gugudu
-
వైభవంగా కుళ్లాయిస్వామి ప్రథమ దర్శనం
నార్పల: ప్రసిద్ధిగాంచిన గూగూడు కుళ్లాయిస్వామి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. శుక్రవారం రాత్రి 9 గంటలకు కుళ్లాయిస్వామి పంచ లోహపు ప్రతిమను పీర్ల పెట్టె నుంచి బయటకు తీసిన కొండారెడ్డి వంశీయులు భక్తులకు దర్శనంభాగ్యం కల్పించారు. భక్తులు భారీ ఎత్తున తరలివచ్చారు. స్వామి ప్రతిమను చూడాగానే ఈప్రాంతం కుళ్లాయిస్వామి నామస్మరణతో మార్మోగింది. ప్ర«థమ దర్శనంతో కుళ్లాయిస్వామి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. -
గూగూడుకు బ్రహ్మోత్సవ శోభ
నేటి నుంచి కుళ్లాయిస్వామి ఉత్సవాలు రాత్రికి స్వామివారి ప్రథమ దర్శనం ఏర్పాట్లు పూర్తిచేసిన ఆలయ అధికారులు నార్పల: రాష్ట్రంలోనే మొహర్రం ఉత్సవాలకు ప్రసిద్ధి చెందిన నార్పల మండలం గూగూడు కుళ్లాయిస్వామి ఉత్సవాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇస్లాం క్యాలెండర్ ప్రకారం ఏటా మొహర్రం నెలలో ఈ ఉత్సవాలను హిందూ, ముస్లింలు ఐక్యమత్యంతో అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. 13 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో ఆలయ ప్రధాన అర్చకుడు హుస్సేనప్ప పాతెహ చదివింపులు నిర్వహించనున్నారు. ఇక స్వామివారి పంజాలను ప్రత్యేకంగా అలంకరించి పురవీధుల్లో ఉత్సవమూర్తులను తిరుమల కొండారెడ్డి వంశీకులు ఊరేగింపు నిర్వహించనున్నారు. క్షేత్ర ప్రాశస్త్యం పూర్వం నార్పల సమీపంలోని ఓ ప్రాంతంలో గుహుడు అనే మహర్షి ఓ ఆశ్రమం ఏర్పాటు చేసుకుని శ్రీరాముని కోసం తపస్సు చేయగా...అరణ్యవాసం వెళుతున్న శ్రీరాముడు సీతా, లక్ష్మణ సమేతుడై గుహుడి ఆశ్రమం సందర్శించి అతని ఆతిథ్యం స్వీకరించాడని పురాణాలు చెబుతున్నాయి. వనవాసం పూర్తి చేసుకున్న తర్వాత అయోధ్యకు వెళ్లే సమయంలో తిరిగి ఆశ్రమానికి వస్తానని శ్రీరాముడు మాట ఇవ్వగా...అప్పటి నుంచి గుహుడు అక్కడే తపస్సు చేస్తూ గడిపాడట. అయితే శ్రీరాముడి వనవాసం పూర్తయినా తన ఆశ్రమానికి రాకపోవడంతో కలత చెందిన గుహుడు ఆత్మార్పణం చేసుకునేందుకు ఓ అగ్నిగుండం ఏర్పాటు చేసుకుని అందులో దూసేందుకు సిద్ధమవగా...తన దూరదృష్టితో ఇది గమనించిన శ్రీరాముడు...ఆంజనేయుడిని గుహుడి దగ్గరకు పంపి తాను వస్తున్న వర్తమానం అందించాడని పురాణాలు చెబుతున్నాయి. ఇచ్చిన మాట ప్రకారం సీతా, లక్ష్మణ సమేతుడైన శ్రీరాముడు అయోధ్యకు వెళ్తూ వెళ్తూ గుహుడి ఆశ్రమాన్ని సందర్శించి ఆతిథ్యం స్వీకరించాడట. ఆ తర్వాత శ్రీరాముడు అయోధ్యకు బయలుదేరి వెళ్లగా... ఆంజనేయస్వామి అక్కడే నిలిచిపోగా...ఆయనకు గుడికట్టించారని పురాణాలు చెబుతున్నాయి. గుహుడు ఆత్మార్పణం కోసం సిద్ధం చేసుకున్న అగ్నిగుండమే నేడు ఆలయం ఎదుట ఉన్న గుండమని భక్తులు చెబుతున్నారు. అందుకే ఇక్కడివచ్చే భక్తులు తప్పకుండా ఈ గుండం చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. గుహుడు తపస్సు చేసిన ఈ ప్రాంతమే కాలక్రమంలో గూగూడుగా మారిందని ఇక్కడి వారు చెబుతున్నారు. ఉత్సావాలు సాగేదిలా... గూగూడు కుళ్లాయిస్వామి బ్రహోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి 9 గంటలకు పీర్ల పెట్టెలో భద్రపరిచిన కుళ్లాయిస్వామి పంజాను బయటకు తీసి చందనం, గంధంతో శుద్ధిచేస్తారు. సంప్రదాయ పూజల అనంతరం భక్తులకు ప్రథమ దర్శనం చేయిస్తారు. - 23వ తేదీ స్వామివారి నిత్యపూజ నివేదన, - 24న అగ్నిగుండం ఏర్పాటు, - 25న కుళ్లాయిస్వామి పీర్లను చావిడిలో నిలుపుట, - 26న నిత్యపూజ నివేదన, - 27న ఐదవ సరిగెత్తు, - 28న నిత్యపూజ నివేదన, - 29న ఏడవ చిన్నసరిగెత్తు, రాత్రికి పీర్ల మెరవణి, - 30న నిత్యపూజ నివేదన, విడిదినం ప్రత్యేక పూజలు, - అక్టోబర్ నెల 1వ తేదీన పెద్ద సరిగెత్తు, రాత్రికి గ్రామోత్సవం, అగ్నిగుండ ప్రవేశం, - 2న పీర్లు జలధి కార్యక్రమం - 3న సాయంకాలం కుళ్లాయిస్వామి మూలవిరాట్ చివరి దర్శనంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని ఈఓ ఎల్ మోహన్‌రెడ్డి తెలిపారు. గూగూడు ఉత్సవాలను తిలకించడానికి రాష్రం నుంచే కాకుండా తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, గోవా రాష్ట్రాల నుంచి హిందూ, ముస్లిం భక్తులు పెద్ద ఎత్తున రానుండటంతో భక్తులు ఎలాంటి అసౌకర్యాలకు గురికాకుండా ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. -
గుడ్‌విల్ కోసం కల్వర్టు ధ్వంసం
- కాంట్రాక్టర్‌కు బెదిరింపులు - శింగనమల నియోజకవర్గంలో ‘తమ్ముళ్ల’ ఆగడాలు అనంతపురం : మారుమూల గ్రామాల అభివృద్ధిని స్వాగతించకుండా ‘తెలుగు తమ్ముళ్లు’ అరాచకాలకు దిగుతున్నారు. సొంత ప్రాంతాల్లో నిర్మాణ పనుల నాణ్యతను ఆశించాల్సింది పోయి ముడుపుల కోసం కాంట్రాక్టర్లపై బెదిరించేస్తున్నారు. కొత్త కట్టడాలను కూడా ధ్వంసం చేసి తమ రౌడీయిజాన్ని చాటుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే.. నార్పల మండలంలోని ముచ్చుకుంట నుంచి గూగూడు మీదుగా నార్పలలోని సుల్తాన్‌పేట వరకు పది కిలోమీటర్ల రహదారిని రెండు రోడ్ల మార్గంగా ఆధునీకరించేందుకు ప్రభుత్వం రూ.12.50 కోట్ల నాబార్డు నిధులను మంజూరు చేసింది. జిల్లా కేంద్రంలో నివాసమున్న ముచ్చుకుంటపల్లికి చెందిన తిరుమల కన్స్ట్రక్షన్స్కు చెందిన కాంట్రాక్టర్ అనంత సోమశేఖర్‌రెడ్డి టెండర్ దక్కించుకున్నారు. గత ఏడాది నవంబర్ నెలలో స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వవిప్ యామినీబాల, ఎమ్మెల్సీ శమంతకమణిలు రోడ్డు నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. శరవేగంగా కాంట్రాక్టర్ రోడ్డు విస్తరణ పనులకు శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో అధికార పార్టీకి చెందిన ఓ వర్గం నాయకుడు తొలుత తమ ఇలాకలో నీవు ఎలా పనులు చేస్తావంటూ కాంట్రాక్టర్‌కు తనదైన శైలిలో బెంబేలెత్తించాడు. ‘నేను ఈ ప్రాంతం వాసిని లాభాపేక్షలేకుండా గూగూడుకు నాణ్యతమైన రోడ్డును నిర్మించాలని అనుకున్నాను. ఈ రోడ్డు పనిలో ఎవరికీ సబ్ కాంట్రాక్ట్ పనులు ఇవ్వదల్చుకోలేదు’ అని సదరు కాంట్రాక్టర్ తేల్చి చెప్పాడు. అధికార పార్టీకి చెందిన వారం, అందులోనూ బలమైన సామాజిక వర్గానికి చెందిన మామాటే వినకుంటే నువ్వు రోడ్డు పనులు ఎలా చేస్తావో... మేం చూస్తామంటూ టీడీపీ నేత కాంట్రాక్టర్‌ను హెచ్చరించారు. డబుల్‌రోడ్డు విస్తరణలో భాగంగా గూగూడు సమీపంలో ముచ్చుకుంటపల్లి వైపు ఉన్న చెన్నకేశవస్వామి ఆలయం వద్ద కాంట్రాక్టర్ కల్వర్టు నిర్మాణం చేపట్టారు. ఈ నెల 6వ తేదీ రాత్రికి రాత్రే ప్రొక్లైయిన్తో టీడీపీకి చెందిన వారు దాన్ని పెకలించివేశారు. రాజకీయాలకు అతీతంగా గూగూడుకు చెందిన వారు కూడా వారి చర్యలను అడ్డుకున్నారు. రౌడీ మూకలను గ్రామ శివారు వరకు తరమికొట్టారు. ప్రొక్లైయిన్‌ను స్వాధీనం చేసుకొని ప్రజలే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కల్వర్ట్ను పెకలించింది అధికార పార్టీకి చెందిన నేత కావడంతో పోలీసులు కేసును నీరుగార్చేందుకు యత్నిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. జిల్లాకు చెందిన ఓ అమాత్యుని సోదరుడు, తనయుని వద్ద ఈ పంచాయితీ జరుగుతోందని తెలిసింది. ఈ సంఘటన పై నార్పల ఎస్ఐ రాం ప్రసాద్‌ను వివరణ కోరగా కల్వర్టు ధ్వంసం పై కేసు నమోదు చేశామని, నిందితుల కోసం ఆరా తీస్తున్నామని చెప్పారు. -
భక్తులతో కిక్కిరిసిన గూగూడు
నార్పల : గూగూడు కుళ్లాయిస్వామి బ్రహ్మోత్సవాలు కనుల పండువగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో ఎనిమిదో రోజు సోమవారం కుళ్లాయిస్వామి చిన్న సరిగెత్తును ఘనంగా నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. దీంతో గూగూడు పరిసరాలన్నీ కిక్కిరిసిపోయాయి. మత సామరస్యానికి ప్రతీక అయిన కుళ్లాయిస్వామి, ఆంజనేయస్వామిని భక్తులు దర్శించుకొని, మొక్కలు తీర్చుకున్నారు. మంగళవారం నిత్యపూజ నివేదన, విడి దినము ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు జంట ఆలయాల ఈఓ అక్కిరెడ్డి తెలిపారు. పోలీసుల నిఘాలో గూగూడు : ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా గూగూడులో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు అనంతపురం డీఎస్పీ మల్లికార్జునవర్మ తెలిపారు. ముగ్గురు డీఎస్పీలు, 20 మంది సీఐలు, 40 మంది ఎస్ఐలు, 350 మంది పోలీసులు, 50 మంది స్పెషల్ బ్రాంచ్ పోలీసులు, ఆర్మ్డ్ రిజర్వు బలగాలు విధులు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అలాగే 20 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. -
ఘనంగా కుళ్లాయిస్వామి బ్రహోత్సవాలు
నార్పల : గూగూడు కుళ్లాయిస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో ఐదవ రోజైన శుక్రవారం కుళ్లాయిస్వామికి నిత్యపూజ నివేదన ప్రత్యేక పూజలు చేశారు. శుక్రవారం వేకువజామున ఆలయ ప్రధాన అర్చకుడు హుస్సేనప్ప స్వామివారి చావిడిలో ఫాతెహాæ పూజలు జరిపారు. ఆలయ అనవాయితి ప్రకారం స్వామివారి కాపులైన తిరుమల కొండారెడ్డి వంశీకులు, ముజావర్లు ప్రత్యేక పూజలు చేశారు. తహశీల్దార్ విజయలక్ష్మి గూగూడును సందర్శించి ఉత్సవ ఏర్పాట్లను పరిశీలించారు. ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా శనివారం స్వామివారి ఐదవ సరిగెత్తు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు ఈఓ అక్కిరెడ్డి తెలిపారు. -
ప్రారంభమైన గూగూడు బ్రహ్మోత్సవాలు
గూగూడు బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సోమవారం రాత్రి ఎనిమిది గంటలకు పీర్లచావిడిలోని పెట్టెలో భద్రపరిచిన కుళ్లాయిస్వామి పంచ లోహపు ప్రతిమను దొరికిన కొండారెడ్డి వంశీకులు బయటకు తీసి ప్రథమ దర్శనం చేయించారు. కుళ్లాయిస్వామి పంజాను తిలకించడానికి భక్తులు భారీగా తరలివచ్చారు. స్వామివారి పీరును ప్ర«థమ దర్శనం కోసం చావిడి ముందుటి అరుగు పైకి తీసుకు రాగానే భక్తులు పెద్ద ఎత్తున కుళ్లాయిస్వామి నామస్మరణ చేశారు. -
గూగూడు వాటర్‌షెడ్‌లో.. అవినీతి ప్రవాహం
= నాసిరకంగా చెక్‌డ్యాంల నిర్మాణం = నెల తిరక్కుండానే పగుళ్లు = పట్టించుకోని అధికారులు = రూ. లక్షలు దుర్వినియోగం సాక్షి టాస్క్‌ఫోర్స్ : అనంత పర్యావరణ పరిరక్షణ సమితి (ఏపీపీఎస్) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గూగూడు మెగా వాటర్‌షెడ్‌లో అవినీతి ఏరులై పారుతోంది. జల సంరక్షణ పనులను అడ్డగోలుగా చేపడుతూ అందినకాడికి దోచుకుంటున్నారు. నార్పల మండలంలోని హెచ్.సోదనపల్లి సమీపంలో నల్లగుట్ట కింది సాగు భూముల్లో ఇటీవల సుమారు రూ.18 లక్షలతో చెక్‌డ్యాంల నిర్మాణం చేపట్టారు. నల్లగుట్ట మీద కురిసిన వర్షపు నీరు వృథాగా పోకుండా దాదాపు 120 ఎకరాల భూమిలో ఇంకేందుకు వీలుగా 12 చెక్ డ్యాంలు నిర్మించారు. వీటిలో ఏడింటిని అధికార ‡పార్టీకి చెందిన ముఖ్య కార్యకర్త బినామీ పేర్లతో నిర్మించాడు. సిమెంట్, ఇసుక, కంకర తగిన పరిమాణంలో వాడలేదు. దీనివల్ల నిర్మాణ దశలోనే పగుళ్లు ఏర్పడ్డాయి. ఒకే రైతుకు చెందిన 90 ఎకరాల చదును భూమిలో ఏకంగా ఏడు చెక్‌డ్యాంలు నిర్మించారు. వారం రోజులు గడవకనే సైడ్ వాల్స్ నెర్రెలు చీలాయి. ఈ విషయం బయటకు పొక్కకుండా తిరిగి సిమెంట్ ప్లాస్టింగ్ చేసేందుకు ప్రయత్నించారు. వాటర్ షెడ్ క్యూరింగ్ చేయకపోవడంతో అది సాధ్యపడలేదు. దీంతో నల్లమట్టి పరిచి నెర్రెలను మరుగు చేశారు. ఒక్కో చెక్‌డ్యాం నిర్మాణానికి రూ.1.10 లక్షల నుంచి రూ. 1.60 లక్షల వరకు వెచ్చించారు. వీటి నాణ్యతను పరిశీలించాల్సిన అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు. ఏకంగా సదరు వ్యక్తికి బిల్లు కూడా ఇచ్చేశారు. నాసిరకంగా నిర్మించారు : చెక్‌డ్యాంలను నాసిరకంగా నిర్మించారు. సిమెంట్, ఇసుక, కంకర తగిన మోతాదులో వాడలేదు. వీటిలో చుక్కనీరు నిలిచే ఆస్కారం లేదు. అధికారుల పర్యవేక్షణ లోపంతోనే నిధులు దుర్వినియోగమయ్యాయి. – లక్ష్మి నారాయణ, రైతు, హెచ్.సోదనపల్లి నాణ్యత లేకుంటే చర్యలు : – కృష్ణానాయక్, వాటర్‌షెడ్, అదనపు పీడీ చెక్‌డ్యాం నిర్మాణాల్లో వంద శాతం నాణ్యత ఉండాల్సిందే. సోదనపల్లిలో ఏం జరిగిందో తెలీదు. అక్కడికి వెళ్లి పరిశీలిస్తే విషయం అర్థమవుతుంది. సిబ్బంది నిర్లక్ష్యంగా ఉంటే తప్పకుండా చర్యలు తీసుకుంటాం. సమగ్ర విచారణ చేసి అక్రమాలు ఉంటే సంబంధిత ఇంజనీర్, టెక్నికల్ ఆఫీసర్, ప్రాజెక్ట్ ఆఫీసర్లపై సైతం చర్యలకు వెనుకాడం. ఎక్కడా రాజీ పడలేదు : – హనుమంతరెడ్డి, వాటర్‌షెడ్ ప్రాజెక్టు ఆఫీసర్ గూగూడు మెగా వాటర్‌షెడ్ పనుల్లో ఎక్కడా రాజీపడలేదు. సోదనపల్లి దగ్గర చెక్ డ్యాంల నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించాం. రాజకీయ పంతాలతోనే కొందరు ఆరోపణలు చేస్తున్నారు. చెక్‌డ్యాంలను పగులగొట్టి ఇసుక, సిమెంట్, కంకర మిశ్రమ పరిమాణాన్ని, నాణ్యతను పరిశీలించుకోవచ్చు.