రోడ్డు పనులు అడ్డుకుంటే చెట్టుకు కట్టేస్తాం..
ఆర్డీవో, తహశీల్దార్‌ను నిర్బంధించే యత్నం
రోడ్డు పనుల పరిశీలనకు వెళ్లిన అధికారులకు భంగపాటు
నాతవరం : అటవీ ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న కొండలను తవ్వి అనధికారికంగా రోడ్డు పనులు చేపడుతున్న వైనంపై పరిశీలనకు వెళ్లిన అధికారులకు అక్కడి గిరి మహిళల నుంచి అనుకోని విధంగా ప్రతిఘటన ఎదురైంది. వివరాలివి. మండలంలో సరుగుడు గ్రామం నుంచి అసనగిరి, సుందరకోటతోపాటు కొండల మీద ఉన్న కొన్ని గ్రామాలకు ప్రైవేటు వ్యక్తులు మట్టి రోడ్డు పనులు చేస్తున్నారు.
నిబంధనలు ఉల్లంఘించి అనుమతులు లేకుండా అటవీ ప్రాంతంలో కొండలను తవ్వి రోడ్డు వేస్తుండడంతో కొందరు ఆర్డీవోకు సమాచారం ఇచ్చారు. దీంతో ఆర్డీవో కె.సూర్యారావు, తహశీల్దార్ వి.వి.రమణ, ఏపీవో గాడి నానిబాబు పరిశీలనకు వెళ్లారు. సరుగుడు నుంచి కొంత దూరం బైక్‌పై వెళ్లి ఆ తరువాత కొండలపై కాలి నడకన వెళ్లారు.
సుందరకోట సమీపంలోకి వెళ్లగా కొండల్లో పోడు వ్యవసాయం చేస్తున్న కొందరు గిరిజన మహిళలు వీరిని చూసి పరుగున వచ్చి అడ్డగించారు. ఏళ్ల తరబడి తమ గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించాలని నాయకులకు, అధికారులకు విన్నవించినా కనీ సం పట్టించుకోలేదని, ఇపు డు రోడ్డు పనులను అడ్డుకుంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
ఈ రోడ్డు లేటరైట్ తవ్వకం దారులు వేస్తున్నారన్న ఆరోపణలను అధికారులు వారి వద్ద ప్రస్తావించగా కాదు...మేమే స్వయంగా రోడ్డు వేసుకుంటున్నామంటూ మహిళలు దబాయించే ప్రయత్నం చేశారు. వారి తీరుకు ఆర్డీవో హతాశులయ్యారు. మహిళలు అధికారుల చేతులు పట్టుకుని లాక్కెళ్లి నిర్బంధించే ప్రయత్నం చేశారు. ఇంతలో అక్కడకు చేరుకున్న సరుగుడు మాజీ సర్పంచ్ పట్టెం రాజబాబు వారిని అడ్డుకుని సర్ధిచెప్పారు. కార్యక్రమంలో సర్వేయర్ గిరి ప్రసాద్, వీర్వో శ్రీకాంత్ పాల్గొన్నారు.
లేట్రైట్ నిక్షేపాలపై కన్ను..?
సరుగుడు పంచాయతీలో కొండమీద ఆరు గ్రామాలున్నాయి. సుందరకోట, అసనగిరి, బమిడికలొద్దు ప్రాంతాల్లో వందలాది ఎకరాల్లో లేట్రైట్ నిక్షేపాలున్నాయి. వీటిని కొందరు పథకం ప్రకారం దక్కించుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. రాజకీయ అండతో లేట్రైట్ తవ్వకాలకు అనుమతులు వస్తాయన్న ధీమాతో ముందుగానే కొందరు పథకం ప్రకారం నిబంధనలు ఉల్లంఘించి రోడ్డు పనులు చేస్తున్నారు. కొండమీద ఉన్న గిరిజన గ్రామాల వారిని లోబరుచుకున్నారు.
లేట్రైట్ విషయంపై అవగాహన లేని గిరిజనులు రోడ్డు వస్తుందన్న ఆశతో వారికి మద్దతు పలుకుతున్నారు. ఇప్పటికే సుమారు రెండు కిలోమీటర్లకు పైగా మట్టి పనులు పూర్తి చేశారు. యథేచ్ఛగా కొండలు తవ్వేస్తున్నా అధికారులు మిన్నకున్నారు. ఇటీవల నర్సీపట్నం డీఎఫ్‌వో లక్ష్మణ్ కొండపై జరుగుతున్న రోడ్డు పనులు పరిశీలించి ఆ భూములు తమ పరిధిలోవి కావని చెబుతుండగా, గురువారం ఈ రోడ్డును పరిశీలించిన ఆర్డీవో కె.సూర్యారావు కూడా ఈ కొండలో గ్యాప్ ఏరియా ఉందని వాటిని పరిశీలించాకే చర్యలు తీసుకుంటామంటున్నారు.