భక్తులతో కిక్కిరిసిన గూగూడు
నార్పల : గూగూడు కుళ్లాయిస్వామి బ్రహ్మోత్సవాలు కనుల పండువగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో ఎనిమిదో రోజు సోమవారం కుళ్లాయిస్వామి చిన్న సరిగెత్తును ఘనంగా నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. దీంతో గూగూడు పరిసరాలన్నీ కిక్కిరిసిపోయాయి. మత సామరస్యానికి ప్రతీక అయిన కుళ్లాయిస్వామి, ఆంజనేయస్వామిని భక్తులు దర్శించుకొని, మొక్కలు తీర్చుకున్నారు. మంగళవారం నిత్యపూజ నివేదన, విడి దినము ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు జంట ఆలయాల ఈఓ అక్కిరెడ్డి తెలిపారు.
పోలీసుల నిఘాలో గూగూడు : ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా గూగూడులో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు అనంతపురం డీఎస్పీ మల్లికార్జునవర్మ తెలిపారు. ముగ్గురు డీఎస్పీలు, 20 మంది సీఐలు, 40 మంది ఎస్‌ఐలు, 350 మంది పోలీసులు, 50 మంది స్పెషల్ బ్రాంచ్ పోలీసులు, ఆర్మ్‌డ్ రిజర్వు బలగాలు విధులు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అలాగే 20 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు.