గోపీకృష్ణ విడుదలకుకేంద్రంపై ఒత్తిడి
ఎంపీ రామ్మోహన్నాయుడు
టెక్కలిరూరల్: గత నెల 29న లిబియాలో ఉగ్రవాదుల చేతిలో కిడ్నాప్‌కు గురైన టెక్కలికి చెందిన గోపికృష్ణను సురక్షితంగా విడుదల చేసే విధంగా కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తానని ఎంపీ కె.రామ్మోహన్నాయుడు అన్నారు. ఆదివారం టెక్కలిలో గోపీకృష్ణ తల్లిదండ్రులు వల్లభనారాయణరావు, సరస్వతిలను పరామర్శించి ఓదార్చారు. గోపీకృష్ణ విడుదలపై కొన్ని ఇబ్బందులు తలెత్తాయని..ఢిల్లీ వెళ్లిన వెంటనే దీనిపై కేంద్ర మంత్రి సుస్మా స్వరాజ్‌తో చర్చిస్తానని ఎంపీ చెప్పారు. లిబియాలోని భారత ప్రభుత్వ ప్రతినిధులతో చర్చలు జరిపి గోపీకృష్ణను సురక్షితంగా తీసుకువస్తామని అన్నారు. కాగా... తాము కూడా ఢిల్లీ వస్తామని గోపీకృష్ణ తల్లిదండ్రులు కోరగా, దీనికి ఎంపీ సమాధానం చెప్పలేదు. కనీసం ఫోన్లో మాట్లాడించాలని అభ్యర్థించినప్పటికీ ఎంపీ నుంచి స్పందనలేదు.
ప్రత్యేక హోదాపై పార్లమెంట్లో చర్చిస్తా
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై పార్లమెంట్లో చర్చిస్తానని ఎంపీ చెప్పారు. టెక్కలిలో విలేకర్లతో మాట్లాడారు. మిత్ర పక్షం లో ఉన్నాం కావునా కేంద్రానికి స్నేహ పూర్వకంగా విన్నవించి ప్రత్యేక హోదా తీసుకువస్తామని.. ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని సూచించారు. ప్రత్యేక హోదా లేకుంటే ప్రత్యేక ప్యాకేజీ కోసం కేంద్రంతో చర్చలు జరుపుతానని స్పష్టం చేశారు.