మేమూ మనుషులమే
ఎల్జీబీటీల ప్రధాన డిమాండ్లు..
లైంగికంగా వెనక బడిన వర్గాల కింద పరిగణించాలి.
మనిషిగా గుర్తింపు ఇవ్వాలి.
గుర్తింపు కార్డులివ్వాలి.
విద్య, వైద్యం, గృహ సౌకర్యాలు కల్పించాలి.
రాజకీయాలలో రిజర్వేషన్ ఇవ్వాలి.
గచ్చిబౌలి, న్యూస్‌లైన్: పురాతన కాలంలో సమ లైంగికుల పట్ల ఆదరణ చూపే వారని, ఆధునిక సమాజంలో అవహేళన చేస్తున్నారని శుభోదయ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు విద్య పేర్కొన్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ హైటెక్‌సిటీ రైల్యే స్టేషన్ నుంచి శిల్పారామం వరకు సురక్ష సంస్థ ఆధ్వర్యంలో ‘హైదరాబాద్ క్యూర్ ప్రైడ్’ పేరిట ఎల్జీబీటీ(లెస్బియన్స్, గే, బై సెక్సువల్స్ అండ్ ట్రాన్స్‌జెండర్)లు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని సినీనటి మంచు లక్ష్మి ప్రారంభించారు.
ఈ సందర్భంగా నల్సార్ యూనివర్సిటీకి చెందిన న్యాయవాది గిరిష్మ మాట్లాడుతూ ఆర్టికల్ 377ను సమర్ధిస్తూ సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వడంతో ఎల్జీబీటీలు ఆందోళనకు గురవుతున్నారన్నారు. వారిది ప్రకృతి విరుద్ధమైన చర్యలు కావని సహజత్వం ద్వారానే అలా ఉన్నారని తెలిపారు. అవగాహన స్వచ్ఛంద సంస్థ ప్రాజెక్ట్ మేనేజర్ చంద్రముఖి మాట్లాడుతూ తామూ దేవుడు చేసిన మనుషులమేనని చెప్పారు. అనంతరం సమ లైంగికులు సమాజంలో ఎదుర్కొంటున్న సమస్యలను తెలియజేసే సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు.
మా సమస్యలపై హామీ ఇస్తేనే ఓటు వేస్తాం..
రాష్ట్ర వ్యాప్తంగా ఐదు లక్షల మంది ఉన్నాం. అందరికీ ఓటు హక్కు ఉంది. ఎల్జీబీటీల సమస్యలను మ్యూనిఫెస్టోలో పెట్టిన పార్టీకే ఓటు వేస్తాం.
- కృష్ణ, సురక్ష వ్యవస్థాపకులు
మమ్మల్ని ఆదరించండి..
సమలైంగికులంతా ఒక వేదికపై కలుస్తున్నాం. సమాజం మాపట్ల చూపుతున్న వివక్ష మాటలతో చెప్పలేం. మమ్మల్ని ఆదరించండి.
- నవ్‌దీప్
సమాజం గుర్తించాలి..
సుప్రీంకోర్టు తీర్పు బాధకల్గిస్తోంది. అందరి మాదిరిగానే మాకు ప్రాథమిక హక్కులు కల్పించాలి.
- షేన్, కాల్ సెంటర్ ఉద్యోగి
ఆధార్‌కార్డు కూడా ఇవ్వడం లేదు..
రోడ్లపై నడుచుకుంటే వెళితే అవహేళన చేస్తారు. అన్నీ భరిస్తున్నాం. కనీసం ఆధార్ కార్డు కూడ ఇవ్వడం లేదు. మాలో చాలా మంది చదువుకున్న వాళ్లున్నారు. రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలి.
- శిరీష