రిస్కు తీసుకున్నా.. తీసుకోకున్నా..!
♦ ఎన్‌పీఎస్‌లో పెట్టుబడులు బెటరే!!
♦ అందరికన్నా అగ్రెసివ్ ఇన్వెస్టర్లకే కాస్త అధిక లాభం
♦ అల్ట్రా సేఫ్ ఇన్వెస్టర్లకు కూడా 10–12 శాతం రాబడి
♦ ఈక్విటీ మార్కెట్ల ర్యాలీతో కొన్ని వర్గాలకు అధిక లాభం
♦ వీటన్నిటికీ అదనంగా పన్ను మినహాయింపు కూడా
♦ రెండేళ్లుగా ఎన్‌పీఎస్‌లో పెరుగుతున్న చందాదారులు
♦ బాండ్ ఫండ్స్ నిర్వహణలో ఎల్ఐసీ పెన్షన్ ఫండ్ టాప్
ప్రస్తుతం ఉద్యోగుల్లో ప్రైవేటు రంగం వారే ఎక్కువ. స్వయం ఉపాధిపై ఆధారపడ్డవారూ అధికమే. ప్రభుత్వ ఉద్యోగుల్లా వీరికి పదవీ విరమణ తరవాత పింఛను లాంటి సౌకర్యాలేవీ ఉండవు. పీఎఫ్ నుంచి పింఛను వచ్చినా... అది మనకయ్యే ఖర్చుల్లో కనీసం 10 శాతానికి కూడా సరిపోదు. మరేం చెయ్యాలి? పదవీ విరమణ తరవాత జీవనం ఆటుపోట్లకు గురికాకుండా నిలకడగా, నిశ్చింతగా కొనసాగాలంటే ఆర్థికపరమైన ఏర్పాట్లు ఎలా ఉండాలి? ఇందుకు సమాధానమే మార్కెట్లో లభిస్తున్న పింఛను పథకాలు. వాటిలో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని పింఛను నిధి నియంత్రణ, ప్రాధికార సంస్థ (పీఎఫ్ఆర్డీఏ) నిర్వహిస్తున్న ఎన్పీఎస్ ఒకటి. కొన్నాళ్ల కిందట విధుల్లో చేరిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఈ పింఛను పథకం కిందే కొనసాగుతున్నారు. దీన్లో ప్రైవేటు వ్యక్తులు కూడా పెట్టుబడి పెట్టొచ్చు. నిజానికి దీన్లో పెట్టుబడి పెట్టాలనుకునే వారికి పలు ఆప్షన్లున్నాయి. ఈక్విటీ, డెట్ ఫండ్స్ కలబోతగా ఉన్న వివిధ విభాగాలు, వాటిలో రాబడుల గురించి తెలియజేసేదే ఈ కథనం.
ఎన్పీఎస్ పథకాన్ని తొలుత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసమే తీసుకొచ్చారు. ఎనిమిదేళ్ల కిందట ఇతరులను కూడా ఈ పథకంలో పెట్టుబడి చేయటానికి అనుమతిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కానీ, పెద్దగా ఆదరణ పొందింది లేదు. గత రెండేళ్లుగా మాత్రం దీని పట్ల క్రమంగా ఆదరణ కనిపిస్తోంది. ఎందుకంటే? ఎన్‌పీఎస్‌లో స్వచ్ఛందంగా చేరిన 4.39 లక్షల చందాదారుల్లో 80 శాతం మంది గత రెండేళ్లలో వచ్చిన వారే. 5.85 లక్షల కార్పొరేట్ చందాదారుల్లోనూ 75 శాతం మంది గత నాలుగేళ్లలో దీన్లో సభ్యులైన వారే. ఈ పథకం కింద లభిస్తున్న పన్ను ప్రోత్సాహకాలు వీరిని ఆకర్షించాయనడంలో సందేహం అక్కర్లేదు.
రూ.50 వేల వరకూ పన్ను లేదు
ఎన్‌పీఎస్‌లో పెట్టే పెట్టుబడులు ఒక ఏడాదిలో రూ.50,000 వరకూ సెక్షన్ 80సీసీడీ(1బీ) కింద అదనంగా పన్ను మినహాయింపును కల్పిస్తూ కేంద్ర సర్కారు రెండేళ్ల క్రితం నిర్ణయం తీసుకోవడమే దీనికి ఆదరణ పెరగటానికి ప్రధాన కారణం. సెక్షన్ 80సీ కింద ఒక ఏడాదిలో నిర్దేశిత పథకాల్లో రూ.1.50 లక్షల పెట్టుబడులకు పన్ను మినహాయింపు ఉన్న విషయం తెలిసిందే. గతంలో ఎన్పీఎస్ను కూడా దీనిలో భాగంగానే చూసేవారు. కానీ రెండేళ్ల కిందట... ఎన్‌పీఎస్‌లో వార్షికంగా పెట్టే రూ.50 వేల వరకూ మొత్తానికి అదనపు పన్ను మినహాయింపునిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇది అధిక పన్ను పరిధిలో ఉన్న వారిని ఆకర్షించింది. దీంతో ఈ పథకంలో స్వచ్ఛందంగా చేరే సభ్యుల సంఖ్య ఏకంగా 148 శాతం పెరిగి 86,774 నుంచి 2.15 లక్షలకు చేరింది. 2016 బడ్జెట్ సందర్భంగా ఎన్పీఎస్ నిధి ఉపసంహరణ సమయంలో 40 శాతంపై పన్ను లేదంటూ ప్రభుత్వం ప్రకటించడం మరింత ఆకర్షణీయమయింది. అవ్యవస్థీకృత రంగం నుంచి చందాదారులు రెట్టింపై 4.39 లక్షలకు చేరారు.
పెట్టుబడులకు పలు అవకాశాలు
ఎన్‌పీఎస్‌లో చేరేందుకు ఎంతో మంది ముందుకొస్తున్నా... ఇందులో అందుబాటులో ఉన్న వాటిలో ఏది ఎంచుకోవాలన్నది అయోమయంగా ఉంటోంది. దీని నిర్వహణకు దాదాపు ఏడు ఫండ్లు, రిస్క్ ఆధారంగా వివిధ రకాల పెట్టుబడి తరగతులు ఉండడమే ఇందుకు కారణం. ఇందులో ఈక్విటీలు, ప్రభుత్వ సెక్యూరిటీలు, కార్పొరేట్ బాండ్లు అని మూడు వర్గాలున్నాయి. అసలు రిస్క్ భరించడానికి ఇష్టపడని (అల్ట్రాసేఫ్) ఇన్వెస్టర్లు 60 శాతం పెట్టుబడులు గిల్ట్ ఫండ్స్‌లో (ప్రభుత్వ బాండ్ల), 40 శాతం కార్పొరేట్ బాండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తారనుకుందాం. కొద్దిగా రిస్క్ తీసుకోగల సంప్రదాయ ఇన్వెస్టర్లు (కన్సర్వేటివ్) 20 శాతం స్టాక్స్‌లో, 30 శాతం కార్పొరేట్ బాండ్స్‌లో, 50 శాతం గిల్ట్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెడతారని అనుకోవచ్చు. మూడింటిలోనూ 33.3 శాతం చొప్పున సమానంగా పెట్టుబడులు పెట్టే బ్యాలెన్స్డ్ ఇన్వెస్టర్లు మరో రకం. ఇక రిస్క్ తీసుకునే ఇన్వెస్టర్లు 50 శాతం స్టాక్స్‌లో, 30 శాతం కార్పొరేట్ బాండ్లలో, 20 గిల్ట్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెడుతుంటారు. వీరి విషయంలో రాబడులు ఎలా ఉన్నాయనేది ఒకసారి చూద్దాం.
అల్ట్రాసేఫ్ ఇన్వెస్టర్లు
ఎన్‌పీఎస్‌లో బాండ్ ఫండ్స్ గత ఏడాదిలో 12 శాతం రాబడులనిచ్చాయి. కానీ, గడిచిన ఆరు నెలల్లో వీటి పనితీరు అంతంతమాత్రంగానే ఉంది. వడ్డీ రేట్ల నిర్ణయంలో ఆర్బీఐ కఠిన వైఖరి కారణంగా బాండ్ ఈల్డ్స్ పెరిగిపోవడంతో బాండ్ ఫండ్ల ఎన్ఏవీలు తగ్గిపోయాయి. అంతకుముందు వరకూ ఈ ఫండ్స్ పనితీరు చక్కగా ఉంది. 2015–16లో ఆర్బీఐ రేట్ల కోత, డీమోనిటైజేషన్ ఫలితంగా బాండ్ ఫండ్స్ మంచి రాబడులను ఇచ్చాయి. వీటిలో పెట్టుబడులు పెట్టిన వారు గణనీయమైన రాబడులనే పొందారు.
ఏ ఫండ్ బెటర్?
ఈ విభాగంలో ఎల్ఐసీ పెన్షన్ ఫండ్ మంచి పనితీరుతో ముందుంది. బాండ్ మార్కెట్లో ఎల్ఐసీకి అపార అనుభవం ఉండడం ఇందుకు కలిసొచ్చింది. గిల్ట్ ఫండ్స్ దీర్ఘకాల వ్యవధి గల బాండ్లలో ఇన్వెస్ట్ చేస్తాయి. కనుక వడ్డీ రేట్లపై వీటి రాబడులు ఆధారపడి ఉంటాయి. గతంలో వచ్చిన రాబడులతో పోలిస్తే గిల్ట్, కార్పొరేట్ బాండ్ ఫండ్స్ రాబడులు ఇటీవలి కాలంలో చాలా తక్కువగానే ఉన్నాయి.
సంప్రదాయ ఇన్వెస్టర్లు
దీర్ఘకాలం పాటు నూరు శాతం పెట్టుబడులను డెట్ విభాగంలోనే పెడితే ద్రవ్యోల్బణాన్ని తట్టుకుని మెరుగైన రాబడులను ఆర్జించడం కష్టం. అందుకే పెట్టుబడుల్లో కనీసం కొంతయినా ఈక్విటీలకు కేటాయించాలని నిపుణులు సూచిస్తుంటారు. ఎన్‌పీఎస్‌లో 20 శాతం పెట్టుబడులను ఈక్విటీలకు కేటాయించి, 80 శాతం డెట్‌కు (గిల్ట్, కార్పొరేట్ బాండ్లు) కేటాయించే వారు కూడా మంచి రాబడులనే అందుకున్నారు. స్వల్ప కాలంలో డెట్ విభాగం రాబడులు పడకేసినప్పటికీ... మధ్య కాలం, దీర్ఘకాలంలో మాత్రం పనితీరు బాగానే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
ఏ ఫండ్ బెటర్?
ఈ విభాగంలోనూ ఎల్ఐసీ పెన్షన్ ఫండే మంచి పనితీరును ప్రదర్శించింది. ఎందుకంటే 80 శాతం పెట్టుబడులు డెట్ విభాగానికి చెందినవి కావడమే. గత మూడేళ్లలో చూస్తే సిప్ విధానంలో పెట్టుబడులు పెట్టేవారికి రాబడులు 10.25 శాతంగా ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన ఎన్పీఎస్ విభాగంలో కూడా సంప్రదాయ ఇన్వెస్టర్లకు (ఈక్విటీలకు 15 శాతమే కేటాయించేవారు) సంబంధించి రాబడులు గత ఐదేళ్లుగా ఈపీఎఫ్ కంటే రెండు శాతం అధికంగా వచ్చాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎల్ఐసీ పెన్షన్ ఫండ్ మంచి రాబడులనిచ్చిన ఫండ్‌గా నిలిచింది. అయితే, ఈ పనితీరే భవిష్యత్తులోనూ ఉంటుందని చెప్పలేం.
బ్యాలెన్స్డ్ ఇన్వెస్టర్లు
ఈక్విటీలు, ప్రభుత్వ సెక్యూరిటీలు, కార్పొరేట్ బాండ్లలో 33.3 శాతం చొప్పున పెట్టుబడులు పెట్టేవారికి రాబడులు పైన చెప్పుకున్న అల్ట్రాసేఫ్, సంప్రదాయ ఇన్వెస్టర్ల కంటే ఎక్కువే ఉన్నాయి. ఏడాది క్రితం వరకూ బాండ్ల మార్కెట్లలో ర్యాలీ, తర్వాత ఈక్విటీ మార్కెట్లలో ర్యాలీ వీరికి కలసి వచ్చింది. దీనివల్ల ఇటీవలి కాలంలో బాండ్ల విభాగంలో రాబడులు తగ్గినప్పటికీ... ఈక్విటీల్లో గణనీయమైన రాబడులు వాటిని కవర్ చేసేశాయి.
ఏ ఫండ్ బెటర్?
ఈ విభాగంలో రిలయన్స్ క్యాపిటల్ పెన్షన్ ఫండ్ మంచి పనితీరును చూపింది. గత ఆరు నెలల్లో 14.03 శాతం రాబడులను ఇచ్చింది. కోటక్ పెన్షన్ ఫండ్ మాత్రం దీర్ఘకాలంలో ఆకట్టుకునే రాబడులను ఇచ్చింది. మూడేళ్ల కాలంలో సిప్ పెట్టుబడులపై రాబడులు 10.39 శాతంగా, ఐదేళ్ల కాలంలో సిప్పై రాబడులు 11.22 శాతంగా ఉన్నాయి.
అగ్రెసివ్ ఇన్వెస్టర్లు
ఈక్విటీలకు 50 శాతం, మిగిలిన 50 శాతం గిల్ట్, కార్పొరేట్ బాండ్ ఫండ్స్‌కు కేటాయించే రిస్క్ ఇన్వెస్టర్లు ఎన్‌పీఎస్‌లో అధిక రాబడులను అందుకుంటున్నారు. మార్కెట్ జీవిత కాల గరిష్ట స్థాయిల్లో ట్రేడవుతుండడం ఇందుకు ఓ కారణంగా చెప్పుకోవచ్చు. ఈ విభాగంలో కోటక్ పెన్షన్ ఫండ్ గడిచిన ఏడాది కాలంలో సగటున 16.3 శాతం రాబడులనిచ్చింది. యూటీఐ రిటైర్మెంట్ సొల్యూషన్స్ గడిచిన ఐదేళ్ల కాలంలో చూస్తే సిప్ పెట్టుబడులపై 11.78 శాతం సగటు రాబడులతో ముందుంది.
ఏ ఫండ్ బెటర్?
వాస్తవానికి యుక్తవయస్సులో ఉన్న వారు అధిక రిస్క్ తీసుకునేందుకు సిద్ధంగా ఉంటారు. వీరు 75 శాతం వరకూ ఈక్విటీలకు కేటాయించగలరు. వీరు అగ్రెసివ్ లైఫ్ సైకిల్ ఫండ్‌ను ఎంచుకున్నట్టయితే గడిచిన ఆరు నెలల్లో 10.8 శాతం రాబడులు అందుకునే వారు. ఈక్విటీలకు 75 శాతం వరకూ కేటాయింపులు చేసేందుకు అగ్రెసివ్ లైఫ్‌సైకిల్ ఫండ్, కేవలం 25 శాతమే ఈక్విటీలకు కేటాయింపులు చేసే కన్జర్వేటివ్ లైఫ్‌సైకిల్ ఫండ్ అంటూ గతేడాది ఎన్‌పీఎస్‌లో ప్రవేశపెట్టడం జరిగింది. అగ్రెసివ్ లైఫ్‌సైకిల్ ఫండ్‌లో ఇన్వెస్టర్‌కు 35 ఏళ్లు వచ్చిన తర్వాత ఏటా ఈక్విటీలకు 4 శాతం చొప్పున తగ్గించుకుంటూ వెళ్లడం జరుగుతుంది. 45 ఏళ్లు వచ్చిన తర్వాత 3 శాతం చొప్పున తగ్గుతూ వెళుతుంది.