ప్యారిస్‌లో ఉగ్రదాడి: ఏకే 47తో కాల్పులు
ప్యారిస్: ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ నగరం ఉగ్రదాడితో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాది తుపాకీతో చాంప్స్ ఎలీసెస్ ఏరియాలో కాల్పులకు తెగబడ్డాడు. యుద్ధంలో వినియోగించే ఆయుధంతో దుండగుడు జరిపిన కాల్పుల్లో ఓ పోలీసు మృతిచెందాడు. అనంతరం అప్రమత్తమైన సిబ్బంది జరిపిన కాల్పుల్లో సాయుధుడు హతమయ్యాడని అధికారులు వెల్లడించారు. మరికొందరు వ్యక్తుల హస్తం ఉందని, నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు సమాచారం. సెంట్రల్ ప్యారిస్ అంతా హై అలర్ట్ ప్రకటించారు. అరెస్ట్ వారెంట్ కూడా జారీ చేశారు.
ఈ దాడికి తామే బాధ్యులమని ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్, లేవాంట్ ఉగ్రవాద సంస్థలు ప్రకటించాయి. ఈ ఉగ్రదాడి తమ పనేనని కాల్పులు జరిపిన కొన్ని నిమిషాల్లోనే ఉగ్రసంస్థ పేర్కొంది. అధ్యక్ష ఎన్నికలకు మూడు రోజుల ముందు ప్యారిస్‌లో ఉగ్రవాదులు దాడికి పాల్పడటంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
'నేను చూస్తుండగానే ఓ వ్యక్తి ఏకే 47తో జన సంచారంలోకి వచ్చాడు. ఫ్రెండ్ కోసం నా కారులో ఎదురుచూస్తున్నాను. నల్లని దుస్తువులు ధరించిన వ్యక్తి పోలీసులపై కాల్పులు జరిపి ఓ అధికారిని పొట్టన పెట్టుకున్నాడు' అని సిరిల్ అనే ప్రత్యక్షి సాక్షి చెప్పాడు.