అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలి
- పార్టీలకతీతంగా సమస్యలపై స్పందించాలి
- శాసనసభ జీవోల అమలు కమిటీ చైర్మన్ సూర్యారావు
యూనివర్సిటీక్యాంపస్: ప్రజా సమస్యలను పరిష్కరించే దిశగా అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని శాసనసభ జీవోల అమలు కమిటీ చైర్మన్ జి.సూర్యారావు అన్నారు. గురువారం తిరుపతి పద్మావతీ అతిథిగృహంలో జిల్లా కలెక్టర్, ఇతర శాఖాధికారులతో కమిటీ సమీక్ష నిర్వహించింది. 2012 నుంచి సాధారణ పరిపాలన శాఖ ఆధ్వర్యంలో వెలువడిన 348 జీవోల అమలుపై సమీక్షించింది. ఈ సమావేశంలో కమిటీ సభ్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, జె.నెహ్రూ, కె.రామకృష్ణయ్య పాల్గొన్నారు. కమిటీ చైర్మన్ మాట్లాడుతూ అభివృద్ధి పనుల వివరాలను ప్రజాప్రతినిధులకు తెలియజేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు.
ప్రొటోకాల్ తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. పార్టీలకతీతంగా సమస్యలపై ప్రజాప్రతినిధులు ఇచ్చిన వినతులను 15 రోజుల్లోపు పరిష్కరించాలన్నారు. జీవోలను చిత్తశుద్ధితో అమలు చేయించడమే కమిటీ లక్ష్యమని తెలిపారు. కలెక్టర్ సిద్ధార్థజైన్ మాట్లాడుతూ త్వరలో మండల స్థాయి అధికారులకు కూడా ప్రొటోకాల్ అమలుపై అవగాహన కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రజా సమస్యలపై ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎంపీటీసీ సభ్యులు ఇచ్చిన సమస్యల సిఫారసు లేఖల అమలుపై అధికారులకు సూచనలు చేస్తామన్నారు. అలాగే ఎయిర్పోర్ట్, సీఐఎస్ఎఫ్, పోలీస్ అధికారులతో కూడా ప్రొటోకాల్ అంశాలపై సమీక్షిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు జాయింట్ కలెక్టర్ వెంకటసుబ్బారెడ్డి, డీఆర్వో విజయాచంద్, జెడ్పీ సీఈవో వేణుగోపాల్‌రెడ్డి, డీ పీవో ప్రభాకర్‌రెడ్డి, డీపీవో ప్రభాకర్‌రావు, డీఎంహెచ్ కోటీశ్వరి, బీసీ కార్పొరేషన్ ఈడీ రామచంద్రరాజు, చిత్తూరు, తిరుపతి ఆర్డీవోలు పెంచలకిషోర్, వీరబ్రహ్మం తదితరులు పాల్గొన్నారు.