ఆగిన మరో గుండె
=అవిరిపూడిలో కౌలు రైతు మృతి
=కౌలుకు చేస్తున్న పదెకరాలూ నీటిపాలు
=ఆశలను చిదిమేసిన వరుస విపత్తులు
జిల్లాలో రైతుల మరణమృదంగం ఆగటం లేదు. అందరికీ అన్నం పెట్టే రైతన్న ఇంట్లో చావుడప్పు మోగుతూనే ఉంది. వరుస తుపానులతో తల్లడిల్లిన అవిరిపూడి కౌలు రైతు లెహర్ దెబ్బకు తట్టుకోలేకపోయాడు. టీవీలో తుపాను వార్తలే చూస్తూ గుండె ఆగి మృతిచెందాడు.
కూచిపూడి, న్యూస్‌లైన్ : వరుస తుపాను దెబ్బలకు మరో కౌలు రైతు గుండె ఆగింది. కౌలుకు తీసుకున్న పొలంలో పైరు తుపాను బీభత్సానికి నేలవాలటాన్ని చూసిన ఆ రైతు తట్టుకోలేకపోయాడు. కౌలు చెల్లించే స్తోమతలేక, చేతికొచ్చిన పంట తుపాను పాలై, చేసిన అప్పులు తీరే దారి కానరాక మనోస్థైర్యం కోల్పోయాడు. ఇంటివద్ద తుపాను వార్తలు చూస్తూనే కుప్పకూలిపోయాడు. మొవ్వ మండలం అవిరిపూడిలో జరిగిన ఈ ఘటన అతని కుటుంబంలో తీరని విషాదం నింపింది. గ్రామ కౌలు రైతు మేడిశెట్టి రాంబాబు (55) పదెకరాలు కౌలుకు చేస్తున్నాడు.
వేలాది రూపాయలు అప్పుచేసి పెట్టుబడి పెట్టాడు. పైర్లు సంతృప్తికరంగా ఉండటంతో ఈ ఏడాదితో పాత అప్పులు కూడా తీరిపోతాయని సంబరపడ్డాడు. ఈలోగా వచ్చిన వరుస విపత్తులు అతని ఆశలను అడియాసలు చేశాయి. గత రెండు తుపానుల దెబ్బకే మనోధైర్యం కోల్పోయిన రాంబాబు రోజూ మాదిరిగానే గురువారం సాయంత్రం కూడా పొలంవెళ్లి తన చేలో పైరును చూశాడు. లెహర్ ప్రభావం వల్ల కురిసిన వర్షాలకు పైరంతా చాపచుట్టలా కిందపడి నీటమునిగి ఉండటాన్ని చూసి తట్టుకోలేకపోయాడు.
అదే బాధతో ఇంటికొచ్చి టీవీలో తుపాను వార్తలు చూస్తూ గుండె ఆగి మృతిచెందాడు. ఆయనకు భార్య రామతులశమ్మ, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇంటివద్ద కుటుంబసభ్యులతో, గ్రామస్తులతో వాతావరణం, పంటలు, అప్పుల గురించి తరచూ చర్చిస్తుండేవాడని స్థానికులు తెలిపారు. రెండు మూడేళ్లుగా ఇదే పరిస్థితి ఉందని, ఇలాగైతే అప్పులెలా తీరుతాయోనని బాధపడేవాడని సర్పంచ్ ఏనుగు మోహనరావు శుక్రవారం విలేకరులకు తెలిపారు. రాంబాబు భౌతికకాయాన్ని శుక్రవారం పామర్రు ఎమ్మెల్యే డీవై దాస్ సందర్శించి నివాళి అర్పించారు. ప్రభుత్వం నుంచి వచ్చే సహాయాలు అందేలా కృషిచేస్తానని హామీ ఇచ్చారు.