ఐదు చోట్ల లెస్.. రెండు చోట్ల ఎక్సెస్
రూ.3,940కోట్ల డిండి పనులకు టెండర్లు ఖరారు
సాక్షి, హైదరాబాద్: మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లో ఫ్లోరైడ్ బాధిత ప్రాంతాలకు సాగునీరు అందించేందుకు ఉద్దేశించిన డిండి ఎత్తిపోతల పథకం పనుల ఆర్థిక టెండర్లు(ప్రైస్ బిడ్) సోమవారం ఖరారయ్యాయి. మొత్తంగా 7 ప్యాకేజీలకుగానూ రూ.3,940 కోట్ల పనులను ఎంఆర్కేఆర్, నవయుగ, ఎస్ఈడబ్ల్యూ, కేతన్, మెగా, హెచ్‌ఈఎస్, రాఘవ, మహాలక్ష్మి ఇన్ఫ్రా వంటి సంస్థలు పనులు దక్కించుకున్నాయి. నార్లాపూర్ నుంచి డిండికి నీటిని తీసుకునే అలైన్మెంట్ ఖారారు కానుందున, అంతలోగా నల్లగొండ జిల్లాలో ఖరారైన సింగరాజుపల్లి(0.8 టీఎంసీ), గొట్టిముక్కల(1.8 టీఎంసీ), చింతపల్లి(0.99 టీఎంసీ), కిష్టరాంపల్లి(5.68 టీఎంసీ), శివన్నగూడం(11.96 టీఎంసీ)ల రిజర్వాయర్లు వాటికి అనుబంధంగా మెయిన్ కెనాల్ పనులకు ప్రభుత్వం టెండర్లు పిలిచింది.
సోమవారం అధికారులు ఈ ప్రైస్‌బిడ్లను తెరిచారు.ఇందులో రూ.633.28 కోట్ల విలువైన ప్యాకేజీ-1 పనులను ఎంఆర్కేఆర్-నవయుగ 1.4 శాతం లెస్తో, రూ.394.38 కోట్ల విలువైన ప్యాకేజీ-2ను ఎస్ఈడబ్ల్యూ-కాంత్రి సంస్థ 2.1 శాతం ఎక్సెస్‌తో, ప్యాకేజీ-3లోని రూ.472.93 కోట్ల పనులను కేసీఎల్-ఎస్వీఆర్ సంస్థ 1.2 శాతం లెస్తో, ప్యాకేజీ-4లోని రూ.409.71 కోట్ల పనులను మెగా-హెచ్‌ఈఎస్‌లు 1.9 ఎక్సెస్‌తో, ప్యాకేజీ-5లో రూ.498.58 కోట్ల పనులను మహాలక్ష్మి-ఎస్ఎన్సీ 0.6 శాతం లెస్తో, ప్యాకేజీ-6లోని రూ.1289.59 కోట్ల పనులను రాఘవ-హెచ్‌ఈఎస్-నవయుగలు 0.5 శాతం లెస్తో, ప్యాకేజీ-7లోని రూ.241.77 కోట్ల పనులను ఎస్ఈడబ్ల్యూ-ఎస్‌ఎల్‌ఈసీ-సీఎంఆర్లు ఒక శాతం లెస్తో దక్కించుకున్నాయి. మొత్తంగా ప్రాజెక్టులోని 7 ప్యాకేజీల్లో 2 ప్యాకేజీల్లో ఎక్సెస్‌కు... 5 చోట్ల లెస్‌కు టెండర్లు దాఖలయ్యాయి.