ఐఫోన్ కన్నా ఈ ఫోన్ కాస్ట్లీ గురూ!
న్యూఢిల్లీ: చైనా మొబైల్ హ్యాండ్సెట్ మేకర్ ఎల్ఈటీవీ తాజాగా భారత్ స్మార్ట్ఫోన్ విపణిలోకి అడుగుపెట్టింది. లెకో (LeEco)గా ఇటీవల పేరు మార్చుకున్న ఈ కంపెనీ విభిన్న రకాల స్మార్ట్ఫోన్లను భారత్ మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఆ కంపెనీ ప్రధాన మోడల్ అయిన 'లె మాక్స్ షప్పైర్' ధర అక్షరాల రూ. 69.999. అంటే ఈ మొబైల్ ఐఫోన్ 6ఎస్ కంటే ఖరీదైనది కావడం గమనార్హం. ప్రస్తుతం ఐఫోన్ 6 ఎస్ రూ. 62 వేల నుంచి లభిస్తున్నాయి. భారత్లో మొదటి విడతగా లెకో కంపెనీ ఈ మోడల్ వెయ్యి యూనిట్లను మాత్రమే అమ్మనుంది.
దీంతోపాటు లెకో కంపెనీ 64 జీబీ, 128 జీబీలతో కూడిన లె మాక్స్ స్టాండర్డ్ మోడళ్లను భారత్లో అమ్మనుంది. వీటి ధర వరుసగా రూ. 32,999, రూ. 36,999గా ఉండనున్నాయి. ఫిబ్రవరి 16 నుంచి ఫ్లిప్కార్ట్ వెబ్సైట్లో ఈ మొబైళ్లు లభిస్తాయి. ఆండ్రాయిడ్ 5.1 లాలిపాప్ వెర్షన్తో లే మాక్స్ స్మార్ట్ ఫోన్ లభిస్తుంది. ఇందులో 6.33 అంగుళాల క్వాడ్ HD ( 2,560x1,440p) డిస్ప్లేతోపాటు, 2GHz ఆక్టా కోర్ స్నాప్డ్రాగెన్ 810 చిప్సెట్ శక్తి ఉంటుంది. ఇందులో 4GB RAM ఉంటుంది. బ్యాటరీ బ్యాకప్ 3,400mAhగా ఉంటుంది. సోనీ IMX230 సెన్సార్ తో కూడిన 21MP బ్యాక్ కెమెరాతోపాటు అనేక ఫీచర్స్ తో కూడిన 4MP ఫ్రంట్ కెమెరా ఈ మొబైల్లో ఉంటాయి. కనెక్టివిటీ కోసం 4G, 3G, Wi -Fi , బ్లూటూత్ వంటి అనేక ఫీచర్లు ఇందులో ఉన్నాయి.