గంటల్లో గూళ్లు రెడీ!
వావ్ ఫ్యాక్టర్
పేదవారికి ఇళ్లు కట్టించి ఇవ్వాలన్నా, వరదల వంటి ప్రకృతి వైపరీత్యాల సమయంలో నిర్వాసితులయ్యే వారికి తాత్కాలికంగానైనా ఒక గూడు కల్పించాలన్నా ఎంత శ్రమో మనకు తెలియంది కాదు. ఈసమస్యకు ఇప్పటికే ఎందరో ఎన్నో రకాల పరిష్కార మార్గాలు చూపారు. తాజాగా చార్లెస్ అనే ఓ ఆర్కిటెక్ట్ ‘లైఫ్ ఆర్క్’ పేరుతో ఇంకో వినూత్నమైన సమాధానాన్ని సూచిస్తున్నారు. ఫొటోలోకనిపిస్తున్నవన్నీ నీటిపై ఏర్పాటు చేసిన ప్రీఫ్యాబ్రికేటెడ్ ఇళ్లు. వీటిని ఒకదానితో ఒకటి జతచేసుకుంటూ, ఒకేదగ్గర కాలనీలా, ఒక పల్లె మాదిరిగా ఏర్పాటు చేసుకోవచ్చు. హెచ్డీపీఈ పదార్థంతో రొటేషనల్ మౌల్డింగ్ అనే టెక్నాలజీతో సిద్ధమయ్యే ప్యానెళ్లను నట్లు, బోల్టులతో జోడించుకోవడం మాత్రమే మనం చేయాల్సిన పని.
ఒక్కో ఇంటికి కంటెయినర్ బాక్స్‌లోకి సులువుగా ఇమిడిపోయే దాదాపు 24 ప్యానెళ్ల అవసరముంటుంది. అన్నింటినీ కాలిఫోర్నియాలోని తన ఫ్యాక్టరీలోనే తయారు చేస్తున్నారు చార్లెస్. ప్యానెళ్లు తయారైన తరువాత వంటింటి అరుగు, ఎలక్ట్రిక్ వైరింగ్ వంటి అదనపు హంగులనుఇంకో ఫ్యాక్టరీలో ఏర్పాటు చేసుకోవచ్చు. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఈ ఇళ్లు దాదాపుగా స్వయం ప్రతిపత్తి కలిగి ఉంటాయి. అంటే విద్యుత్తు, నీళ్లు వంటి అవసరాల కోసం ప్రత్యేక ఏర్పాట్లు వీటిల్లోనే ఉన్నాయన్నమాట. నీటిపైనే కాకుండా నేలపై కూడా సునాయాసంగా కొన్ని గంటల వ్యవధిలో ఏర్పాటు చేసుకోవచ్చు.
ఒక్కోటి అరవై చదరపు మీటర్ల వైశాల్యంతో ఉంటాయి. ప్రస్తుతం అక్కడికక్కడే కాయగూరలు పండించుకునేందుకు కూడా ఈ లైఫ్ఆర్క్ ఇంట్లో హైడ్రోపోనిక్స్ ఏర్పాట్లు ఉన్నాయి. చార్లెస్ ఫ్యాక్టరీలో రోజుకు పది ఇళ్లకు సరిపడ ప్యానెళ్లు సిద్ధమవుతున్నాయి. అన్నీ సవ్యంగా సాగితే వీటిని వచ్చే మార్చి నాటికి డల్లాస్, టెక్సాస్ ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్నారు. ఈ చౌక ఇళ్లను అమ్మడం ద్వారా వచ్చే లాభాలతో మరిన్ని లైఫ్ఆర్క్లు నిర్మించి ప్రపంచవ్యాప్తంగా ప్రకృతి వైపరీత్యాల వల్ల నిర్వాసితులైన వారికి, శరణార్థి శిబిరాల ఏర్పాటుకూ ఉపయోగిస్తామంటున్నారు చార్లెస్.
– సాక్షి నాలెడ్జ్ సెంటర్