పిల్లలతో కాళ్లు నొక్కించుకున్న టీచర్ సస్పెన్షన్
ఆమె ఓ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయిని. అక్కడున్న మూగ, చెవిటి పిల్లలతో కాళ్లు నొక్కించుకుంటున్నందుకు ఆమెను సస్పెండ్ చేశారు. ఈ సంఘటన మహారాష్ట్రలోని అకోలాలో జరిగింది. శీతల్ అవచార్ అనే ఈ ఉపాధ్యాయిని మూగ, చెవిటి విద్యార్థుల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా నడుపుతున్న పాఠశాలలో పనిచేస్తున్నారు. ఈమె కాళ్లు నొక్కించుకోవడమే కాదు.. పాఠశాల నడిచే సమయంలో నిద్రపోవడం, విద్యార్థులను వేధించడం లాంటి పనులు కూడా చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
దీన్నంతటినీ ఓ విద్యార్థి వీడియో తీసి, వాటిని స్కూలు అధికారులకు పంపడంతో మొత్తం వ్యవహారమంతా వెలుగులోకి వచ్చింది. వెంటనే జడ్పీ సీఈవో అరుణ్ ఉన్హాలే ఆమెపై విచారణ జరిపించగా, ఆరోపణలన్నీ నిజమేనని తేలింది. దాంతో ఆమెను సస్పెండ్ చేశారు. ఆమెను వెంటనే ఉద్యోగం నుంచి తొలగించాలని మానవహక్కుల సంఘాల వారు డిమాండ్ చేశారు. టీచర్‌పై ఫిర్యాదు చేసినందుకు తమను కొట్టారని విద్యార్థులు విలేకరులకు చెప్పారు.