మహిళలపై గృహహింస దాడులే అధికం
రసాయన ప్రమాదాలకు గురైన మహిళలకు ఉచితంగా సర్జరీ చేయాలి
బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ అండ్రూ మెక్ అలిస్టర్
సాక్షి, హైదరాబాద్: రసాయన దాడికి గురైన ప్రతి బాధితురాలికి న్యాయం జరగాలని బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ అండ్రూ మెక్ అలిస్టర్ పేర్కొన్నారు. ప్రస్తుతం జరుగుతున్న రసాయన ప్రమాదాల్లో వేధింపులు, గృహహింసకు సంబంధించిన వే ఎక్కువని అభిప్రాయపడ్డారు. ఇలాంటి ప్రమాదాలకు గురైన మహిళలను ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు ప్రత్యేక కేటగిరీగా పరిగణించి ఉచితంగా సర్జరీలు చేయాలని కోరారు. నేర నివారణ, బాధితుల సంరక్షణపై చెన్నై కేంద్రంగా కొనసాగుతున్న పీసీవీసీ సంస్థ ఆధ్వర్యంలో బుధవారం ఇక్కడ జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు.
యాసిడ్ దాడులు, కిరోసిన్, గ్యాస్ పేలుళ్లకు గురైన మహిళలను సంరక్షించేందుకు పనిచేస్తున్న సంస్థలకు బ్రిటిష్ కమిషన్ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందన్నారు. ఇలాంటి ప్రమాదాల విషయంలో తక్షణ సమాచారంతో పాటు మరణ వాంగ్మూలం కీలకమని, వీటి ఆధారంగా బాధితులకు న్యాయం జరిగేందుకు కృషి చేయొచ్చన్నారు. న్యాయ సేవల విభాగం ఆస్పత్రులతో సమన్వయం చేసుకుని బాధిత కుటుంబానికి పరిహారం అందేలా చూడాలన్నారు. అనంతరం పీసీవీసీ సీఈఓ ప్రసన్న మాట్లాడుతూ రసాయన దాడులు, అగ్ని ప్రమాదాల బారిన పడ్డ మహిళలు మానసికంగా తీవ్ర ఆందోళనకు గురవుతారని, వారికి ఓదార్పు అవసరమన్నారు. ఇందులో భాగంగా తమ సంస్థ పనిచేస్తుందని.. చైన్నైలో దాదాపు 150 మందిని చేరదీసి ఆశ్రయం కల్పిస్తున్నట్లు చెప్పారు.