రూ.53 కోట్లతో సామాజిక సేవా కార్యక్రమాలు
నిడదవోలు : లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గోల్డెన్ జూబ్లీ ఫౌండేషన్ ద్వారా దేశంలో ఇప్పటివరకు రూ. 53 కోట్ల రూపాయలతో వివిధ సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించినట్లు ఎల్ఐసీ సౌత్ ఇండియా జోనల్ చీఫ్ మేనేజర్ సునిల్‌కుమార్ పేర్కొన్నారు. మండలంలో శంకరాపురం గ్రామంలోని హృదయాలయానికి రూ.9 లక్షలు విలువ చేసే టాటా వింజర్ వాహనాన్ని శనివారం అందించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో ఆయన మాట్లాడుతూ 2006లో ఎల్ఐసీ గోల్డెన్ జూబ్లీ ఫౌండేషన్ ఏర్పడిందన్నారు.
ఈ ఫౌండేషన్ ద్వారా ఇప్పటివరకు 341 ప్రాజెక్ట్‌ల ద్వారా విద్య, వైద్య, పేద విద్యార్థుల ఉపకార వేతనాలు స్వచ్ఛంద సంస్థలకు చేయూత, ఆసుపత్రులకు పరికరాల కొనుగోలు వంటి సేవా కార్యక్రమాలను నిర్వహించమన్నారు. వీటి కోసం ఇప్పటి వరకు రూ. 53 కోట్లు ఖర్చు చేసినట్టు చెప్పారు. ఆర్థికంగా వెనుకబడిన పేద మెరిట్ విద్యార్థులకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకుంటే వారి చదువు కోసం ఎల్ఐసీ ఆర్థిక సహాయాన్ని అందిస్తుందని చెప్పారు. దేశవ్యాప్తంగా పేద విద్యార్థులకు రూ. 20 కోట్ల మేర ఉపకార వేతనాలని అందించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎల్ఐసీ రాజమండ్రి డివిజన్ మేనేజర్ జె.రంగారావు తదితరులు పాల్గొన్నారు.