అన్నీ విశేషాలే!
ఒక సినిమా వెంటనే మరో సినిమాతో, పవర్ఫుల్ పాత్ర పోషణతో జోరు మీదున్న హీరో బాలకృష్ణ. ఆయన మునుపటి చిత్రం ‘లెజండ్’ ఇవాళ్టితో 350 రోజులు పూర్తిచేసుకొని, పొద్దుటూరు, ఎమ్మిగనూరు కేంద్రాల్లో రోజూ 4 ఆటలతో స్వర్ణోత్సవం జరుపుకొంటోంది. ‘ప్రదర్శనరంగంలో డిజిటల్ విధానం వచ్చాక ఇన్ని రోజులు ఒక చిత్రం ప్రదర్శితమవడం దేశంలో ఇదే తొలిసారి’ అని అభిమానులు ఉత్సాహంగా చెబుతున్నారు. అభిమానుల ఉత్సాహాన్ని పెంచుతూ బాలకృష్ణ తదుపరి చిత్రం ‘లయన్’ ఇప్పుడు సిద్ధమవుతోంది. శక్తిమంతమైన సి.బి.ఐ అధికారిగా ఆయన ఈ తాజా చిత్రంలో నటిస్తున్నారు.
జవ్వాజి రామాంజనేయులు సమర్పణలో సత్యదేవా దర్శకత్వంలో రుద్రపాటి రమణారావు నిర్మిస్తున్న ఈ చిత్రం ప్యాచ్‌వర్క్ మినహా ప్రధాన షూటింగ్ మొత్తం మంగళవారంతో పూర్తయిపోయింది. ‘‘హీరో బాలకృష్ణ సరసన కథానాయికలు త్రిష, రాధికా ఆప్టే, బృందం నర్తించగా, ప్రేమ్క్ష్రిత్ నృత్య సారథ్యంలో హైదరాబాద్‌లోని అన్నపూర్ణా స్టూడియోలో వేసిన సెట్స్‌లో అయిదురోజుల పాటు పాట తీశాం. ‘లయన్’ అంటూ వచ్చే ఈ టైటిల్ సాంగ్‌ను రామజోగయ్యశాస్త్రి రాశారు. ఈ పాటతో సినిమా ప్రధాన చిత్రీకరణ మొత్తం పూర్తయిపోయింది. మిగిలిన కొద్దిపాటి ప్యాచ్‌వర్క్‌ను రెండు, మూడు రోజుల్లో పూర్తి చేయనున్నాం’’ అని నిర్మాత ‘సాక్షి’కి వివరించారు. విశేషం ఏమిటంటే, ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లండగా, మరో కథానాయిక అర్చన ఒక ప్రత్యేక గీతంలో కనువిందు చేయనుండడం.
‘‘సందర్భోచితంగా వచ్చే ప్రత్యేక నృత్య గీతం అది’’ అని అర్చన చెప్పారు. ఆ ప్రత్యేక గీతంలో మరో యువ హీరో శివబాలాజీ సైతం నర్తిస్తుండడం విశేషం. ‘‘ఇలా అనేక విశేషాలున్న సినిమా ‘లయన్’. ఇది బాలకృష్ణకు బాగా నచ్చిన కథ. ఉత్కంఠగా సాగే కథ, రెండు భిన్నమైన కోణాలుండే కథానాయకపాత్ర - మాస్‌నూ, క్లాస్‌నూ ఆకట్టుకొంటాయి. కథానాయిక త్రిష కూడా మునుపటి పాత్రలకు భిన్నంగా అల్లరిగా ఉండే అందమైన పాత్రను ధరిస్తోంది’’ అని దర్శకుడు సత్యదేవా తెలిపారు. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలోని పాటలను ఏప్రిల్ ప్రథమార్ధంలో విడుదల చేస్తున్నట్లు కార్యనిర్వాహక నిర్మాత కొమ్మినేని వెంకటేశ్వరరావు పేర్కొన్నారు.