నేడు లెఫ్ట్ హ్యాండర్స్ డే
కుడి ఎడమైతే..పొరపాటు లేదోయ్..
జోగిపేట:చాలామంది కుడిచేత్తోనే పనిచేస్తారు. కానీ కొద్ది మందికి మాత్రం ఎడమ చేతి వాటం ఉంటుంది. చిన్నప్పటి నుంచే వారు ఎడమ చేత్తో పనిచేయడం అలవాటు. లెఫ్ట్ హ్యాండర్స్ తమ పనులన్నింటినీ ఎడమచేత్తోనే చేసుకుంటారు. ఇటువంటి వారిలో పలువురు ప్రముఖులు కూడా ఉన్నారు. వీరిలో ఆల్బర్ట్ ఐన్‌స్టీన్, అలెగ్జాండర్ ది గ్రేట్, అడాల్ఫ్ హిట్లర్, మార్లిన్ మన్రో, చార్లీ చాప్లిన్, వాజ్పాయ్, సౌరభ్‌గంగూలీ, యువరాజ్‌సింగ్ వంటి వారున్నారు. తొలి లెఫ్ట్ హ్యాండర్స్ డే 1976 ఆగస్టు 13న జరిగింది.
లెఫ్ట్హ్యాండర్స్ను సౌత్ పాస్ అని అంటారు. వాళ్లు మనకెన్నో జోకులు చెప్తారు. వివిధ సందర్భాల్లో తమ మీద తాము లేదా వారి మీద ఇతరులు పేల్చిన చతురోక్తులు చెప్తారు.
ఎదురయ్యే ఇబ్బందులు...
సాధారణంగా రైట్హ్యాండర్స్ను దృష్టిలో పెట్టుకొని అన్ని వస్తువులు రూపుదిద్దుకుంటాయి. స్కూల్లో లైఫ్ట్ హ్యాండర్స్ కోసం ఏర్పాటైన డెస్కులు ఎప్పుడైనా చూశారా. ఇక అరుదుగా లభించే ఎడమచేతివాటంగా ఉండే వస్తువులు ఏవైనా చాలా ఖరీదుగా ఉంటాయి. ఇక బ్రాండెడ్ కాఫీ మగ్గులపై కుడిచేత్తో పట్టుకుంటేనే కనిపించేలా బొమ్మ లేదా అక్షరాలు ఉంటాయి. కత్తెరలు కుడిచేత్తో పట్టుకుంటే నే అనువుగా ఉంటాయి.
కంప్యూటర్ మౌస్ కూడా అంతే.. కుడిచేత్తో పనిచేసేందుకు వీలుగా రూపొందింది. ఇలా దాదాపు అన్ని వస్తువులు రైట్హ్యాండర్ను దృష్టిలో ఉంచుకొని రూపుదిద్దుకున్నవే. బిడ్డ ఏ చేతి వాటంతో ఉంటే ఆ చేయి నోటికి దగ్గరగా పెట్టుకుంటుందని పలు పరిశోధనల్లో గుర్తించారు. ఇక ఎడమచేతివాటం ఏర్పడడానికి ఎల్ఆర్ఆర్ఎం-1 అనే జన్యువు కూడా కారణమవుతోందని మరో పరిశోధనలో వెల్లడైంది.
చిన్నప్పటి నుంచే అలవాటైంది
చిన్నప్పటి నుంచి ఎడమచేతితోనే రాయడం అలవాటైంది. కుడి చేతితో రాసేందుకు ప్రయత్నించినా రావడంలేదు. బోజనం మాత్రం కుడిచేతితోనే చేస్తాను. మొదట్లో తనను ఎడమచేతిని వినియోగించడంపై స్నేహితులు గేలి చేసేవారు. తర్వాత అలా అనడం మానేశారు. దినచర్యలో ఎక్కువగా ఎడమచేతికే ఎక్కువగా పనిచెబుతాను. మా ఇంట్లో ఎవ్వరికీ ఎడమ చేతి వాటం లేకున్నా నాకు రావడంపై మా ఇంట్లో వాళ్లు ఆశ్చర్యపోతుంటారు. ప్రస్తుతం తాను జోగిపేటలోని ఆక్స్ఫర్డ్ పబ్లిక్ స్కూల్లో 8వ తరగతి చదువుతున్నాను.
- ఆకుల చండిక, విద్యార్థిని, జోగిపేట
ఎడమచేతే అచ్చొచ్చింది
తనకు ఎడమచేతే అచ్చొచ్చింది. తన జీవితం అన్ని విధాలు సాఫీగా సాగడానికి అదేకారణమని తాను భావిస్తున్నాను. బీహెచ్ఇఎల్ ఉద్యోగి తనకు జీవితభాగస్వామిగా లభించారు. తనకు తెలియకుండానే ఎక్కువగా ఎడమచేతిని వినియోగించడం అలవాటు చేసుకున్నాను. ప్రస్తుతం డిగ్రీ పూర్తి చేసి గృహిణిగా ఉంటున్నాను. చదువుకునే సమయంలో ఎడమచేతి విషయమై ఎవ్వరూ పట్టించుకోరు. కాని ఏదైనా ఫంక్షన్లకు, ఇతర కార్యక్రమాలకు వెళ్లినప్పుడు ఎడమచేతిని వినియోగిస్తే వింతగా చూస్తుంటారు. తన పెద్ద కుమారుడు ఆకాష్ కూడా ఎడమచేతి వాటం రావడం ఆశ్చర్యం కల్గించింది. ఎవరో ఏమంటున్నారో పట్టించుకోవద్దు మన పని మనం చేసుకోవాలి.
- సంగీత, గృహిణి