బీసీలపై పక్షపాత వైఖరి విడనాడాలి
- చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలి
- 6,7 తేదీల్లో పార్లమెంట్‌ను ముట్టడిస్తాం..
- బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య
మోమిన్‌పేట : చట్ట సభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. మండల పరిధిలోని రాళ్లగుడుపల్లి గ్రామంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. దేశంలో బీసీలు 70శాతం ఉన్నా చట్ట సభల్లో మాత్రం రిజర్వేషన్లు కల్పించకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్యాయం చేస్తున్నాయన్నారు. చట్ట సభల్లో 50శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ పార్లమెంట్లో బిల్లు పెట్టాలని డిమాండ్ చేశారు.
ఎంతోమంది ప్రధానులు, ముఖ్యమంత్రులు అయినా ఇప్పటి వరకు బీసీలకు ఒక్కసారి కూడా అవకాశం కల్పించలేదని ఆందోళన వ్యక్తం చేశారు. బీసీలకు తగు స్థానం కల్పిస్తున్నామని అన్నిపార్టీలు పేర్కొంటున్నా వాస్తవానికి ఎక్కడా అలా జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేటు, ప్రభుత్వ రంగాల్లో బీసీలకు తగు న్యాయం కల్పించాలని ఆయన కోరారు. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పిస్తేనే తగిన న్యాయం కల్పించినవారవుతారని పేర్కొన్నారు. చట్ట సభల్లో రిజర్వేషన్లు కల్పించాలని ఈ నెల 6,7 తేదీల్లో పార్లమెంట్‌ను ముట్టడిస్తున్నట్లు తెలిపారు. బీసీల సత్తా ఏమిటో ఈ ముట్టడితో నిరూపిస్తామన్నారు. సమావేశంలో నాయకులు లక్ష్మయ్య, రమేష్ తదితరులు పాల్గొన్నారు.