ఊరు దాటకుండానే ఊడ్చేశారు!
కాగజ్‌నగర్ రూరల్ : విద్యార్థులను సన్మార్గంలో నడిపించాల్సిన ఉపాధ్యాయులు అక్రమాలకు పాల్పడుతున్నారు. వచ్చే వేతనం సరిపోవడం లేదో.. ప్రభుత్వ సొమ్మేకదా పోయేదేముంది అనుకున్నారో.. కొంత మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు అక్రమాలకు పాల్పడ్డారు. 2010-11 సంవత్సరంలో జిల్లాలోని 38 మండలాలకు చెందిన 2,525మంది ఉపాధ్యాయులు ప్రయాణాలు చేయకుండానే లీవ్ ట్రావెల్ కన్సెషన్(ఎల్టీసీ), హోం టౌన్ పేరిట సుమారు రూ.2,02,23,127 స్వాహా చేశారు.
ఈ విషయాన్ని గతంలో సాక్షి ప్రచురించిన విషయం తెలిసిందే. సమాచార హక్కు చట్టం ద్వారా 2010-11 హోంటౌన్ నిధులు పొందిన ఉపాధ్యాయుల వివరాలను కోరుతూ పట్టణానికి చెందిన జాగృతి వ్యవస్థాపక అధ్యక్షుడు అశ్రాఫ్ దరఖాస్తు చేసుకోగా వివరాలు వెల్లడయ్యాయి. గతంలో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అవినీతి జరిగినట్లు ప్రభుత్వానికి నివేది క అందించారు. దీంతో రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు జిల్లా విద్యాశాఖ అధికారులకు సంబంధిత ఉపాధ్యాయుల నుంచి నిధులు రికవరీ చేయాలని నోటీసులు జారీ చేసింది.
తాజాగా నిధుల దుర్వినియోగానికి పాల్పడిన ఉపాధ్యాయుల జూలై మాసం వేతనాల నుంచి నిధులు రికవరీ చేయాలని ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రయాణం చేయకుండానే బోగస్ బిల్లులు సమర్పించి అక్రమంగా పొందిన భత్యాన్ని ఉపాధ్యాయుల వేతనాల నుంచి 10 శాతం వడ్డీతో కోత, ఇంక్రిమెంట్ల నిలిపివేయాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ మేరకు జిల్లా విద్యాధికారి నుంచి ఆయా మండలాల ఎంఈవోలకు ఉత్వర్వుల కాపీలు అందాయి.
ఉపాధ్యాయుల నిర్వాకం
ప్రభుత్వ ఉపాధ్యాయులు తమ సొంత ఊళ్లకు కుటుంబీ కులతో కలిసి వెళ్లేందుకు లీవ్ ట్రావెల్ కన్సెషన్(ఎల్టీసీ)ని మంజూరు చేస్తారు. జీవో నంబర్ 40ప్రకారం ఎల్టీసీ కింద నాలుగేళ్లకోమారు విహారయాత్రలకు, రెండేళ్లకోమారు హోంటౌన్ కింద ఉపాధ్యాయులు కుటుంబ సభ్యులతో బంధువుల ఇంటికి వెళ్లివచ్చేందుకు వెసులుబాటు ఉంది. దీనిపై పూర్తిస్థాయి అధికారాలు ఎంఈవో, ప్రధానోపాధ్యాలకు ఉన్నాయి. దీన్ని ఆసరాగా చేసుకు న్న ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయు లు బోగస్ ప్రయాణ భత్యానికి తెరలేపారు. నిబంధనల ప్రకారం ప్రయాణానికి వెళ్లే ముందు 80 శాతం అడ్వాన్స్‌గా అందించాల్సి ఉంటుంది. బిల్లులు సమర్పించిన అనంతరం 20 శాతం మంజూరు చేయాల్సి ఉంటుంది. విద్యాశాఖ కల్పించిన ఈ వెసులుబాటును ఆసరాగా చేసుకుని కొందరు ఎంఈవోలు, ఉపాధ్యాయులు అక్రమాలకు పాల్పడ్డారు.
అందరిదీ ఇచ్చాపురమేనా?
సిర్పూర్ నియోజకవర్గంలోని ఆయా మండలాల ఉపాధ్యాయులందరి పూర్వికులదీ శ్రీకాకులం జిల్లా ఇచ్చాపురమేనట. ఇది వినడానికి వింతగానే ఉన్నా ప్రభుత్వ రికార్డుల ప్రకారం ఇది వాస్తవం. ఎందుకంటే హోంటౌన్ పేరిట నియోజకవర్గంలోని సుమారు 200 మంది శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురమే వెళ్లి వచ్చారట. తమ పూర్వీకుల గ్రామం ఇచ్చాపురం అని చూపెడుతూ వారు బస్సు టికెట్లను కూడా పొందుపరిచి నిధులను స్వాహా చేశారు. ఇందులో మరో వింత ఏంటంటే ఈజ్గాం బెంగాళీ క్యాంపులోని ఉపాధ్యాయులంతా బెంగాళీలే.
వీరు కూడా ఇచ్చాపురం తమ పూర్వీకుల గ్రామం అంటూ బిల్లులు పొందారు. బెంగాళీ క్యాంపులోని బెంగాళీలు 1972లో పశ్చిమబెంగాల్ నుంచి ఇక్కడికి వలస వచ్చారు. వీరి కోసం అప్పట్లోనే ప్రభుత్వం ప్రత్యే క రాయితీల ద్వారా బెంగాళీ మీడియం పాఠశాలలను నెలకొల్పి బెంగాళీలనే ఉపాధ్యాయులుగా నియమిం చింది. వీరికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పూర్వీకులు ఉండే అవకాశం లేదు.
ఇక తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోశిస్తూ, ఉపాధ్యాయ సంఘాల పేరు చెప్పుకునే పలువురు ఉపాధ్యాయులు తాము తెలంగాణ వాళ్లం కాదు.. ఆంధ్రావాళ్లం అంటూ ఇచ్చాపురం మా పూర్వీకుల గ్రా మం అని బిల్లులు పొందారు. ఈ విషయం కింది స్థాయి నుంచి ఉన్నతాధికారుల వరకు తెలిసినా బిల్లుల మం జూరు ఎలా జరిగిందో అర్థం చేసుకోవచ్చు. ఇలా జిల్లాలోని అనేక మంది ఉపాధ్యాయులు అనేక ప్రదేశాలకు వెళ్లి వచ్చినట్లు బిల్లులు పొందారు. అక్రమాలకు పాల్పడినందుకు విద్యాశాఖ నిధులు రికవరీ చేస్తోంది.