లెండి పూర్తికి ‘మహా’ సహకారం
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ, మహారాష్ట్రల మధ్య చేపట్టిన లెండి అంతర్రాష్ట్ర ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసేందుకు సంఫూర్ణ సహకారం అందిస్తామని మహారాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. 2017 నాటికి ప్రాజెక్టు తొలి దశ పూర్తిచేసి, 2018 చివరి నాటికి రైతులకు పూర్తి స్థాయిలో సాగునీరందించేందుకు తోడ్పాటునిస్తామని స్పష్టం చేసింది. శుక్రవారం ఎర్రమంజిల్‌లోని జలసౌధ కార్యాలయంలో లెండి ప్రాజెక్టుపై ఇరు రాష్ట్రాల అధికారులతో ఏర్పాటు చేసిన సమన్వయకమిటీ తొలిసారి భేటీ అయింది. సుదీర్ఘంగా సాగిన ఈ సమావేశంలో మహారాష్ట్ర సీఈ బి.డి.తొంబే, తెలంగాణ సీఈ మధుసూదన్‌రావు సహా ఇరు రాష్ట్రాల అధికారులు పాల్గొన్నారు. ఏళ్ల తరబడి సాగుతున్న లెండి పనులకు ఆటంకంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ అధికారులు మహారాష్ట్రని కోరారు.
భూసేకరణ, ఆర్అండ్ఆర్ పనుల్లో ఆలస్యం కారణంగా పనుల్లో జాప్యం జరుగుతోందని, 2017 నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేసేలా సహకరించాలని రాష్ర్ట అధికారులు కోరారు. ఇదే సమయంలో నిజామాబాద్ పర్యటనలో ఉన్న భారీ నీటిపారుదల మంత్రి హరీశ్‌రావు అక్కడినుంచే ఫోన్లో మహారాష్ట్ర సీఈతో మాట్లాడారు. ప్రాజెక్టు పనులకు ఇప్పటికే రూ.183.73 కోట్లను మహారాష్ట్రకు చెల్లించిన విషయాన్ని గుర్తుచేశారు. ప్రాజెక్టు వ్యయం, ఇతర అం శాల్లో సహకారం అందించేందుకు తెలంగాణ సిద్ధంగా ఉందని, 2017 జూన్ నాటికి అన్ని సమస్యలు అధిగమించి ప్రాజెక్టును పూర్తి చెయ్యాలని కోరారు. దీనికి మహారాష్ట్ర అధికారుల నుంచి సానుకూలత వ్యక్తమైంది. 2017 జూన్ నాటికి ఆర్అండ్ఆర్, భూసేకరణ ప్రక్రియను పూర్తి చేస్తామని, 2018 జూన్ నాటికి రిజర్వాయర్ క్రస్ట్ గేట్ల వరకు నీటిని నిల్వ చేసేలా చూస్తామని మహారాష్ట్ర అధికారులు హామీ ఇచ్చారు. దాంతోపాటే 2018 చివరి నాటికి ప్రాజెక్టును పూర్తి చేసి నిర్ణీత ఆయకట్టుకు నీరందిస్తామని చెప్పారు.