‘డాడీ.. మీరు చనిపోయి రెండేళ్లవుతోంది’
బీజింగ్: చనిపోయిన తమవారిని తలుచుకుంటూ వారికి నివాళిగా స్కైలాంతర్లను ఎగురవేయడం పరిపాటిగా మారింది. చైనాలో లెవిస్ కెర్ అనే విద్యార్థిని చనిపోయిన తన తండ్రికి నివాళిగా ఓ స్కైలాంతర్ను ఎగురవేసింది. అయితే, దానిపై తన తండ్రిపై ఉన్న ప్రేమను చాలా చక్కగా, అద్భుతంగా లేఖ రూపంలో రాసింది.
ఇది దొరికిన వ్యక్తి దానిని చదివి భావోద్వేగానికి లోనై దాదాపు ఏడ్చేశాడు. ఆ తర్వాత తనను అమితంగా లేఖను సోషల్ మీడియాలో పెట్టి ఆ బాలికపై ప్రశంసలు కురిపించగా.. అందుకు ఆ బాలిక కూడా ప్రతిస్పందించింది. తన లేఖ ఎవరికో చిక్కి తిరిగి తనకు ఆ విషయం తెలియడం చాలా ఆశ్చర్యంగా ఉందని, సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకు ధన్యవాదాలని కూడా ఆమె బదులిచ్చింది. ఇంతకీ ఆ లేఖలో ఏముందంటే..
‘ నాన్న,
మీరు చనిపోయి రెండేళ్లవుతుంది. నేనిప్పటికీ మీ చిరునవ్వు గురించి, మీరు ప్రతి రోజు వేసే సిల్లీ జోకుల గురించి ఆలోచిస్తుంటాను. నేను నా నిజమైన స్నేహితుడిని కోల్పోయాను. మిమ్మల్ని చాలా మిస్సయ్యాను. ఈ రెండేళ్లలో నేను సాధించినవాటిని చూసి మీరు గర్వంగా భావిస్తారని అనుకుంటున్నాను. నాకు తెలుసు మీరు ఎక్కడో ఓ చోట ఉండి ఇదంతా గమనిస్తుంటారు. ఓ అమ్మాయికి ఉండాల్సిన నిర్మలమైన మనసుగల తండ్రి మీరు. నేను మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నాను. నా ప్రేమంతా ఎప్పటికి మీకోసమే’ అంటూ ఆ విద్యార్థి స్కైలాంతర్పై రాసింది.