డర్మటాలజీ కౌన్సెలింగ్
మణికట్టుపైతత తీవ్రమైన దురద, పొక్కులొస్తున్నాయి?
నా వయసు 24. నా రిస్ట్వాచీకి మెటల్ స్ట్రాప్ కంటే లెదర్ స్ట్రాప్ ఇష్టం. కానీ నేను లెదర్స్ట్రాప్ వాడితే ఆ భాగంలో తీవ్రమైన దురద, చిన్న చిన్న పొక్కులు వస్తున్నాయి. దీనికి పరిష్కారం చెప్పండి.
- సందీప్, నల్గొండ
మనలో చాలామందిలో రిస్ట్వాచీకి లెదర్స్ట్రాప్స్నే ఇష్టపడుతుంటాం. అయితే లెదర్‌తో తయారైనవి అని చెప్పే చాలా స్ట్రాప్స్... పూర్తిగా లెదర్‌తో కాకుండా 50 శాతం లెదర్, మరో 50 శాతం రెక్సిన్ కలిసిన పదార్థంతో తయారు చేస్తారు. ఎందుకంటే పూర్తి లెదర్‌తో చేసిన స్ట్రాప్స్ చాలా ఖరీదైనవిగా ఉంటాయి. ఇలా వాటిలో రెక్సిన్ మిక్స్ చేసి రూపొందించిన కృత్రిమ లెదర్ స్ట్రాప్స్ వల్ల కొందరిలో కాంటాక్ట్ డర్మటైటిస్ అనే కండిషన్ రావచ్చు. దీన్నే ‘అలర్జిక్ కాంటాక్ట్ డర్మటైటిస్’ అని కూడా అంటారు. మీ సమస్యకు పరిష్కారాలు...
1. మీకు సమస్య వచ్చిన చోట చాలా తక్కువ మోతాదులో లేదా ఓ మోస్తరు మోతాదులో (మైల్డ్-మాడరేట్) కార్టికోస్టెరాయిడ్ ఉన్న మోమ్యాటోసోన్ ఫ్యూరోయేట్ క్రీమును ఒక వారం పాటు రాయండి.
2. కృత్రిమ లెదర్ స్ట్రాప్‌తో ఉన్న వాచీ పెట్టుకోవడం ఆపేయండి. మెటల్ స్ట్రాప్‌ను ధరించండి.
3. ఒకవేళ మీకు లెదర్ స్ట్రాపే పెట్టుకోవాలని అనిపిస్తే... మీ చర్మానికీ, లెదర్కూ మధ్య అడ్డు ఉండేలా మీ స్ట్రాప్ లోపలివైపున సెల్లోటేప్ అతికించి, అప్పుడు దాన్ని ధరించండి. ఈ సెల్లోటేప్ నేరుగా కృత్రిమ లెదర్స్ట్రాప్ మీ చర్మానికి ఆనకుండా ఒక రక్షణ పొరలా ఉంటుంది.
నా వయసు 28 ఏళ్లు. గృహిణిని. నాకు గోల్డ్‌చెయిన్ వేసుకోవడం చాలా ఇష్టం. కానీ చైన్ మెడకు ఆనుకునే చోట నల్లగా మారుతోంది. నా సమస్యకు పరిష్కారం చెప్పండి.
- సుమ, వరంగల్
కాస్త బరువు ఎక్కువగా ఉండే చెయిన్లు వాడే మహిళల్లో అది మెడకు ఆనుకునే భాగం నల్లబారడం చాలా సాధారణ సమస్య. పైన పేర్కొన్న సమస్యలాగే ఇది ఒక రకంగా అలర్జీ కలిగించే కాంటాక్ట్ డర్మటైటిసే. మీకు బంగారంతో చేసిన చైన్తోనూ ఇలాంటి సమస్య వస్తుందంటే, మీ చైన్ స్మూత్‌గా లేకుండా కాస్త గరుకుగా ఉండి, అది మెడపై కలిగించే ఫ్రిక్షన్ కారణంగానే ఈ సమస్య కలుగుతుండవచ్చు. ఈ ఒరుసుకుపోవడాన్ని ఇలాగే కొనసాగిస్తే సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది. పరిష్కారం కోసం ఈ కింది సూచనలు పాటించండి.
1. చైన్ వేసుకొని ఉండే వ్యవధిని తగ్గించండి. అంటే నలుగురిలోకి వచ్చినప్పుడు వేసుకోండి. ఇంట్లో ఉన్నప్పుడు, రాత్రివేళల్లో ధరించి ఉండకండి.
2. మీ చైన్ గరుకుగా ఉండేందుకు బదులు స్మూత్‌గా ఉండేలా చూసుకోండి.
3. షియాబటర్ ఉన్న మాయిశ్చరైజర్‌ను ముందుగా మెడకు రాసుకోండి. దాంతోపాటు కోజిక్ యాసిడ్, ఆర్బ్యు టిన్, లికోరైస్ పదార్థాలు ఉన్న క్రీమును కూడా ప్రతిరోజూ రాత్రి మెడుకు రాసుకొని పడుకోండి.
డాక్టర్ స్మిత ఆళ్లగడ్డ
చీఫ్ డర్మటాలజిస్ట్,
త్వచ స్కిన్ క్లినిక్,
గచ్చిబౌలి, హైదరాబాద్