పోలీసుల అదుపులో బాబాడ్రైవర్
- మహబూబ్‌నగర్ జిల్లా ఎర్రవల్లి సమీపంలో పట్టుకున్న పోలీసులు
- మత్తు’లో ముంచేందుకు ముందే స్కెచ్
ఇటిక్యాల
హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో నివాసం ఉంటున్న ఓ వ్యాపారి కుటుంబానికి మాయమాటలు చెప్పి బంగారు, నగదుతో ఉడాయించిన దొంగబాబా కారుడ్రైవర్‌ను మహబూబ్‌నగర్ జిల్లా ఇటిక్యాల మండలం ఎర్రవల్లి సమీపంలో స్థానిక పోలీసులు బుధవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. ప్రముఖ రియల్ఎస్టేట్ వ్యాపారి, లైఫ్‌స్టైల్’ భవన యజమాని మధుసూదన్‌రెడ్డి కుటుంబసభ్యులకు మత్తుమందు కలిపిన భోజనం ఇచ్చి చేసి రూ.1.33కోట్లతో బాబా పరారైన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది.
ఈ ఘటన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు అప్రమత్తమయ్యారు. మహబూబ్‌నగర్ జిల్లా ఎస్సీ రెమా రాజేశ్వరి బెంగళూరుకు వెళ్లే అన్ని మార్గాల్లో విస్తృతంగా తనిఖీలు చేయాలని పోలీసుల వాట్సాప్ ద్వారా సమాచారం అందించారు. ఈ క్రమంలో బుధవారం రాత్రి అనుమానాస్పదంగా వేగంగా వెళ్తున్న ఓ ఇన్నోవా వాహనాన్ని పెబ్బేరు ఎస్ఐ రమేష్ నిలిపేందుకు యత్నించారు. కానీ ఆపకుండా వేగంగా వెళ్లడంతో తన సిబ్బందితో వాహనాన్ని వెంబడించారు. వెంటనే ఇటిక్యాల ఎస్ఐ సురేష్‌కు సమాచారం ఇవ్వడంతో చివరికి ఎర్రవల్లి చౌరస్తా వద్ద పెబ్బేరు, ఇటిక్యాల ఎస్ఐలు ఇన్నోవా (కేఏ03డి 7982) వాహనాన్ని ఎట్టకేలకు పట్టుకున్నారు.
కారు డ్రైవర్ షాజహాన్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఏం జరిగిందంటే..! మంగళవారం ఉదయం బెంగళూరులో ట్యాక్సీని హైదరాబాద్‌కు వెళ్లేందుకు అద్దెకు మాట్లాడుకున్నారని, రూ.16వేలకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. బుధవారం హైదరాబాద్‌లోని వెళ్లిన బాబా బృందం లైఫ్‌స్టైల్’ భవన యజమాని మధుసూదన్‌రెడ్డి ఇంటికి వెళ్లి వారికి మాయమాటలు చెప్పి మత్తు’లో ముంచి నగదుతో అక్కడి నుంచి పరారయ్యారు. నేరుగా ఓ పెద్ద హోటల్‌కు వెళ్లగా.. మరో వాహనం అతడి వద్దకు వచ్చింది. అక్కడ దొంగబాబా ఆ వాహనంలోని వ్యక్తులకు కొంతమేర డబ్బుల కట్టలను అందించాడు. వస్త్ర దుకాణాల్లో చేతికర్రలు ఉన్న బ్యాగులు కొని ఆ డబ్బుల కట్టలను కొన్నింటిని అందులో పేర్చి తన వాహనంలో వెనకసీట్లో బాబా కూర్చున్నాడని ట్యాక్సీడ్రైవర్ తెలిపినట్లు సమాచారం. అనంతరం మరోపెద్ద హోటల్‌కు వెళ్లి రెండుబ్యాగులతో వాహనం దిగి డ్రైవర్‌కారును పార్కింగ్ చేసి రమ్మని చెప్పినట్లు తెలిసింది. అదివరకే మార్గమధ్యంలోనే తనకారు అద్దెను రూ.16వేలను డ్రైవర్‌కు ఇచ్చినట్లు సమాచారం.
ట్యాక్సీ డ్రైవర్ కారును పార్కింగ్ చేసి వచ్చేలోపే దొంగబాబా కనిపించలేదని, సెల్‌ఫోన్‌ను సైతం స్విచ్చాఫ్ చేశాడని కారు డ్రైవర్ వివరాలు వెల్లడించినట్లు విశ్వసనీయ సమాచారం. హైదరాబాద్‌కు ట్యాక్సీ డ్రైవర్ ఎర్రవల్లి చౌరస్తాలో అదుపులోకి తీసుకున్న ట్యాక్సీ డ్రైవర్‌ను, వాహనాన్ని ఇటిక్యాల, పెబ్బేరు పోలీసులు బుధవారం రాత్రే హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పోలీసులకు అప్పగించినట్లు సమాచారం. ఇటిక్యాల, పెబ్బేరు పోలీసుల చాకచక్యంతో ట్యాక్సీ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో దొంగతనం కేసుదాదాపు పూర్తి కావచ్చినట్లేనని తెలిసింది. తనిఖీల్లో కానిస్టేబుళ్లు వెంకటేశ్వర్‌రెడ్డి, రాజు, ఇటిక్యాల పోలీస్‌స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.