‘ఇందూ’ శ్యాంప్రసాద్‌రెడ్డికి హైకోర్టులో ఊరట
► వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు
► హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
సాక్షి, హైదరాబాద్: జగన్ కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారంలో సీబీఐ నమోదు చేసిన కేసుల్లో నిందితునిగా ఉన్న ‘ఇందూ’ శ్యాంప్రసాద్‌రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. లేపాక్షి నాలెడ్జ్ పార్క్, ఇందూ టెక్ జోన్, ఇందూ-హౌసింగ్ బోర్డు చేపట్టిన ప్రాజెక్టులకు సంబంధించి సీబీఐ ప్రత్యేక న్యాయస్థానాల్లో జరుగుతున్న కేసుల విచారణకు వ్యక్తిగత హాజరు నుంచి ఆయనకు హైకోర్టు మినహాయింపునిచ్చింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ రాజా ఇలంగో బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి ఉత్తర్వులు జారీ చేసేంతవరకు ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని స్పష్టం చేశారు.
లేపాక్షి, ఇందూ టెక్ జోన్, హౌసింగ్ ప్రాజెక్టులకు సంబంధించి సీబీఐ మూడు వేర్వేరు కేసులు నమోదు చేసింది. ఈ మూడింటిలోనూ శ్యాంప్రసాద్‌రెడ్డి నిందితులుగా ఉన్నారు. ఈ కేసులపై సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం విచారణ జరుపుతోంది. ఇందులో భాగంగా ప్రతీ శుక్రవారం కోర్టు ముందు విచారణకు ఆయన హాజరు కావాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ ఆయన హైకోర్టులో పిటిషన్లు వేశారు.
వీటిని న్యాయమూర్తి జస్టిస్ రాజా ఇలంగో విచారించారు. పిటిషనర్ తరఫు న్యాయవాది కె.శ్రీనివాసరెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఇందూగ్రూప్ చైర్మన్, ఎండీ హోదాలో శ్యాంప్రసాద్‌రెడ్డి విదేశాలకు వెళ్లాల్సి వస్తోందని, దీనివల్ల ప్రతీ శుక్రవారం కోర్టు విచారణకు హాజరు కావడం కష్టసాధ్యంగా ఉందన్నారు. విదేశాల్లో జరిగే సమావేశాల నుంచి అర్ధంతరంగా రావాల్సి వస్తోందన్నారు. దీనిపై స్పందించేందుకు సీబీఐ న్యాయవాది కేశవరావు గడువు కోరారు. దీంతో వ్యక్తిగత హాజరు నుంచి శ్యాంప్రసాద్‌రెడ్డికి మినహాయింపునిస్తూ న్యాయమూర్తి మధ్యంతర ఉత్తర్వులిచ్చారు.