గూగూడుకు బ్రహ్మోత్సవ శోభ
నేటి నుంచి కుళ్లాయిస్వామి ఉత్సవాలు
రాత్రికి స్వామివారి ప్రథమ దర్శనం
ఏర్పాట్లు పూర్తిచేసిన ఆలయ అధికారులు
నార్పల: రాష్ట్రంలోనే మొహర్రం ఉత్సవాలకు ప్రసిద్ధి చెందిన నార్పల మండలం గూగూడు కుళ్లాయిస్వామి ఉత్సవాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇస్లాం క్యాలెండర్ ప్రకారం ఏటా మొహర్రం నెలలో ఈ ఉత్సవాలను హిందూ, ముస్లింలు ఐక్యమత్యంతో అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. 13 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో ఆలయ ప్రధాన అర్చకుడు హుస్సేనప్ప పాతెహ చదివింపులు నిర్వహించనున్నారు. ఇక స్వామివారి పంజాలను ప్రత్యేకంగా అలంకరించి పురవీధుల్లో ఉత్సవమూర్తులను తిరుమల కొండారెడ్డి వంశీకులు ఊరేగింపు నిర్వహించనున్నారు.
క్షేత్ర ప్రాశస్త్యం
పూర్వం నార్పల సమీపంలోని ఓ ప్రాంతంలో గుహుడు అనే మహర్షి ఓ ఆశ్రమం ఏర్పాటు చేసుకుని శ్రీరాముని కోసం తపస్సు చేయగా...అరణ్యవాసం వెళుతున్న శ్రీరాముడు సీతా, లక్ష్మణ సమేతుడై గుహుడి ఆశ్రమం సందర్శించి అతని ఆతిథ్యం స్వీకరించాడని పురాణాలు చెబుతున్నాయి. వనవాసం పూర్తి చేసుకున్న తర్వాత అయోధ్యకు వెళ్లే సమయంలో తిరిగి ఆశ్రమానికి వస్తానని శ్రీరాముడు మాట ఇవ్వగా...అప్పటి నుంచి గుహుడు అక్కడే తపస్సు చేస్తూ గడిపాడట. అయితే శ్రీరాముడి వనవాసం పూర్తయినా తన ఆశ్రమానికి రాకపోవడంతో కలత చెందిన గుహుడు ఆత్మార్పణం చేసుకునేందుకు ఓ అగ్నిగుండం ఏర్పాటు చేసుకుని అందులో దూసేందుకు సిద్ధమవగా...తన దూరదృష్టితో ఇది గమనించిన శ్రీరాముడు...ఆంజనేయుడిని గుహుడి దగ్గరకు పంపి తాను వస్తున్న వర్తమానం అందించాడని పురాణాలు చెబుతున్నాయి. ఇచ్చిన మాట ప్రకారం సీతా, లక్ష్మణ సమేతుడైన శ్రీరాముడు అయోధ్యకు వెళ్తూ వెళ్తూ గుహుడి ఆశ్రమాన్ని సందర్శించి ఆతిథ్యం స్వీకరించాడట. ఆ తర్వాత శ్రీరాముడు అయోధ్యకు బయలుదేరి వెళ్లగా... ఆంజనేయస్వామి అక్కడే నిలిచిపోగా...ఆయనకు గుడికట్టించారని పురాణాలు చెబుతున్నాయి. గుహుడు ఆత్మార్పణం కోసం సిద్ధం చేసుకున్న అగ్నిగుండమే నేడు ఆలయం ఎదుట ఉన్న గుండమని భక్తులు చెబుతున్నారు. అందుకే ఇక్కడివచ్చే భక్తులు తప్పకుండా ఈ గుండం చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. గుహుడు తపస్సు చేసిన ఈ ప్రాంతమే కాలక్రమంలో గూగూడుగా మారిందని ఇక్కడి వారు చెబుతున్నారు.
ఉత్సావాలు సాగేదిలా...
గూగూడు కుళ్లాయిస్వామి బ్రహోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి 9 గంటలకు పీర్ల పెట్టెలో భద్రపరిచిన కుళ్లాయిస్వామి పంజాను బయటకు తీసి చందనం, గంధంతో శుద్ధిచేస్తారు. సంప్రదాయ పూజల అనంతరం భక్తులకు ప్రథమ దర్శనం చేయిస్తారు.
- 23వ తేదీ స్వామివారి నిత్యపూజ నివేదన,
- 24న అగ్నిగుండం ఏర్పాటు,
- 25న కుళ్లాయిస్వామి పీర్లను చావిడిలో నిలుపుట,
- 26న నిత్యపూజ నివేదన,
- 27న ఐదవ సరిగెత్తు,
- 28న నిత్యపూజ నివేదన,
- 29న ఏడవ చిన్నసరిగెత్తు, రాత్రికి పీర్ల మెరవణి,
- 30న నిత్యపూజ నివేదన, విడిదినం ప్రత్యేక పూజలు,
- అక్టోబర్ నెల 1వ తేదీన పెద్ద సరిగెత్తు, రాత్రికి గ్రామోత్సవం, అగ్నిగుండ ప్రవేశం,
- 2న పీర్లు జలధి కార్యక్రమం
- 3న సాయంకాలం కుళ్లాయిస్వామి మూలవిరాట్ చివరి దర్శనంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని ఈఓ ఎల్ మోహన్‌రెడ్డి తెలిపారు. గూగూడు ఉత్సవాలను తిలకించడానికి రాష్రం నుంచే కాకుండా తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, గోవా రాష్ట్రాల నుంచి హిందూ, ముస్లిం భక్తులు పెద్ద ఎత్తున రానుండటంతో భక్తులు ఎలాంటి అసౌకర్యాలకు గురికాకుండా ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.