ప్రపంచంలోనే అరుదైన దొంగతనం
లాస్‌వెగాస్: కుడి చేతికి కూడా తెలియకుండా ఎడమచేత్తో దొంగతనాలు చేస్తూ చోరకళకు గుర్తింపుతెచ్చేవారు కొందరైతే, కళను అపహాస్యం చేస్తూ వార్తల్లో నిలిచేవాళ్లు మరికొందరు! ఈ ఫొటోలో కనిపిస్తున్నవాడు రెండో రకం.
తన బృందంతోకలిసి ఓ గోడౌన్‌లోకి చొరబడ్డ వీడు.. ఏకంగా 30 వేల కండోమ్స్, వందలకొద్దీ సెక్స్ టాయ్స్‌ని ఎత్తుకెళ్లాడు. రెండు రోజుల పాటు వీరి దోపిడీపర్వం కొనసాగింది. అభివృద్ధి చెందిన అమెరికాలో కండోమ్స్ విరివిగా దొరుకుతున్నా, వీళ్లిలా దొంగతనం చేయడంపై సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. ఒకేసారి ఇంత పెద్ద సంఖ్యలో కండోమ్స్ దొంగతనానికి గురికావడం ప్రపంచంలో ఇదే మొదటిసారి!
లెలో అనే స్విడిష్ సెక్స్ టాయ్స్ కంపెనీకి లాస్‌వెగాస్‌లో ఓ గోడౌన్ ఉంది. అక్కడ నిలువుచేసే కండోమ్స్, సెక్స్‌టాయ్స్ లాంటి ఉత్పత్తులను రకరకాల ప్రాంతాలకు రవాణాచేస్తుంటారు. మెమోరియల్ డే సెలవుల సందర్భంగా వారంపాటు గోడౌన్ తెరవలేదు. దీనిని అవకాశంగా భావించిన దొంగలు.. సోమ, మంగళ వేర్‌హౌస్‌లోని 30 వేల కండోమ్స్, సెక్స్టాయ్లను దొంగిలించారు. సెక్యూరిటీ లేకపోవడంతో ఏకంగా కారునే లోపలికి తెచ్చి వస్తువులను దోచుకెళ్లారు.
తమ గోడౌన్లో దొంగతనం జరిగిన విషయాన్ని లెలో సంస్థ తన అఫీషియల్ ఫేస్బుక్ ద్వారా వెల్లడించింది. దానికి సంబంధించిన వీడియో ఫుటేజీని కూడా పోస్ట్ చేసింది. ‘అన్ని కండోమ్స్‌ను వాళ్లు ఏం చేసుకుంటారో ఎంత ఆలోచించినా అర్థం కావట్లేదు. అది తెలిస్తేగనుక ఆ పార్టీకి స్పాన్సరర్స్‌గా ఉండేవాళ్లం..’అని చమత్కరించారు లెలో ప్రతినిధులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.