంటే చర్యలు : – కృష్ణానాయక్, వాటర్‌షెడ్, అదనపు పీడీ
చెక్‌డ్యాం నిర్మాణాల్లో వంద శాతం నాణ్యత ఉండాల్సిందే. సోదనపల్లిలో ఏం జరిగిందో తెలీదు. అక్కడికి వెళ్లి పరిశీలిస్తే విషయం అర్థమవుతుంది. సిబ్బంది నిర్లక్ష్యంగా ఉంటే తప్పకుండా చర్యలు తీసుకుంటాం. సమగ్ర విచారణ చేసి అక్రమాలు ఉంటే సంబంధిత ఇంజనీర్, టెక్నికల్ ఆఫీసర్, ప్రాజెక్ట్ ఆఫీసర్లపై సైతం చర్యలకు వెనుకాడం.
ఎక్కడా రాజీ పడలేదు : – హనుమంతరెడ్డి, వాటర్‌షెడ్ ప్రాజెక్టు ఆఫీసర్
గూగూడు మెగా వాటర్‌షెడ్ పనుల్లో ఎక్కడా రాజీపడలేదు. సోదనపల్లి దగ్గర చెక్ డ్యాంల నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించాం. రాజకీయ పంతాలతోనే కొందరు ఆరోపణలు చేస్తున్నారు. చెక్‌డ్యాంలను పగులగొట్టి ఇసుక, సిమెంట్, కంకర మిశ్రమ పరిమాణాన్ని, నాణ్యతను పరిశీలించుకోవచ్చు.
గూగూడు వాటర్‌షెడ్‌లో.. అవినీతి ప్రవాహం
Published Sat, Aug 13 2016 12:08 AM | Last Updated on Sat, Sep 22 2018 8:22 PM
Advertisement
Advertisement