గుడ్‌విల్ కోసం కల్వర్టు ధ్వంసం
- కాంట్రాక్టర్‌కు బెదిరింపులు
- శింగనమల నియోజకవర్గంలో ‘తమ్ముళ్ల’ ఆగడాలు
అనంతపురం : మారుమూల గ్రామాల అభివృద్ధిని స్వాగతించకుండా ‘తెలుగు తమ్ముళ్లు’ అరాచకాలకు దిగుతున్నారు. సొంత ప్రాంతాల్లో నిర్మాణ పనుల నాణ్యతను ఆశించాల్సింది పోయి ముడుపుల కోసం కాంట్రాక్టర్లపై బెదిరించేస్తున్నారు. కొత్త కట్టడాలను కూడా ధ్వంసం చేసి తమ రౌడీయిజాన్ని చాటుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే.. నార్పల మండలంలోని ముచ్చుకుంట నుంచి గూగూడు మీదుగా నార్పలలోని సుల్తాన్‌పేట వరకు పది కిలోమీటర్ల రహదారిని రెండు రోడ్ల మార్గంగా ఆధునీకరించేందుకు ప్రభుత్వం రూ.12.50 కోట్ల నాబార్డు నిధులను మంజూరు చేసింది. జిల్లా కేంద్రంలో నివాసమున్న ముచ్చుకుంటపల్లికి చెందిన తిరుమల కన్‌స్ట్రక‌్షన్స్‌కు చెందిన కాంట్రాక్టర్ అనంత సోమశేఖర్‌రెడ్డి టెండర్ దక్కించుకున్నారు.
గత ఏడాది నవంబర్ నెలలో స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వవిప్ యామినీబాల, ఎమ్మెల్సీ శమంతకమణిలు రోడ్డు నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. శరవేగంగా కాంట్రాక్టర్ రోడ్డు విస్తరణ పనులకు శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో అధికార పార్టీకి చెందిన ఓ వర్గం నాయకుడు తొలుత తమ ఇలాకలో నీవు ఎలా పనులు చేస్తావంటూ కాంట్రాక్టర్‌కు తనదైన శైలిలో బెంబేలెత్తించాడు. ‘నేను ఈ ప్రాంతం వాసిని లాభాపేక్షలేకుండా గూగూడుకు నాణ్యతమైన రోడ్డును నిర్మించాలని అనుకున్నాను. ఈ రోడ్డు పనిలో ఎవరికీ సబ్ కాంట్రాక్ట్ పనులు ఇవ్వదల్చుకోలేదు’ అని సదరు కాంట్రాక్టర్ తేల్చి చెప్పాడు. అధికార పార్టీకి చెందిన వారం, అందులోనూ బలమైన సామాజిక వర్గానికి చెందిన మామాటే వినకుంటే నువ్వు రోడ్డు పనులు ఎలా చేస్తావో... మేం చూస్తామంటూ టీడీపీ నేత కాంట్రాక్టర్‌ను హెచ్చరించారు.
డబుల్‌రోడ్డు విస్తరణలో భాగంగా గూగూడు సమీపంలో ముచ్చుకుంటపల్లి వైపు ఉన్న చెన్నకేశవస్వామి ఆలయం వద్ద కాంట్రాక్టర్ కల్వర్టు నిర్మాణం చేపట్టారు. ఈ నెల 6వ తేదీ రాత్రికి రాత్రే ప్రొక్లైయిన్‌తో టీడీపీకి చెందిన వారు దాన్ని పెకలించివేశారు. రాజకీయాలకు అతీతంగా గూగూడుకు చెందిన వారు కూడా వారి చర్యలను అడ్డుకున్నారు. రౌడీ మూకలను గ్రామ శివారు వరకు తరమికొట్టారు. ప్రొక్లైయిన్‌ను స్వాధీనం చేసుకొని ప్రజలే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కల్వర్ట్‌ను పెకలించింది అధికార పార్టీకి చెందిన నేత కావడంతో పోలీసులు కేసును నీరుగార్చేందుకు యత్నిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. జిల్లాకు చెందిన ఓ అమాత్యుని సోదరుడు, తనయుని వద్ద ఈ పంచాయితీ జరుగుతోందని తెలిసింది. ఈ సంఘటన పై నార్పల ఎస్‌ఐ రాం ప్రసాద్‌ను వివరణ కోరగా కల్వర్టు ధ్వంసం పై కేసు నమోదు చేశామని, నిందితుల కోసం ఆరా తీస్తున్నామని చెప్పారు.