'రెవెన్యూలో సర్వే వ్యవస్థ కీలకం'
విజయవాడ: రెవెన్యూలో సర్వే వ్యవస్థ అత్యంత కీలకమని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి కె.ఇ.కృష్ణమూర్తి అన్నారు. బుధవారం ఆయన విజయవాడ సబ్-కలెక్టర్ కార్యాలయంలో సర్వే అధికారులతో క్షేత్రస్థాయి సమస్యలను తెలుసుకునేందుకు నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రెవెన్యూలో రూపొందించిన నూతన సంస్కరణలలో భాగంగా సర్వే వ్యవస్థను ఆదునీకరించనున్నట్లు చెప్పారు. క్షేత్రస్థాయిలో సర్వేసిబ్బందికి శిక్షణా తరగతులు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.
రాష్ట్రవ్యాప్తంగా 623 ఈటీఎస్ (ఎలక్ట్రానిక్ టోటల్ స్టేసన్స్) మిషన్లు సరఫరా చేస్తున్నామన్నారు. వీటి ద్వారా నూతన పరిజ్ఞానంతో సిబ్బందికి శిక్షణ ఇస్తున్నామన్నారు. సర్వే వ్యవస్థ బలోపేతానికి మండల స్థాయిలో లైసెన్స్డు సర్వేయర్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. అన్ని జిల్లాల్లో సర్వేయర్లకు ల్యాప్టాబ్లు సరఫరా చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదించామన్నారు. రాష్ట్రంలో కొత్తగా 200 డిప్యూటీ సర్వేయర్ల పోస్టులను భర్తీ చేయనున్నట్లు చెప్పారు. క్షేత్ర స్థాయిలో సమస్యలు అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక ఇస్తామన్నారు.
ఖాళీలను భర్తీ చేయండి
ఈ సమావేశంలో పాల్గొన్న పలువురు సర్వేయర్లు, అసోసియేషన్ల నాయకులు మాట్లాడుతూ ఖాళీగా ఉన్న సర్వేయర్ల పోస్టులను భర్తీ చేయాలన్నారు. గ్రామాల్లో కరణం, మునసబు వ్యవస్థ రద్దయ్యాక సర్వే రాళ్లు కనుమరుగయ్యాయన్నారు. దాదాపు సర్వే వ్యవస్థ చిన్నాభిన్నమైందన్నారు. అందువల్ల గ్రామాల్లో వీఆర్ఓలకు సర్వే ట్రైనింగ్ ఇప్పించాలని సూచించారు. గ్రామ స్థాయిలో సర్వే అధికారి లేకపోతే వ్యవస్థ కుంటుపడుతుందన్నారు. సమావేశంలో సీసీఎల్ఏ (చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ రెవెన్యూ) అనిల్ చంద్ర పునీత, రెవెన్యూ కార్యదర్శి ఏ. వాణిమోహన్ తదతరులు పాల్గొన్నారు.